కడప గడపలో క్రికెట్‌ సందడి | Sakshi
Sakshi News home page

కడప గడపలో క్రికెట్‌ సందడి

Published Sat, Oct 8 2016 8:18 PM

కడప గడపలో క్రికెట్‌ సందడి - Sakshi

కడప స్పోర్ట్స్‌ :
కడప గడపలో నెలరోజుల పాటు క్రికెట్‌ సందడి కొనసాగనుంది. ఈనెల 10 నుంచి ప్రారంభమయ్యే కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 అంతర్‌ రాష్ట్రాల క్రికెట్‌ పోటీలు నవంబర్‌ 10 వరకు ప్రజలకు కనువిందు చేయనున్నాయి.
– కడప లోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు ఆంధ్రా–పంజాబ్‌ జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 24 నుంచి 27వ తేదీ వరకు ఆంధ్రా–ఢిల్లీ జట్లు, అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 3 వరకు ఆంధ్రా–మధ్యప్రదేశ్‌ జట్టు, నవంబర్‌ 7 నుంచి 10వ తేదీ వరకు ఆంధ్రా–రైల్వేస్‌ జట్లు తలపడనున్నాయి. రాష్ట్రస్థాయి మ్యాచ్‌ల కోసం వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
మ్యాచ్‌లను కడప ప్రజలు వీక్షించండి..
  రాష్ట్ర క్రికెట్‌ మ్యాచ్‌లను కడప ప్రజలు వీక్షించాలని కడప క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. శనివారం వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి మాట్లాడుతూ  4 స్టేట్‌మ్యాచ్‌లు నిర్వహించనున్నామని.. ఎలైట్‌ గ్రూప్‌ బీ పోటీల్లో భాగంగా కొత్త నిబంధనలతో  మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైజాగ్‌ తర్వాత మూడు క్రికెట్‌ మైదానాలు ఉండేది కడపలోనేనన్నారు.  
ముగ్గురు క్రీడాకారులకు జట్టులో చోటు..
కల్నల్‌ సీకే నాయుడు అండర్‌–23 అంతర్‌ రాష్ట్రాల క్రికెట్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనే ఆంధ్రా జట్టులో కడప క్రీడాకారులకు ముగ్గురికి చోటు లభించడం హర్షణీయమని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి తెలిపారు. నరేన్‌రెడ్డి, జయవర్ధనే, సీహెచ్‌ భరద్వాజ్‌లు ఆంధ్రా జట్టులోచోటు దక్కించుకున్నారన్నారు. మహిళల క్రికెట్‌లో సైతం జిల్లా నుంచి శ్రీలక్ష్మి, రోజా, శిరీషలు ఇప్పటికే రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారన్నారు.  కార్యక్రమంలో సౌత్‌జోన్‌ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, కోశాధికారి వై. శివప్రసాద్, సంయుక్త కార్యదర్శులు ఎ. నాగసుబ్బారెడ్డి, సంజయ్‌కుమార్‌రెడ్డి, సభ్యులు మునికుమార్‌రెడ్డి, ఖాజామైనుద్దీన్, రవికుమార్‌ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement