కూలీల గుడిసెలు బుగ్గిపాలు | Sakshi
Sakshi News home page

కూలీల గుడిసెలు బుగ్గిపాలు

Published Mon, May 22 2017 2:04 AM

కూలీల గుడిసెలు బుగ్గిపాలు - Sakshi

ఆకస్మికంగా వ్యాపించిన మంటలు..
75గుడిసెలు దగ్ధం
రెండు ఆవులు సజీవదహనం..     
ఇద్దరు కూలీలకు గాయాలు..
రోడ్డున పడిన పేదల బతుకులు
తప్పిన ప్రాణనష్టం...
సమయానికి రాని ఫైరింజన్‌...

యాదగిరిగుట్ట/యాదగిరికొండ (ఆలేరు): వారివి రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు.. పొట్టచేతపట్టుకుని జిల్లాలు, రాష్ట్రాలు దాటి వలస వచ్చారు.. యాదాద్రి అభివృద్ధి పనుల్లో పాలుపంచుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు.. అక్కడే గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఏమైందో తెలియదు కాని మంటలంటుకుని నిమిషాల వ్యవధిలో గుడిసెలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రెండు ఆవులు సజీవ దహనం కాగా, కూలీల సామగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి.

యాదగిరిగుట్ట పట్టణం పరిధిలోని మల్లాపురం రోడ్డులో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా సాయిపావనీ సంస్థ పెద్దగుట్ట, యాదగిరికొండ ప్రాంతాల్లో చేపడుతున్న పనులు చేయడానికి బీహార్, ఒడిశా రాష్ట్రాలతో పాటు నల్లగొండ, దేవరకొండ, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల నుంచి కూలీలు వలస వచ్చారు. సుమారు ఏడాది కాలంగా అయ్యప్పకొండ సమీపంలో  గుడిసెలు వేసుకున్నారు. సుమారు 75కు పైగా గుడిసెలు, 5వందలకు పైగా మంది కూలీలు జీవిస్తున్నారు.

కూలీలంతా యాదాద్రి కొండపైకి, పెద్దగుట్టపైకి పనులకు వెళ్లిన సమయంలో ఓ గుడిసెలో వ్యాపించిన మంటలు పక్కకున్న గుడిసెల్లోకి పాకాయి. దీంతో ఎటూ పాలుపోక అక్కడున్న పిల్లలతో ఉన్న కూలీలంతా పరుగులు తీశారు. అప్రమత్తమై కూలీలు, సంస్థ అధికారులు పరిశ్రమలో పనిచేస్తున్న భారీ వాహనాలతో నీళ్లు తీసుకువచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలును చల్లార్చారే కానీ.. అందులో ఉన్న సామగ్రిని, నగదును తీసుకోలేకపోయారు.  

షార్ట్‌సర్క్యూటే కారణమా..?
ఈ గుడిసెలు అగ్నికి ఆహుతి కావడానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమా లేక గ్యాస్‌ సిలెండర్‌ లీక్‌ అయ్యిందా.. మండుటెండలకు అగ్నిప్రమాదం జరిగిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఒక్క గుడిసెలో నుంచి మంటలు వ్యాపించి వంట గ్యాస్‌ సిలిండర్‌కు అంటుకున్నాయని, దీంతో అది పేలి భారీగా మంటలు పక్క గుడిసెలకు అంటుకున్నట్లు స్థానికంగా ఉన్న కూలీలు చెబుతున్నారు. దీంతో ఆ గుడిసెల్లో ఉన్న వంట సామగ్రి, బట్టలు, కూలీల డబ్బులు సుమారు రూ.లక్ష, బంగారంతో పాటు కాలి బూడిదయ్యాయని కూలీలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ మంటలను చూసిన కూలీలు షాక్‌కు గురై అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.

రెండు ఆవులు సజీవ దహనం
మంటల్లో రెండు ఆవులు సజీవ దహనమయ్యాయి. రోజు వారీలాగే అక్కడ ఉన్న గుడిసెలో కూలీలు ఆవులను కట్టేసి పనులకు వెళ్లారు. భారీ స్థాయిలో మంటలు వ్యాపించడంతో ఆవులను అక్కడి నుంచి పంపించే వారు ఎవరు లేకపోవడంతో అవి మంటల్లోనే సజీవదహనమయ్యాయి. అంతే కాకుండా మంటలు ఆర్పుతున్న సమయంలో ఇద్దరి కూలీలకు గాయాలయ్యాయి. ఒక్కసారిగా పెద్దగా వచ్చిన మంటలతో కూలీలు అందులో చిక్కుకున్నారు. దీంతో కాళ్లు, చేతులు కాలిపోయాయి. కూలీలను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐలు గోపాల్‌దాస్‌ ప్రభాకర్, నాగిరెడ్డిలు పరిశీలించారు.

