తిరుపతిలో మామిడి బోర్డు | Sakshi
Sakshi News home page

తిరుపతిలో మామిడి బోర్డు

Published Sun, Jul 26 2015 12:46 PM

mango board to set up in tirupati

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన ఉత్పత్తుల విలువను పెంచి గిట్టుబాటు ధర కల్పించడం, 2020 నాటికి రూ.ఐదు వేల కోట్లతో పరిశ్రమలు స్థాపించి, 50 వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని రూపొందించింది. కొబ్బరి, పొగాకు బోర్డుల తరహాలోనే తిరుపతిలో మామిడి బోర్డు.. పశ్చిమగోదావరి జిల్లాలో అరటి బోర్డు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అరటి బోర్డు ఏర్పాటుకు రూ.పది కోట్లు మంజూరు చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ 30 ఎకరాల్లో ‘ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కు’లు ఏర్పాటుచేయనున్నారు. ఈ విధానం 2015 నుంచి 2020 వరకూ అమల్లో ఉంటుంది.  2014-15లో స్థూల రాష్ట్రీయోత్పత్తి(జీఎస్‌డీపీ) రూ.5,20,030 కోట్లు. ఇందులో వ్యవసాయ రంగం వాటా 23.3 శాతం. 2015-16లో స్థూల రాష్ట్రీయోత్పత్తి రూ.6,36,606 కోట్లుగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

రైతుల ఉత్పత్తులకు విలువను పెంచగలిగితే గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటూ జీఎస్‌డీపీని పెంచవచ్చునని భావిస్తున్నారు. మామిడి, అరటి, టమాటా వంటి ఉద్యానవన పంటల సాగులో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉందని భావించిన ప్రభుత్వం.. ఆ రంగంలో పరిశ్రమల స్థాపనకు పలు రాయితీలు కల్పిస్తూ విధానాన్ని రూపొందించింది.

ఫుడ్ ప్రాసెసింగ్ విధానంలో ముఖ్యాంశాలు
#   2015-20 పారిశ్రామిక విధానం ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు రాయితీపై భూములు కేటాయింపు
#  ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా
#    భూమార్పిడి పన్ను వంద శాతం రీయింబర్స్‌మెంట్
# ప్రైమరీ ప్రాసెసింగ్ కేంద్రాలకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 50 శాతం.. గరిష్టంగా రూ.2.50 కోట్లు ప్రభుత్వ రాయితీ
#   పరిశ్రమ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి పెట్టుబడిపై ఏడు శాతం వడ్డీ రాయితీ
మార్కెట్ పన్ను నుంచి మినహాయింపు
ఐదేళ్లపాటు వ్యాట్, సీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ వంద శాతం రీయింబర్స్‌మెంట్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement