డెంగీ లక్షణాలుంటే తక్షణమే స్పందించాలి | Sakshi
Sakshi News home page

డెంగీ లక్షణాలుంటే తక్షణమే స్పందించాలి

Published Fri, Sep 23 2016 10:55 PM

immediately respond to dengue norms

అనంతపురం సిటీ : జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డెంగీ లక్షణాలున్నట్లు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే రక్త నమూనాలు తీసుకొని, చికిత్స అందించాలని వైద్యాధికారులను వైద్యారోగ్యశాఖ జేడీ వెంకటరత్నం ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ జేడీ వెంకటరత్నం, వైద్యాధికారి వెంకటరమణ, సూపరింటెండెంట్‌ జగన్నాథ్, ఆర్‌ఎంఓ వెంకటేశ్వరరావు, హెచ్‌ఓడీ వెంకటేశ్వరరావుతో కలసి సర్వజనాస్పత్రిలోని పలు వార్డులను సందర్శించారు. ప్రత్యేకంగా జ్వరాల కోసం ఏర్పాటు చేసిన ఓపీని పరిశీలించారు.

అనంతరం వెంకటరత్నం మాట్లాడుతూ వైద్యులు విధుల్లోకి రాగానే వార్డులను పూర్తిగా తిరిగి చాంబర్‌కు చేరుకోవాలన్నారు. రోగుల సంఖ్య పెరగుతున్న విషయాన్ని గుర్తించి, ప్రత్యామ్నాయ మార్గాల కోసం జిల్లా కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లాలన్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌లు కూడా 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ వస్తే తక్షణం ఎలీసా పరీక్ష చేయాలన్నారు. ప్లేట్‌లెట్‌ కౌంట్స్‌ తగ్గుతున్నట్లు తెలిస్తే ప్రమాదకర స్థాయికి పడిపోయేలోపు రోగి బంధువుల సహకారంతో తక్షణ వైద్యం చేపట్టాలన్నారు.  
సిబ్బంది కొరతను ఎవరూ పట్టించుకోలేదు
ఆస్పత్రిలో విషజ్వరాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది.. కానీ వైద్యుల కొరత, సహాయక సిబ్బంది కొరత తీర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు.. మేమెలా ఉద్యోగాలు చేయాలని అని  వైద్యాధికారులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌ ఎదుట ఏకరువు పెట్టారు. ప్రతి ఒక్కరూ రావడం.. రోగుల పరిస్థితి ఎలా ఉందంటూ ఆరా తీయడం పరిపాటిగా మారిందని వాపోయారు. సిబ్బంది కొతర తీరుస్తాం.. ఎలాంటి సౌకర్యాలు కావాలి? అని అడిగేవారు కరువయ్యారన్నారు. ఇదంతా  శుక్రవారం ఆస్పత్రిలోని సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌ ఛాంబర్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటరత్నం ఎదుటే జరిగింది. సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌ స్పందించి మరో ఇద్దరిని చిన్న పిల్లల వార్డుకు సర్దుబాటు చేసేందుకు హెచ్‌ఓడీ మల్లేశ్వరిని పిలిపించి మాట్లాడారు.

Advertisement
Advertisement