రిట్టపాడులో వరిచేను కుప్పలు దగ్ధం | Sakshi
Sakshi News home page

రిట్టపాడులో వరిచేను కుప్పలు దగ్ధం

Published Sat, Dec 31 2016 11:14 PM

రిట్టపాడులో వరిచేను కుప్పలు దగ్ధం - Sakshi

రిట్టపాడు (వజ్రపుకొత్తూరు): ఆరుగాలం శ్రమించిన కష్టం బూడిదైంది. చేసిన అప్పులు తీర్చి, సంక్రాంతి పండగను సరదాగా గడుపుదాం అనుకున్న అన్నదాత ఇళ్లలో చీకట్లు అలముకున్నా యి. చేతికి అందివచ్చే పంట కళ్లెదుటే బూడిదవుతుంటే రైతుల గుండె చెరువైంది.  మంటలు ఆర్పేందుకు  కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే...వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం పంచాయతీ రిట్టపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి 6.30 గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వరి చేను కుప్పలు మంటల్లో కాలిపోయాయి. గ్రామానికి చెందిన రైతులు కోమటూరు సన్యాసిరావు(కూరాకులు), పి.నరిసింహమూర్తిలకు చెందిన సుమారు ఐదెకరాల వరి చేను కుప్పలు అగ్నికి కాలి బూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.2.50 లక్షలు మేర నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

స్థానిక ఉద్దానం తాగునీటి పథకానికి ఎదురుగా  వరిచేను కల్లంలో బాధితుడు కొమటూరు  సన్యాసిరావు నూర్పిడి యంత్రం ద్వారా వరిచేను నూర్చారు. ఆ యంత్రం గొట్టం  నుంచి వచ్చే వరిగడ్డిని కుప్పగా అక్కడే ఉంచారు. అక్కడే ఉన్న చెట్టు కొమ్మలు రాపిడికి గురి కావడంతో ఆ పైన ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగలు షార్టుసరŠూక్యట్‌కు గురవడంతో నిప్పు రవ్వలు వరి గడ్డిపై పడి ప్రమాదం జరిగినట్లు స్థానికులు, బాధితులు చెప్పారు. అవి కాస్త పెద్ద ఎత్తున వ్యాపించి పక్కన ఉన్న వరి చేను కుప్పలను తాకడంతో స్థానికులు మంటలను అదుపు చేయలేక పోయారు. స్థానికులు 100నంబరుకు కాల్‌ చేయడంతో  పలాస అగ్నిమాపక సిబ్బంది వచ్చి మరింత నష్టం జరగకుండా  మంటలను అదుపు చేశారు. పంట కళ్ల ముందే కాలి బూడిదైందని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

రైల్వే గేటు వేయడంతో...
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలోనే స్పందించినప్పటికీ ప్రమాద స్థలానికి చేరుకునే మార్గంలో తాళభద్ర రైల్వే గేటు ఉండడం...అది కాస్త వేయడంతో సంఘటనా స్థలానికి అగ్నిమాపక శకటం వెళ్లడానికి సమయం పట్టింది. దీంతో ప్రమాద నష్టం ఎక్కువగా జరిగినట్టు శకటంతో వచ్చిన పల్లిసారధి సర్పంచ్‌ ప్రతినిధి టి.ధర్మారావు తెలిపారు. అదే సమయంలో మంటలు ఆర్పే సమయంలో శకటంలో నీరు అయిపోవడంతో మళ్లీ దాన్ని నింపి తెచ్చే సమయంలో మరింత నష్టం జరిగిందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement