మంత్రి పేరు ప్రస్తావించని ఎమ్మెల్యే | Sakshi
Sakshi News home page

మంత్రి పేరు ప్రస్తావించని ఎమ్మెల్యే

Published Wed, Mar 9 2016 12:29 AM

మంత్రి పేరు ప్రస్తావించని ఎమ్మెల్యే - Sakshi

 కార్పొరేషన్‌కు రూ.20కోట్లంటూ టీడీపీలో గోల
 టీడీపీలో నిధుల దుమారం

  పొరుగు మంత్రి క్రెడిటేనంటున్న క్యాడర్
 ఎన్నికల్లోపు ఖర్చు చేసేయాలంటున్న జిల్లా మంత్రి

 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరాభివృద్ధి కోసం రూ.20కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన టీడీపీలో గందరగోళానికి తెరతీసింది. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు పేరు ప్రస్తావించకుండానే స్థానిక ఎమ్మెల్యే అటు సీఎంను, ఇటు మునిసిపల్ మంత్రి నారాయణ వల్లే నిధులొచ్చాయని టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించడాన్ని నాయకులు తప్పుబడుతున్నారు. తాను హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి, నారాయణల వద్ద స్థానిక సమస్యలు ప్రస్తావించిన సమయంలోనే నిధుల మంజూరీకి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే చెబుతున్నా, జిల్లా మంత్రి కృషి లేకుండానే నిధుల మాట ప్రస్తావిస్తారా? అంటూ అచ్చెన్న వర్గీయులు మథనపడుతున్నారని తెలిసింది.
 
  మంత్రి పేరు కాకుండా నారాయణ పేరు జపించడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు. 100రోజుల కార్యక్రమం పేరిట అపుడెపుడో మునిసిపల్ మంత్రి ఇక్కడకు వచ్చి సమీక్ష నిర్వహించడం, ప్రజల సమస్యల్ని లక్ష్యంగా చేసుకుని అధికారులు గడువులోగా కార్యక్రమం పూర్తిచేయాలని ఆదేశించడాన్ని ప్రస్తుతం గుర్తుచేసుకుంటున్నారు. అప్పటి కార్యక్రమంలో జిల్లా మంత్రే పూర్తిస్థాయిలో సమస్యల్ని ప్రస్తావించారని, అది జరిగిన చాలా రోజులకు నిధులు మంజూరు చేస్తున్నట్టు నారాయణ ప్రకటించారని దీని వెనుక మంత్రి క్రెడిట్ ఉంటే..ఆయన పేరు మాత్రం కనీసం ప్రస్తావించలేకపోవడం ఘోరం అంటూ మంత్రి అనుచరులు బాహటంగానే స్థానిక ఎమ్మెల్యేను నిందిస్తున్నారని తెలిసింది.
 
 వార్డుల్లో ఖర్చుచేసేయండి!
  కార్పొరేషన్‌కు నిధులొస్తున్నట్టు తెలుసుకున్న మంత్రి హుటాహుటిన స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడేశారు. ‘ఏప్రిల్-మే నెలల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.  గెల్చుకోవాలంటే ఆ నిధుల్ని మునిసిపల్ అభివృద్ధి పేరిట అన్ని వార్డుల్లోనూ ఖర్చుచేసేయాలి, ప్రజల్లో మాత్రం ఎన్నికల ప్రస్తావన రాకుండా టీడీపీ నాయకుల కృషి వల్లే నిధులొచ్చాయని ప్రచారం చేసేయండ‘ని మంత్రి మాట్లాడినట్టు తెలిసింది.  నిధుల ఖర్చు విషయంలో జన్మభూమి కమిటీ సభ్యులదే వేదవాక్కు అంటున్న టీడీపీ ప్రభుత్వం త్వరలో రానున్న నిధులకు సంబంధించి ఎమ్మెల్యే చెప్పినట్టే చేయాలంటూ ఆయా జన్మభూమి కమిటీ సభ్యులకు చెబుతుండడాన్ని వారూ జీర్ణించుకోలేకపోతున్నారు.
 
  ‘వార్డుల్లో తిరుగుతున్నది మేమే. కష్టసుఖాలు తెలుసుకుంటున్నది మేమే. అలాంటప్పుడు నిధుల ఖర్చు విషయంలో మాత్రం మా ప్రమేయం వద్దంటే ఎలా? అంటూ పలువురు సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. పార్టీ తరఫున ఇటీవల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన అంతర్గత సమావేశంలో ఇదే విషయం చర్చించుకున్నట్టు సమాచారం. ఈ సమీక్షకు ఏళ్ల నుంచీ పార్టీ జెండా మోస్తున్న వారిని కాదని కొత్త వ్యక్తుల్నే పిలవడం, స్థానిక ఎంపీకీ నిధుల ప్రస్తావన తెలియపర్చకపోవడం మరో విచిత్రంగా తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు.
 
  ఇదే సమయంలో తమకు రేషన్ కార్డులు కావాలని, ఇల్లు చూడాలని, మునిసిపల్ సమస్యలు పరిష్కరించాలని తన వద్దకు వస్తున్న జనానికి వచ్చే నిధుల్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలో తెలియక స్థానిక ఎమ్మెల్యే తికమక పడుతున్నారని తెలిసింది. మరోవైపు తన పేరిట వచ్చే నిధుల్లో జిల్లా మంత్రి ఎక్కడ చేయి పెట్టేస్తారోనని ఆమె వ ర్గీయులు వాపోతున్నారు.

Advertisement
Advertisement