అధికార పార్టీలో.. అసమ్మతి రాగం | Sakshi
Sakshi News home page

అధికార పార్టీలో.. అసమ్మతి రాగం

Published Tue, Jan 17 2017 11:43 PM

అధికార పార్టీలో.. అసమ్మతి రాగం - Sakshi

- ఎంపీ నిమ్మల, ఎమ్మెల్యే బీకే మధ్య ఆధిపత్య పోరు
- కొల్లు రవీంద్ర రాజీయత్నాలు విఫలం
- కదిరిలో కందికుంట వర్సెస్‌ అత్తార్‌ చాంద్‌బాషా
- ‘అనంత’, రాయదుర్గంలోనూ కుమ్ములాటలు


సాక్షిప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా? అధిష్టానం ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఎవరి రాజకీయం వారు చేస్తున్నారా? నేతల తీరుతో ద్వితీయశ్రేణి నాయకత్వం రెండుగా చీలిందా? ఈ పరిణామాలు ‘అనంత’ టీడీపీని మరింత బలహీనపరిచాయా?.. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పలు నియోజకవర్గాల్లో  కీలక నేతల మధ్య కొంతకాలంగా ఉన్న వర్గవిభేదాలు తారాస్థాయికి చేరి ఆధిపత్యపోరుగా మారాయి.

ఇవి ఏకంగా పార్టీని తీవ్రంగా నష్టపరిచే స్థాయికి వెళ్లాయి. దీన్ని గ్రహించిన అధిష్టానం తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టాలని పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ కొల్లు రవీంద్రకు బాధ్యతలు అప్పగించింది. రవీంద్ర నేతల మధ్య మంత్రాంగం నడిపి సమన్వయపరిచేందుకు యత్నించారు. అయితే.. నేతలు మాత్రం కడుపులో కత్తులు దాచుకుని రవీంద్ర ముందు కౌగిలించుకున్నట్లు నటించి, తిరిగి ఎవరి రాజకీయం వారు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీని ఏకతాటిపై నడపాల్సిన జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత అంతటి బాధ్యతను తీసుకోవాల్సిన ఎంపీలే విభేదాలకు ఆజ్యం పోయడం గమనార్హం.

పార్థ...కిష్టప్ప మధ్య ఆగని పోరు!
        ఎంపీ నిమ్మల కిష్టప్ప, పార్టీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బీకేపార్థసార«థి మధ్య కొంతకాలం విభేదాలు నడుస్తున్నాయి. పార్థ ప్రాతినిథ్యం వహిస్తోన్న పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని గోరంట్ల మండలం కిష్టప్ప సొంత మండలం. దీంతో మండలంలో జోక్యం చేసుకోవద్దని పార్థకు కిష్టప్ప చెప్పారు. పార్థ కూడా గోరంట్లను పూర్తిగా వదిలేసి తక్కిన మండలాలపైనే దృష్టి సారించేవారు. అయితే గోరంట్ల మండలంలోని పార్టీశ్రేణులను కిష్టప్ప గాలికి వదిలేయడం, పార్థ పట్టించుకోకపోవడంతో టీడీపీ బలహీనపడింది. పార్టీశ్రేణులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు.

దీన్ని గ్రహించిన పార్థ మరింత జాప్యం జరిగితే పార్టీకి  ప్రమాదం తప్పదన్న ఉద్దేశంతో గోరంట్ల మండల, గ్రామస్థాయి కన్వీనర్ల నియామకంలో జోక్యం చేసుకున్నారు. తన వర్గీయులను నియమించుకున్నారు. దీంతో కిష్టప్పకు చిర్రెత్తింది. గోరంట్లలో జోక్యంపై ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ పరిణామాల తర్వాత గోరంట్ల పార్టీ కేడర్‌ రెండుగా చీలింది. తన వర్గానికి పార్థ కాంట్రాక్టు పనులు ఇచ్చి ఆర్థికంగా అండగా నిలుస్తూ కేడర్‌ను నిలుపుకునే యత్నం చేస్తున్నారు. ఇదే తరహాలో తన వర్గీయులను కాపాడుకునేందుకు ఇన్నాళ్లూ నిర్లక్ష్యం వహించిన కిష్టప్ప కూడా ఎంపీ నిధులను కేటాయిస్తున్నారు.

ఎవరికివారు వర్గాలను ప్రోత్సహించారు. చివరకు ఒకే వేదికపై ఇద్దరూ ఉన్నా మాట్లాడుకోలేని పరిస్థితి తలెత్తింది. ఇది అధిష్టానం దృష్టికి చేరడంతో మంత్రి కొల్లు రవీంద్రకు సయోధ్య బాధ్యత అప్పగించింది. రవీంద్ర.. పార్థసారథిని కిష్టప్ప    ఇంటికి తీసుకెళ్లి రాజీ యత్నాలు చేశారు. ఆ తర్వాత కూడా పార్థసారథి, కిష్టప్ప తమ వర్గీయులను యథావిధిగా ప్రోత్సహిస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా కలిసి పనిచేయలేమని తేల్చిచెప్పింది. ఈ పరిణామాల తర్వాత గోరంట్లతో పాటు పెనుకొండ, ఇతర మండలాల్లో కూడా పార్థను బలహీనపరిచే చర్యలకు కిష్టప్ప ఉపక్రమిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కందికుంట, అత్తార్‌దీ అదే పరిస్థితి
వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే చాంద్‌బాషాను కందికుంటతో పాటు ఆయన వర్గీయులు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. పదవిని అడ్డుపెట్టుకుని కందికుంటను బలహీనపరిచేలా అత్తార్‌ ఎత్తులు వేశారు. అలాగే అత్తార్‌ను పూర్తిగా డమ్మీ చేసేలా కందికుంట పావులు కదిపారు. కదిరిలో టీడీపీ పరిస్థితి అంతంతమాత్రమే! ఈ క్రమంలో ఈ విభేదాలు ఆ పార్టీని మరింత దిగజార్చాయి. వీరిద్దరినీ కలిపేందుకు కొల్లు యత్నించారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవని గతేడాది కళ్యాణదుర్గం మినీమహానాడులో చెప్పిన కందికుంట అన్నట్లుగానే అత్తార్‌తో కలవలేకపోతున్నారు.

నకిలీ డీడీల కేసులో కందికుంటకు శిక్ష పడటంతో కన్విక‌్షన్‌(ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు) ఉంది. ఎన్నికల వరకూ అది అలాగే ఉండేలా చేసేందుకు అత్తార్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఒక్క అంశంలో సఫలమైతే కందికుంటకు చెక్‌పెట్టి టిక్కెట్టు దక్కించుకోవచ్చని, లేదంటే టిక్కెట్టు తనకు దక్కదనే యోచనలో ఉన్నారు. అత్తార్‌కు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. దీంతో కందికుంట.. నిమ్మలతో చేతులు కలిపి వీరిద్దరికీ వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలతో హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో టీడీపీ బలహీనపడింది.

‘అనంత’లో అదే లొల్లి
    ‘అనంత’ టీడీపీలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ప్లాస్టిక్‌రద్దు పేరుతో జేసీ అవలంబించిన చర్యలు ప్రజలకు చిర్రెత్తించాయి. నేతలా కాకుండా వీధిరౌడిలా ప్రజలను, వ్యాపారులను కొట్టి బెదిరించారని నగరవాసులు చర్చించుకుంటున్నారు. రాకరాక ‘అనంత’ సీటు టీడీపీకి వస్తే నేతల చర్యలతో భవిష్యత్తులో మరోసారి ప్రజలు ఆ అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఇది తెలిసి ఏకంగా చంద్రబాబు వీరిద్దరి మధ్య పంచాయితీ చేశారు. ఈ వ్యవహారంపై తనూ ఓ నివేదికను తెప్పించుకున్నారు.

అన్ని అంశాలను బేరీజు వేసిన చంద్రబాబు.. ‘ప్రభాకర్‌చౌదరి ఏరోజూ పార్టీ కోసం శ్రమించిన దాఖలాలు లేవు. గతిలేక అతనికి టిక్కెట్టు ఇవ్వాల్సి వచ్చింది. అతన్ని అదుపులో ఉంచండ’ని  జిల్లా నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ కీలక నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఇదే క్రమంలో దివాకర్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి వరకూ పరిమితం చేయడం ఉత్తమమని, ఇతని వ్యవహారశైలితో ఇతర నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌ ఇబ్బందులు పడుతోందనే అభిప్రాయాన్ని చంద్రబాబు బయటపెట్టినట్లు సమాచారం.

ఇది గ్రహించిన జేసీ ‘అనంత’లో మునుపటి దూకుడు తగ్గించారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు కులచిచ్చు తెరపైకి తెచ్చి రాజకీయం చేస్తున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా నేతల వైఖరితో వర్గాలుగా చీలిపోయిన ద్వితీయ, తృతీయశ్రేణి నాయకుల మధ్య భవిష్యత్తులో కలవలేనంత దూరం ఏర్పడింది. ఈ క్రమంలో నేతలు ఏకమైనా కేడర్‌ ఏకం కాదని, ఇది ప్రతిపక్షానికి అనుకూలంగా మారి, టీడీపీకి ప్రతికూలమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
Advertisement