ముంచెత్తిన వాన | Sakshi
Sakshi News home page

ముంచెత్తిన వాన

Published Thu, Sep 22 2016 12:37 AM

వరద నీటితో నిండిన వరంగల్‌లోని ఎన్‌టీఆర్‌ నగర్‌, (ఇన్‌సెట్‌లో) వరదలో కొట్టుకుపోయి మృతిచెందిన షబ్బీర్‌ అలీ(ఫైల్‌)

  • పాలకుర్తిలో జోరువాన
  • 15.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • పాలకుర్తి/పాలకుర్తి టౌన్‌ : పాలకుర్తి మండలంలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా 15.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు నిండి మత్తడి పోశాయి. చెన్నూరు, తొర్రూరు వీఆర్వో ఎండీ.షబ్బీర్‌అలీ (50) ద్విచక్రవాహనంపై వెళుతూ రాఘవపురం గ్రామ స్టేజీ సమీపంలో వరద నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు. వల్మిడిలోని ఎర్ర చెరువు నిండింది. ఉదయం రైతులు తమ వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో మత్తడి ప్రవాహం ఎక్కువైంది. మత్తడి కింద ఉన్న వాగులో చేబెల్లి శ్రీశైలం, పర్వతి సత్తయ్య, చేబెల్లి మల్లయ్య అనే రైతులు కొట్టుకు పోతూ ఓ చెట్టును పట్టుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు.
     
    మరికొంతమంది వరదలో చిక్కుకుపోవడంతో గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు తమ సిబ్బందితోపాటు ఫైర్‌ సిబ్బందిని పిలిపించి వాగులోకి దిగారు. ఫైర్‌ సిబ్బంది సదానందంతో పాటు గ్రామసర్పంచ్‌ రాపర్తి కొంరయ్య, ఎంపీటీసీ సభ్యుడు కత్తి సైదులు గ్రామస్తులు అంబటి లక్ష్మణ్‌, మిట్టపెల్లి ఎల్లేష్‌, ఉప్పలయ్య, రాములు, కుమార్‌, సోమనర్సయ్య తాడు సాయంతో సుమారు 2 గంటలు శ్రమించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతులను ఒడ్డుకు చేర్చారు. విస్నూరు గ్రామం చెరువులో భారీగా నీరు చేరడంతో అర్ధరాత్రి  ఎస్సీ కాలనీలోని ఇళ్లల్లోకి వరద చేరింది. జిలుకర వాసు ఇల్లు కూలి పోయింది. అరూరి మారేష్‌ ఇంటి గోడ కూలింది. విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడంతో కాలనీవాసులు చీకట్లో బిక్కుబిక్కుమంటూ తెల్లవారే వరకు కాలం గడిపారు. మండలంలో పలు గ్రామాల్లో కంది, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలే కాకుండా పాలకుర్తి - విస్నూరు బీటీ రోడ్డు పలు చోట్ల ధ్వంసమైంది. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేల కొరిగాయి. వీఆర్వో కుటుంబ సభ్యులు, వరద బాధితులను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. 
     
    ఎస్సైని అభినందించిన ప్రజలు
    అర్ధరాత్రి విస్నూరు ఎస్సీ కాలనీలోకి నీరు చేరిందనే సమాచారం అందిన వెంటనే పాలకుర్తి ఎస్సై వెంకటేశ్వర్లు జేసీబీని తీసుకుని కాలనీ చేరకున్నారు. ఎర్రబెల్లి రాఘవరావు సహకారంతో రోడ్డును తవ్వి నీటిని మళ్లించి కాలనీ వాసులను రక్షించారు. వల్మిడి గ్రామ వాగులో కొట్టుకు పోతున్న రైతులను రక్షించడం కోసం స్వయంగా చెరువులోకి దిగారు. రైతులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఎస్సైని స్థానికులు అభినందించారు. 
     
    దేవరుప్పులలో అత్యధికంగా 208 మిల్లీమీటర్ల వర్షం
     
    హన్మకొండ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, జలశయాలు నీటితో నిండాయి. చాలా చెరువులు మత్తడి పోస్తున్నాయి. చేర్యాలలో 23.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మద్దూరులో 28.2, నర్మెటలో 31.4, బచ్చన్నపేటలో 36.2; జనగామలో 110.4, లింగాలఘణపురంలో 98, రఘునాథపల్లిలో 130.4, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 150; ధర్మసాగర్‌లో 97.2, హసన్‌పర్తిలో 45, హన్మకొండలో86.8, వర్ధన్నపేటలో 41.2, జఫర్‌గడ్‌లో 13.8, పాలకుర్తిలో 150.4, దేవరుప్పులలో 208 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 
     
     కొడకండ్లలో 28, రాయపర్తిలో 35.4, తొర్రూరులో 106.4, నెల్లికుదురులో 45.4, నర్సింహుల్‌పేటలో 5.6, మరిపెడలో 13.4, డోర్నకల్‌లో 22.4, కురవిలో 66.2, మహబూబాబాద్‌లో 35, కేసముద్రంలో 73.2, నెక్కొండలో 55.8, గూడూరులో 73.8, కొత్తగూడలో 96.2 ఖానాపురంలో 62.6, నర్సంపేటలో 50.2, చెన్నారావుపేటలో 28.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పర్వతగిరిలో 56.4, సంగెంలో 30.2, నల్లబెల్లిలో 40.2, దుగ్గొండిలో 26.2, గీసుకొండలో 28.4, ఆత్మకూరులో 52.6, శాయంపేటలో 58.4, పరకాలలో 46.8, రేగొండలో 10.2, మొగుళ్లపల్లిలో 8.6, చిట్యాలలో 9.4, భూపాలపల్లిలో 10.6, గణపురంలో 20.4; ములుగులో 10.4; వెంకటాపురంలో 15, గోవిందరావుపేటలో 10.2, తాడ్వాయిలో 20.6, ఏటూరునాగారంలో 13, మంగపేటలో 25.4, వరంగల్‌లో 56 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 
     

Advertisement
Advertisement