నిరుద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న బాబు సర్కార్ | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న బాబు సర్కార్

Published Sun, Sep 4 2016 7:20 PM

gadapa gadapaku ysrcp program in Kollur

- ప్రభుత్వ మోసంపై తక్షణం విచారణ జరపాలి
- వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున


కొల్లూరు (గుంటూరు): బాబు వస్తే జాబు ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు యువతను ఉద్యోగాల పేరుతో మోసం చేసి వెట్టిచాకిరీ చేయించడం దారుణమని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరులో గడప గడపకూ వైఎస్‌ఆర్సీపీ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువకులతో ప్రభుత్వం ఆడిన చెలగాటాన్ని స్థానిక యువకులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

సోలార్ ప్లేట్‌లు బిగించడం, సాంకేతిక పరిజ్ఞానంలో రేపల్లెలో నెల రోజులు శిక్షణ ఇచ్చి, ఇక్కడ నుంచి చెన్నై తీసుకువెళ్ళి శిక్షణ ఇచ్చిన ఉద్యోగం కాకుండా బేల్దారి, ప్లంబింగ్, సెంట్రింగ్ వంటి పనులు జీతం సైతం చెల్లించకుండా చేయించారని యువకులు ఆయన ముందు వాపోయారు. ఇటువంటి పనులు చదువు లేకుండా అయినా చేసుకుంటామని, ఉద్యోగాలిస్తామని ఈ పనులు చేయించడమేంటని ప్రశ్నించగా మూడు నెలలు ఈ పనులు చేస్తేనే కాంట్రాక్టు బేసిక్‌లో ఉద్యోగాలు చూపుతామని తెలుపడంతో జరుగుతున్న మోసాన్ని గమనించి అక్కడ నుంచి తిరిగి వచ్చామని ఆయన ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమను అక్కడకు పంపింది సోషల్ వెల్ఫేర్ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎస్సీ కమీషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌లు అని ఆయనకు వివరించారు.

స్పందించిన మేరుగ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు యువతకు ఇస్తామన్న ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను అక్రమ పద్ధతిలో వెట్టి చాకిరీకి తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాలను ఆశగా చూపి దళిత యువతకు శిక్షణ ఇచ్చి నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు తీసుకువెళ్ళి కూలి పనుల్లో దింపడం టీడీపీ ప్రభుత్వ అకృత్యాలకు నిదర్శనమన్నారు. దళిత, పేద, నిరుద్యోగ యువతను సోషల్ వెల్ఫేర్ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎస్సీ కమీషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌లు ఇటువంటి కూలి పనులకు తరలించడం వెనుక ముఖ్యమంత్రి హస్తం కచ్చితంగా ఉందని ఆయన ఆరోపించారు.

లక్ష ఉద్యోగాలు ఇస్తామని యువతను మభ్య పెడుతున్న ప్రభుత్వం యువతకు ఇచ్చే ఉద్యోగాలు ఇవేనా అని ప్రశ్నించారు. చంద్రన్న చేయూత పేరుతో జరుగుతున్న యువకుల అక్రమ తరలింపుపై వెంటనే విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణం ప్రభుత్వం బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు చూపించాలని, లేని పక్షంలో జీతాలు సైతం ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలలో రాష్ట్రంలోని నిరుద్యోగులతో చేయిస్తున్న వెట్టి చాకిరీపై యువత తిరగబడి ప్రభుత్వాన్ని రోడ్డుకు ఈడ్చే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

Advertisement
Advertisement