Sakshi News home page

మహారాష్ట్రతో ఒప్పందం.. చారిత్రాత్మక తప్పిదం

Published Thu, Sep 22 2016 7:54 PM

మహారాష్ట్రతో ఒప్పందం.. చారిత్రాత్మక తప్పిదం - Sakshi

‘ప్రాణహిత-చేవెళ్ల’ పేరు, డిజైన్‌ మార్పుతో జిల్లాకు అన్యాయం
టీడీపీ జిల్లా ఇన్‌చార్జి సుభాష్‌యాదవ్‌


మేడ్చల్‌: గోదావరి జలాల కోసం మహరాష్ట్రతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసిందని, జిల్లాను సాగు, తాగు నీటి రంగంలో సస్యశామలం చేయడానికి గత ప్రభుత్వాలు చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ పేరు, డిజైన్‌ మార్చడంతో జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని టీడీపీ జిల్లా ఇన్‌చార్జి సుభాష్‌యాదవ్‌ ఆరోపించారు. మేడ్చల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తోటకూర జంగయ్యయాదవ్‌, మండల నాయకులతో కలిసి మేడ్చల్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశం‍లో మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ పేరు మార్చి, దాని స్థానంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరందిస్తామని చెబుతున్న అధికార పార్టీ నాయకుల మాటల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ద్వారా వచ్చే నీరు పాలమూరు జిల్లాకే సరిపోవన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ పేరును పునరుద్ధరించి, ఆ ప్రాజెక్ట్‌కు జాతీయహోదా వచ్చేలా ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి అధిక నీరు రావాల్సి ఉండగా.. 147 ఫీట్ల ఎత్తుకు పెంచాలని ఒప్పందం చేసుకోవడంవల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు.

        మహరాష్ట్రలో ప్రాజెక్టులను 152 ఫీట్ల ఎత్తుకు పెంచేందుకు ఒప్పందం చేసుకుంటే.. ఆ రాష్ట్రంలో 1,852 ఎకరాలు మునుగుతాయని, ఆ భూమిని ఆంధ్రప్రదేశ్‌లాగా తెలంగాణలోకి తీసుకోవాలని, అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. రైతుల సమస్యలపై ఈనెల 26, 27 తేదీల్లో నగరంలోని ఇందిరాపార్క్‌ వద్ద చేయనున్న ధర్నాకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేయకపోవడంపై ధర్నా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంధర్భంగా ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మేడ్చల్‌ జెడ్‌పీటీసీ సభ్యురాలు శైలజ, మండల టీడీపీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకుడు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహగౌడ్‌, నాయకులు గోపని వెంకటేవ్‌, మల్లికార్జున్‌ ముదిరాజ్‌, సూర్యం, చాపరాజు, శివకుమార్‌, మురళి, నర్సింమ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement