సెంటు భూమినీ లెక్కిస్తాం | Sakshi
Sakshi News home page

సెంటు భూమినీ లెక్కిస్తాం

Published Fri, Oct 21 2016 11:11 AM

సెంటు భూమినీ లెక్కిస్తాం - Sakshi

♦ సాదాబైనామాలకు త్వరలో పట్టాలు
♦ కౌలురైతులకు గుర్తింపు కార్డులు
♦ పౌర సరఫరాల వ్యవస్థను బలోపేతం చేస్తా
♦ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట
♦ ఎస్సారెస్పీ భూ నిర్వాసితులకు పరిహారం
♦ జాయింట్‌ కలెక్టర్‌ సంజీవరెడ్డి

సాక్షి, సూర్యాపేట : ప్రభుత్వ, ప్రైవేట్‌ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.. భూమిలో పంటల సాగు, ఇతర అవసరాలకు వినియోగం మొదలైన అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేయిస్తాం.. సెంటు భూమినీ లెక్కించి రికార్డుల్లో భద్రపరుస్తాం.. సాదాబైనామాలకు త్వరలో పట్టాలందజేస్తాం.. పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టంగా అమలు పరిచేందుకు ప్రత్యేక కమిటీలు వేస్తాం.. ఆన్‌లైన్‌ ద్వారా భూ వివరాల సేకరణను అందుబాటులో ఉంచుతామని జాయింట్‌ కలెక్టర్‌ సంజీవరెడ్డి అన్నారు.. నూతనంగా ఏర్పడ్డ జిల్లాలోని ప్రభుత్వ భూమి.. పరిరక్షణ, పౌరసరఫరాల వ్యవస్థ మొదైలన అంశాలపై సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే
 క్రమమైన పద్ధతిలో భూ వివరాల సేకరణ
మీరన్నది నిజమే.. భూ విస్తీర్ణం లెక్క ఉంటుంది. కానీ ఏయే భూమి, ఏయే అవసరాలకు వినియోగిస్తున్నారో అన్న విషయంపై స్పష్టత లేదు. అయితే క్రమమైన పద్ధతిలో భూ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాం. ఈ పహాణీ, అడంగళ్‌ పహాణీ, ప్రభుత్వ భూములు మొదలైన వివరాల కోసం వీఆర్వో స్థాయి నుంచి తహసీల్దార్‌ వరకు పరిశీలించాలని ఆదేశించాం. త్వరలో వివరాలన్నీ సేకరిస్తాం. దీంతో ఏయే భూమిలో ఏ పంట సాగు చేశారు. ఏ పంట ఎంత ఉత్పత్తి సాధించామన్న విషయాలు కూడా తెలుస్తాయి.

సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో యంత్రాంగం
 భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ భూమిపై హక్కు కల్పించాలన్నదే మా లక్ష్యం. అందుకోసం వారికి పట్టాదారు పాస్‌పుస్తకాలు 13 (బి), 13 (సి)ని అందజేయాలనే ఆలోచనతోనే సాదాబైనామాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాం. 2–06–2014 నాటికి సూర్యాపేట జిల్లా నుంచి 1,10,346 సర్వేనంబర్లకు సంబంధించిన 1,04,256 మంది సాదాబైనామాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించే పనిలో యంత్రాంగం ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే ఐదెకరాల లోపు భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి పట్టేదారు పాస్‌పుస్తకాలు అందజేస్తాం.

అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో..
గ్రామం నుంచి జిల్లా వరకు ఎక్కడెక్కడ భూమి ఎంత ఉంది. పట్టేదారు భూమి ఎంత.. చెరువు శిఖం, ఇతర ప్రభుత్వ భూముల వివరాలన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచాం. మరికొన్ని వివరాలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కరు తమ భూమి వివరాలను ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. అదే విధంగా ఎస్సార్, ఎంఆర్‌ఓ సిస్టమ్‌ ద్వారా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో భూమి రిజిస్ట్రేషన్‌ కాగానే అది తహసీల్దార్‌ కార్యాలయంలోకి లాగిన్‌ అవుతుంది. దీంతో ఎవరి ప్రమేయం లేకుండానే రెవెన్యూ రికార్డుల్లో భూ వివరాలు నమోదవుతాయి. దీంతో పహాణీలు తీసుకోవడం ఇతర అవసరాల కోసం భూ వివరాలను సేకరించడం సులువుగా ఉంటుంది.

పకడ్బందీగా కౌలు రైతుల చట్టాల అమలుకు ప్రణాళిక
కౌలు రైతుల చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. వీఆర్వోల వద్ద ఉన్న కౌలు రైతు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని రైతు పూర్తి వివరాలతో అందజేస్తే కౌలు రైతులకు గుర్తింపుకార్డులిస్తాం. దీంతో సబ్సిడీపై వచ్చే ఎరువులు, విత్తనాలు సులువుగా తీసుకోవచ్చు. పంట నష్టం జరిగినప్పుడు పరిహారం కూడా కౌలు రైతుకే చేరుతుంది. ఈ విషయంలో భూ యజమానికి ఎటువంటి సంబంధం లేకుండా కౌలు రైతులకు లబ్ధిచేకూరుతుంది.

గిట్టబాటు ధరకు ధాన్యం కొనుగోలు
రైతు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లాలో 19 కేంద్రాల ద్వారా 40 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశాం. ఇందుకోసం 60 కోట్ల రూపాయలు కూడా కేటాయించాం. అయితే రైతులు చేయాల్సింది 17 శాతం కంటే తక్కువ తేమ ఉండేలా చూసుకోవాలి. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ప్రస్తుతం ఉన్న కేంద్రాలు సరిపడక పోతే రైతుల కోరిక మేరకు కొత్త కేంద్రాలను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు
ప్రభుత్వం పేదలకు అందజేసే బియ్యం, నిత్యావసర వస్తువులు పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం. గ్రామస్థాయిలో ఆహారసలహాదారుల సంఘం ద్వారా ప్రతినెలా సమావేశం ఏర్పాటుచేసి నిత్యావసర వస్తువులు అందుతున్న తీరును పరిశీలిస్తాం. సర్పంచ్, వీఆర్వో, ఇతర సభ్యులు ఉంటారు. కాబట్టి ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు సకాలంలో అందే అవకాశముంది. రేషన్‌ బియ్యం దారి మళ్లించే విషయంపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి ప్రాంతాల్లో పలు కేసులు బుక్‌ చేశాం. చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాం.

నివేదిక రాగానే పరిహారం
జిల్లాలోని నాగారం, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం ప్రాంతాల్లో ఎస్సారెస్పీ కాల్వలు వెళ్లిన 300 ఎకరాలకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం అందించాల్సి ఉంది. అందుకోసం ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను నియమించాం. వారి నుంచి నివేదిక రాగానే రైతులకు పరిహారం అందజేస్తాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement