సర్కారు బడిపై నమ్మకం పెంచాలి | Sakshi
Sakshi News home page

సర్కారు బడిపై నమ్మకం పెంచాలి

Published Sat, Nov 19 2016 3:26 AM

సర్కారు బడిపై నమ్మకం పెంచాలి - Sakshi

జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి    
ప్రాథమిక పాఠశాల తనిఖీ

 
 నేరడిగొండ : ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా పని చేయాలని ఆదిలాబాద్ ఇన్‌చార్జి కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, మధ్యాహ్న భోజనం అందుతున్న తీరుపై విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బోధనతోపాటు పరిసరాలు సక్రమంగా ఉండవనే అపనమ్మకం ప్రజల్లో ఉందని, దాన్ని పోగొట్టేలా అందరూ పని చేయూలని తెలిపారు. పాఠశాల పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకుండా చూడాలని ఎంఈవో భూమారెడ్డిని ఆదేశించారు.

కార్యాలయాల్లో తనిఖీ
మండలంలోని తహసీల్దార్, ఎంపీడీవో, పశువైద్యశాలలను తనిఖీ చేశారు. పశువైద్య శాల మూసి ఉండడంతో వెంటనే తెరిపించి రికార్డులు పరిశీలించారు. వైద్యాధికారి ఉదయం వచ్చి మధ్యాహ్నం వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉంచాలని అన్నారు. ప్రతి శుక్రవారం మండలంలోని గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్న గ్రామదర్శిని కార్యక్రమంపై మండల ప్రత్యేక అధికారి మధుసూదనచారిని అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీడీవో మహ్మద్ రియాజొద్దీన్, సూపరింటెండెంట్ చక్రపాణి, పంచాయతీ కార్యదర్శి నర్సారెడ్డి పాల్గొన్నారు.

అవకతవకలు జరగకుండా చూడాలి
ఇచ్చోడ : వ్యవసాయ మార్కెట్ యార్డులో అవకతవకలు జరగకుండా చూడాలని ఆదిలాబాద్ ఇన్‌చార్జి కలెక్టర్ కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రైతులు విక్రయిస్తున్న పత్తికి వ్యాపారులు డబ్బు ఏ రూపంలో ఇస్తున్నారని ఆరా తీశారు. మార్కెట్లో ఉన్న వెబ్రిడ్డికి స్టాంపింగ్ అందుబాటులో ఉంచకపోవడంతో మార్కెట్ కార్యదర్శి రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక తహశీల్దార్ మోహన్‌సింగ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement