రాజధానిలో లిక్కర్ సిండికేట్ రేట్ షురూ.. | Sakshi
Sakshi News home page

రాజధానిలో లిక్కర్ సిండికేట్ రేట్ షురూ..

Published Tue, Nov 3 2015 9:29 AM

రాజధానిలో లిక్కర్ సిండికేట్ రేట్ షురూ.. - Sakshi

రాజధానిలో మద్యం సిండికేట్ హవా మళ్లీ మొదలయింది. సిండికేట్ వ్యాపారులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు మధ్య పరస్పర ఆర్థిక అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో ప్రభుత్వం మద్యం ధరలను పెంచి అమలులోకి తెచ్చిన రోజు నుంచే సిండికేట్లు సరికొత్త రేట్లను సిద్ధం చేసి విక్రయాలు సాగిస్తున్నాయి. ఎమ్మార్పీ ఉల్లంఘన ఎక్కడా జరగదని తరచూ చెప్పే అధికారులు, మంత్రులు పూర్తి స్థాయిలో సహకరించడంతో సిండికేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి బహిరంగంగా రూ.కోట్లలో విక్రయాలు సాగిస్తున్నారు.
 
విజయవాడ : గుంటూరు, కృష్ణా జిల్లాలో మద్యం సిండికేట్ హవా కొనసాగుతోంది. అధికార పార్టీ మంత్రులు డివిజన్ల వారీగా పంచుకొని సిండికేట్ల నుంచి కొంత తీసుకొని పూర్తిగా కొమ్ము కాస్తున్నారు. కొందరైతే ప్రత్యక్షంగా సిండికేట్‌లో భాగస్వాములుగా ఉండి సిండికేట్‌ను తెరవెనుక ఉండి నడిపిస్తుండగా, మరికొందరు ఎంతోకొంత తీసుకొని కొమ్ముకాస్తున్నారు. ఇక రెండు జిల్లాలోని అధికారులు అయితే పూర్తిగా వ్యాపారులకు సహకరించి నెలవారీలు తీసుకుంటున్నారు. దీంతో ఎమ్మార్పీ ఉల్లంఘనకు వ్యాపారులు పాల్పడుతూ  ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్మకాలు సాగించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
 
గుంటూరు జిల్లాలో 342 వైన్ షాప్‌లు, రెండు రోజుల క్రితం మంజూరైన కొత్త వైన్ షాపులు 9 కలిపి 351 వైన్ షాపులు ఉన్నాయి. అలాగే 152 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు అధికారికంగా 2.30 లక్షల కేసుల మద్యం విక్రయాలు సాగుతున్నారుు. వీటి విలువ సగటున రూ.120 కోట్లు పైనే ఉంటుంది. అలాగే కృష్ణాజిల్లాలో 297 వైన్ షాపులు ఉన్నాయి. ఇటీవల మంజూరైన వాటిలో నాలుగు కొత్త వైన్ షాలు కలుపుకొని 301 వైన్ షాపులు ఉన్నాయి. అలాగే 167 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 2.10 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరిగి వీటి ద్వారా సగటున రూ.105 నుంచి రూ.110 కోట్లు విక్రయాలు జరుగుతున్నారుు.
 
అలాగే గుంటూరులో 35 ప్రభుత్వ మద్యం దుకాణాలు, కృష్ణా జిల్లాలో 33 ప్రభుత్వ దుకాణాలు ఉన్నాయి.  రెండు జిల్లాలోని షాపుల  ద్వారా రూ.20 కోట్లకు పైగా విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నారుు. ఈక్రమంలో విజయదశమి పండుగ మరుసటి రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల్ని 5శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అన్ని రకాల మద్యం ధరలు కొంత పెరిగాయి. ఇదే సరైన సమయంగా వ్యాపారులు భావించి అధికారులతో ముందుస్తుగా చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా పెరగిన ధరలతో పాటే సిండికేట్ ధరల్ని పెంచేశారు.
 
 మామూళ్లతో దాడులకు బ్రేక్
 10 రోజులగా రెండు జిల్లాలో ఇది కొనసాగుతున్నా కనీసం జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు కాని, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ కాని దృష్టి సారించి ఒక కేసు కూడా నమోదు చేసిన దాఖాలాలు లేవు. అధికార పార్టీ అండదండలు ఉండటం, అధికారులను మామూళ్లతో మాట్లాడుకోవడంతో వ్యాపారం జోరుగా సాగుతుంది. ఫుల్ బాటిల్‌పై రూ.20 నుంచి రూ.30 అదనంగా పెంచగా ఆఫ్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు, క్యార్టర్ సీసాపై రూ.5 నుంచి రూ.15 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో రెండు జిల్లాలో కలిపి నెలకు రూ.230 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగుతున్నారుు. పెంచిన సిండికేట్ ధరల వల్ల రెండు జిల్లాలోని సిండికేట్ వ్యాపారులకు రూ.40 కోట్లు అదనపు లాభం చేకూరుతుంది.
 

Advertisement
Advertisement