ప్రమాదం జరిగిన గంటకు కూడా..
భారీ అగ్ని ప్రమాదం జరిగిందని భువనగిరి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సుమారు గంటన్నర పాటు మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదం జరిగిన గంటకు కూడా ఫైరింజన్‌ రాకపోవడంతో స్థానికంగా సాయిపావనీ, సన్‌శైన్‌ సంస్థలకు చెందిన ట్యాంకర్లు, పెద్దపెద్ద మిషన్లు, ట్రాక్టర్ల ట్యాంకర్లతో నీళ్లు తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజన్‌ రావడంతో కూలీలు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వీళ్ల పరిస్థితి ఎట్లా...
వలస కూలీలుగా ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి యాదగిరిగుట్టకు వచ్చిన వారి గుడిసెలు దగ్ధం కావడంతో పరిస్థితి అయోమయంగా మారింది. వంటపాత్రలతో సహా కట్టు బట్టలు కూడా లేకుండా పిల్లలతో ఎక్కడ ఉండాలని ఆందోళన చెందుతున్నారు.

నాలుగు నెలల కిందట...
ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ రోజున సన్‌శైన్‌ సంస్థలో పనులు చేయడానికి వచ్చిన వలస కూలీల గుడిసెలు కూడా ప్రమాదవశాత్తు ఇలాగే మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. అప్పుడు గుడిసెల్లో ఉన్న కూలీలు పరుగు తీయడంతో  ప్రాణ నష్టం జరగలేదు. కానీ.. కూలీలు దాచుకున్న డబ్బులు, సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ రోజున జరిగిన అగ్నిప్రమాదంతో.. ప్రమాదాలు జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని అధికారులు చెప్పిన సంస్థలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

గుడిసెల్లో పైసలున్నాయి...
మాది నల్లగొండ జిల్లా. మేము సాయి పావనీలో రెండు నెలలుగా కూలీలను తీసుకువచ్చి పనులు చేయిస్తున్నా. ఇటీవల జీతాలు వచ్చిన డబ్బులు గుడిసెల్లోనే పెట్టాను. ఆకస్మికంగా వ్యాపించిన మంటలతో గుడిసెలు,దాచిపెట్టుకున్న డబ్బులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 75కు పైగానే గుడిసెలు దగ్ధమయ్యాయి. నేను తీసుకువచ్చిన కూలీల గుడిసెలు మొత్తం నేలమట్టామయ్యాయి.
– ప్రభుదాస్, మేస్త్రీ
రెండ్రోజుల కిందనే సొమ్ములు తెచ్చుకున్నా...

రెండ్రోజుల క్రితమే మా ఇంటికి వెళ్లాను. వచ్చేటప్పుడు ఇంటి వద్ద ఉన్న నల్లపూజల గొలుసు, రూ.10వేలు తీసుకువచ్చాను. వీటిని జాగ్రతగా గుడిసెలో దాచిపెట్టుకున్నా. మంటల్లో గొలుసుతో పాటు నగదు పూర్తిగా దగ్ధమైంది. ఆ సొమ్ములు, డబ్బులు ఇంటి వద్ద పెట్టుకున్న జాగ్రతగా ఉండేవేం. ప్రస్తుతం కట్టుబట్టలు తప్ప ఇంకేమి లేవు. మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి.
– లక్ష్మమ్మ, కూలీ
పిల్లలను తీసుకుని వలసొచ్చాం...

పిల్ల పాపలతో కూలీ పనులు చేయడానికి యాదగిరిగుట్టకు వలస వచ్చాం. సాయిపావనీలో భార్యభర్తలిద్దరికి కలిపి రూ.5వందలు వస్తే తిండికి, పిల్లలకు ఇబ్బందులు ఉండవని రెండు నెలల క్రితమే పనుల్లో చేరాం. గుడిసెలు దగ్ధం అవ్వడంతో మాతో  పాటు తెచ్చుకున్న బట్టలు, వంట సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగిన సమయంలో కొందరు పిల్లలు గుడిసెల్లోనే ఉన్నారు. ఆ గుడిసెలకు మంటల సెగ తగలకముందే పిల్లలను బయటకు తీసుకువచ్చాం.
–గంగమ్మ, కూలీ

Advertisement
Advertisement