రైతు నెత్తిన కి’రాయి’ | Sakshi
Sakshi News home page

రైతు నెత్తిన కి’రాయి’

Published Sat, Jan 7 2017 10:01 PM

రైతు నెత్తిన కి’రాయి’

ధాన్యం రవాణా సొమ్ము మిల్లర్ల ఖాతాల్లోకి
 తేమ శాతం ఎక్కువగా చూపి మద్దతు ధరలోనూ కోత
భీమవరం :
ఓ వైపు పెద్దనోట్ల రద్దు ప్రభావం.. మరోవైపు ఇన్‌పుట్‌ సబ్సిడీ, బ్యాంకు రుణాలు అందక అవస్థ పడుతున్న రైతులు ధాన్యం అమ్మకం విషయంలోనూ నిలువునా దోపిడీకి గురవుతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేవలం కమీషన్ల కోసమే పనిచేయడం.. అధికారులు పట్టించుకోకపోవడంతో అన్నదాతలు నష్టాల పాలవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించిన రైతులకు అందాల్సిన రవాణా చార్జీ (కిరాయి)లను మిల్లర్లు తన్నుకుపోతున్నారు. మరోవైపు ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపించి రైతులకు చెల్లించాల్సిన సొమ్ములో కోత విధించి దోపిడీ చేస్తున్నారు.
 
సాగిపోతోంది
నిబంధనల ప్రకారం ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి ఆ తరువాత మిల్లర్లకు ఇవ్వాలి. ధాన్యం సొమ్ముతోపాటు బస్తాలను కొనుగోలు కేంద్రానికి తరలించినందుకు గాను రవాణా చార్జీలను ప్రభుత్వమే రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు అప్పగించిందుకు గాను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కమీషన్‌ చెల్లిస్తారు. కొన్ని సందర్భాల్లో రవాణా చార్జీలను ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే రైతులకు చెల్లించి.. అనంతరం ప్రభుత్వం నుంచి వారు పొందేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా భిన్నంగా నడుస్తోంది. కొందరు రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించగా, కొన్నిచోట్ల దళారుల సాయంతో మిల్లర్లే వ్యవసాయ క్షేత్రాల నుంచి నేరుగా ధాన్యం సేకరించారు. ఐకేపీ కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై.. ఆ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలే రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు, అక్కడి నుంచి మిల్లులకు చేరవేసినట్టు రికార్డుల్లో నమోదు చేయిస్తున్నారు. ఆ ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తూ.. ఒక శాతానికి రూ.30 చొప్పున కోత వేస్తున్నారు. ఇలా ప్రతి రైతు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు నష్టపోతున్నారు. ఇలా చేయడం వల్ల ధాన్యం తరుగు రూపంలో రైతులకు నష్టం కలుగుతుండగా, ఆ మేరకు మిల్లర్లు లాభపడుతున్నారు. ఉదాహరణకు రైతు నుంచి 100 బస్తాల ధాన్యాన్ని మిల్లర్‌ నేరుగా తీసుకెళ్లి.. ఒక శాతం ఎక్కువ తేమ ఉన్నట్టు చూపిస్తే, ఆ ధాన్యం ఆరిన తరువాత సుమారు 50 కేజీల బరువు తగ్గిందనుకుంటే.. దానిని తరుగుగా నమోదు చేస్తారు. నిజానికి 17 శాతం తేమ శాతం ఉంటే ధాన్యం తరుగు ఉండదు. అంటే ఒక శాతం తేమ ఎక్కువ ఉన్నట్టు చూపిస్తే మిల్లర్‌కు 50 కేజీల ధాన్యం (అంచనా మాత్రమే) మిగులుతుంది. ఒక శాతం తేమ ఎక్కువ ఉన్నందుకు రైతు క్వింటాల్‌కు రూ.30 నష్టపోతాడు. మరోవైపు రైతుల నుంచి నేరుగా తాము ధాన్యం కొనుగోలు చేసి బస్తాకు రూ.60 చొప్పున ఎక్కువ ధర చెల్లిస్తున్నట్టు మిల్లర్లు చెబుతున్నప్పటికీ.. తేమ శాతం 17కంటే ఎక్కువ ఉన్నట్టు చూపించి ధరలో కోత వేస్తున్నారు. మరోవైపు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లలకు తరలించినందుకు తమకు రవాణా చార్జీలు చెల్లించాల్సి ఉందంటూ.. మొత్తం సొమ్మును మిల్లర్లే కాజేస్తున్నారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాలకు నేరుగా ధాన్యం తరలించిన రైతులకు రవాణా చార్జీలు అందటం లేదు. ఆ మొత్తాన్ని కూడా మిల్లర్ల ఖాతాలోనే అధికారులు జమ చేస్తున్నారు. జిల్లాలో సార్వా సీజన్‌లో సుమారు 5.94 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించగా, సుమారు 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం 161 ఐకేపీ కేంద్రాలు, 96 వ్యవసాయ సహకార పరపతి సంఘాల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సుమారు 75వేల మంది రైతుల నుంచి సహకార సంఘాలు సుమారు 4 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఐకేపీ కేంద్రాలు సుమారు 2.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 
 
తేమ పేరుతో రూ.30 వేలు నష్టపోయా
నాకు 8 ఎకరాల సొంత భూమి ఉంది. వరి సాగు చేయగా ఎకరాకు 25 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. మొత్తం ధాన్యాన్ని మిల్లుకు తోలాను. తేమ శాతం ఎక్కువగా ఉందని బస్తాకు కేవలం రూ.950 మాత్రమే చెల్లించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చేతికి అందకపోవడం వల్ల దాదాపు రూ.30 వేలు నష్టపోయాను.
 కాగిత దాననాగేశ్వరరావు, రైతు, రాయకుదురు
 
 
 
 
 
 
 

Advertisement
 
Advertisement