రహదారుల రక్తదాహం! | Sakshi
Sakshi News home page

రహదారుల రక్తదాహం!

Published Thu, Sep 14 2017 9:08 AM

ఓర్వకల్లు సమీపంలో రోడ్డు ప్రమాద దృశ్యం(ఫైల్‌) - Sakshi

 జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ఏటా 1800పైగా ప్రమాదాలు
మృతులు 600 పైమాటే
ద్విచక్ర వాహన ప్రమాదాలే అధికం
జిల్లాలో 47 బ్లాక్‌ స్పాట్ల గుర్తింపు
అతివేగం, నిద్ర, నిర్లక్ష్యంతోనే అధిక ప్రమాదాలు
ప్రాణాలు తీస్తున్న అధ్వాన రహదారులు
జిల్లాలో దెబ్బతిన్న రహదారులు 737 కిమీ
చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం


వాహనంపై బయటకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి వస్తాడో, లేదోననే భయం నేడు కుటుంబ సభ్యులను వెన్నాడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. రోజూ ఏదొక ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకోవడం.. విలువైన ప్రాణాలు కోల్పోవడం..ఆందోళన కల్గిస్తోంది. నాగరికతకు చిహ్నాలైన రహదారులు ఛిద్రమవడం.. మలుపుల వద్ద ప్రమాద సూచికలు లేకపోవడం..అతివేగం.. ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. జిల్లాలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్నా వాటి నివారణకు చేపట్టిన చర్యలు చాలా తక్కువేనని చెప్పవచ్చు.   
 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)  :  
జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. యేటా సరాసరిగా 1,800పైగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏటా 600 మందిపైగా మృత్యువాత పడుతన్నారంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.  ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో చనిపోతున్నా వారే 25 శాతం మంది ఉండడం గమనార్హం. వేగంగా ప్రయాణించడం.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం..అధ్వాన రహదారులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు చేపట్టిన చర్యలు తూతూమంత్రమే అని చెప్పవచ్చు.  

మృత్యు గుంతలు..
రహదారులపై ఒక్కసారిగా వచ్చే గుంతలతో ద్విచక్రవాహనదారులు ఎక్కువగా ప్రమాదం బారినపడుతున్నారు. దీనికి తోడు యువత అతివేగంతో ముందు వెళ్లే వాహనాలను ఓవర్‌టేక్‌ చేస్తూ ఢీకొట్టించడం, వేగం అదుపుతప్పడం తదితర కారణాలతో యేటా 440పైగా ద్విచక్రవాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో సరాసరిగా యేటా 150 మంది చనిపోతున్నారు. మృతుల్లో ఎక్కువగా 25 ఏళ్లలోపు యువత ఉండడం గమనార్హం.

ఉత్తుత్తి భద్రతా వారోత్సవాలు...
యేటా పోలీసులు, ఆర్టీసీ, ఆర్‌టీఓ అధికారులు ఉమ్మడిగా రోడ్డు భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కోసం సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తారు. వీటి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా అవన్నీ ఆచరణలోమాత్రం కనిపించడంలేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

పడకేసిన ఇంటర్‌సెక్టార్‌ సేవలు
కర్నూలు జిల్లాలో రోడ్డు భద్రతా పరంగా ఆరుసబ్‌ డివిజన్లు ఉన్నాయి. మొత్తం జిల్లాలో సుమారు 6.46 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఇందులో ద్విచక్రవాహనాలే సుమారు లక్ష వరకు ఉండవచ్చు. సబ్‌ డివిజన్ల పరిధిలో పోలీసు స్టేషన్లు పరిధిలో నిరంతరం తనిఖీలు చేస్తే అతివేగానికి కళ్లెం వేయవచ్చు. అతివేగంతో దూసుకొస్తున్న వాహనాలను నిలుపదల చేసేనాథుడు కనిపించడంలేదు. జాతీయ, రాష్ట్రీయ, జిల్లా రహదారుల్లోనూ అతివేగంతో వస్తున్న వాహనాలు అధికంగానే కనిపిస్తున్నాయి. వీటిని నిరోధం కోసం జిల్లాకు కేటాయించిన ఇంటర్‌సెక్టార్‌ సేవలు పడకేశాయి.  

నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఇవే..
జాతీయ రహదారిపై ఉన్న  ఓర్వకల్లు   
కర్నూలులో వెంకటరమణ     కాలనీ మలుపు   
ఆదోని మండలం పెద్ద తుంబళం వద్ద
ఆస్పరి మండలంలో కొన్ని ప్రదేశాలు..
కర్నూలు–కడప జాతీయ రహదారిపై అల్ఫా కళాశాల
పాణ్యం మండలం సుగాలి తండా
ప్యాపిలి మండలం పరిధిలోని కొన్ని     ప్రదేశాలు
బళ్లారి చౌరస్తా నుంచి దేవనకొండ వరకు రోడ్డు విస్తరణ పనులుసాగుతుండడంతో 57 కీమీటర్ల మేర ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.ఇక్కడ సరైన సూచిక బోర్డులను కూడా అధికారులు ఏర్పాటు చేయించలేదు. దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  

బ్లాక్‌ స్పాట్స్‌..
ఒకే ప్రదేశంలో పది కంటే ఎక్కువసార్లు ప్రమాదం జరిగితే దానిని బ్లాక్‌ స్పాట్‌గా గుర్తిస్తారు. జిల్లాలో 47 బ్లాక్‌ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆర్‌అండ్‌బీ రహదారుల్లో 14 ప్రదేశాలు, ఎన్‌హెచ్‌–44 అనంతపురం రహదారిలో 28, ఎన్‌హెచ్‌–40 నంద్యాల పరిధిలో 02, పురపాలక కార్పొరేషన్‌ పరిధిలో ఒక్క బ్లాక్‌ స్పాట్‌ను గుర్తించారు. ఇందులో రెండు బ్లాక్‌ స్పాట్లలో మాత్రమే ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. మిగిలిన 45 ప్రదేశాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా.. 2017 మే నెలలో ప్రమాదాల రేటు  37 శాతం నమోదైంది.

Advertisement
Advertisement