‘చక్రం’కు బ్రేకులు | Sakshi
Sakshi News home page

‘చక్రం’కు బ్రేకులు

Published Tue, Nov 3 2015 11:47 AM

‘చక్రం’కు బ్రేకులు - Sakshi

చిన్నబాబు సీరియస్
మంత్రి పదవికి ప్యాకేజీ ఇచ్చాననే ప్రచారంపై మండిపాటు
శ్రీశైలం నీటి విషయంలోనూ నోటి దురుసు తగ్గించుకోవాలని హితవు
వ్యతిరేక వర్గంలో సంబరం
 
కర్నూలు: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా.. ఒకేసారి ఎమ్మెల్సీతో పాటు తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న శిల్పా చక్రపాణి రెడ్డి దూకుడుకు కళ్లెం పడిందా? తనకు ఎదురులేదని.. త్వరలో మంత్రి పదవి కూడా దక్కనుందని ఆయన చేసుకున్న ప్రచారంపై చిన్నబాబు లోకేష్ సీరియస్‌గా ఉన్నారా? శ్రీశైలం నీటి విషయంలోనూ నోటి దురుసు తగ్గించుకోవాలంటూ హైదరాబాద్‌కు పిలిచి మరీ క్లాస్ పీకారా? అనే వరుస ప్రశ్నలకు అధికార పార్టీకే చెందిన పలువురు నేతలు అవుననే సమాధానమిస్తున్నారు.
 
ఇందుకు ఆయన నోటి దురుసుతో పాటు పదవుల కోసం ప్యాకేజీ ఇచ్చానంటూ ఆయన పార్టీలోని పలువురి వద్ద చేసిన వ్యాఖ్యలే పరిస్థితి ఇంత దూరం వచ్చేందుకు కారణమయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద అధికార పార్టీలో శిల్పా చక్రపాణి రెడ్డి వ్యవహారంతో.. ఆ పార్టీలోని ఆయన వ్యతిరేకులు కాస్తా సంబరం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.
 
నాకేమైనా ఊరికే ఇచ్చారా!
వాస్తవానికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తిరిగి సోమిశెట్టికే పగ్గాలు అప్పగించాలని పార్టీ మొత్తం ఏకగ్రీవ తీర్మానం చేసింది. తనకే అధ్యక్ష పదవి వరించిందని సోమిశెట్టి కూడా తన ఫామ్‌హౌస్‌లో అందరినీ పిలిచి పార్టీ కూడా ఇచ్చారు. అయితే, ఇక్కడే శిల్పా చక్రం తిప్పారు. ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయాలంటే.. జిల్లా పార్టీ మొత్తం సహకరించాలంటే తనకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను అధిష్టానం ముందుంచారు.
 
 శిల్పా వాదనతో ఏకీభవించిన అధిష్టానం పార్టీ పగ్గాలు కూడా అప్పగించింది. అయితే, ఇంతటితో ఆగకుండా తనకు త్వరలో మంత్రి పదవి కూడా రాబోతోందని ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తన అనుచరుల వద్ద ఆయన బల్లగుద్ది మరీ చెప్పారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం తాను అధిష్టానానికి ప్యాకేజీ కూడా ఇచ్చానని ఆయన చెప్పుకున్నట్టు సమాచారం. తనకేమీ పగ్గాలు, పదవి ఊరికే ఇచ్చారా అని శిల్పా వ్యాఖ్యానించినట్టు అధిష్టానానికి నివేదిక చేరింది. ఈ వ్యవహారంపై చిన్నబాబు చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన దూకుడుకు బ్రేకులు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు చర్చ జరుగుతోంది.
 
 నోరు పారేసుకోవద్దు
 శ్రీశైలం నీటిని కిందకు తీసుకెళ్లి నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా డెల్టాకు ఇవ్వాలనేది అధికార పార్టీ నిర్ణయం. అయితే, నీటి తరలింపుపై ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాల వల్ల తనకు ఎక్కడ మైలేజ్ తగ్గుతుందోననే భానవతో.. చుక్క శ్రీశైలం నీటిని కూడా కిందకు వదలబోమని శిల్పా వ్యాఖ్యానించారు. ఈ పరిణామం అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆయన వ్యాఖ్యల పట్ల చిన్నబాబు లోకేష్ పూర్తిస్థాయిలో సీరియస్ అవడంతో పాటు పిలిచి మరీ మందలించినట్టు సమాచారం. మొత్తం మీద అధికార పార్టీలో తాజా ఎపిసోడ్ కాస్తా అధ్యక్ష వ్యతిరేకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతోంది.
 
 

Advertisement
Advertisement