Sakshi News home page

ఈ సీటు..చాలా ‘హాట్‌’

Published Tue, Nov 29 2016 10:35 PM

ఈ సీటు..చాలా ‘హాట్‌’ - Sakshi

– నగర పాలక సంస్థ కమిషనర్‌గా రావడానికి అధికారుల విముఖత
– బలవంతంగా పంపినా సెలవులో వెళ్లిపోతున్న వైనం
– అధికార పార్టీ నాయకుల మితిమీరిన జోక్యమే కారణం


అనంతపురం న్యూసిటీ : అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా విధులు నిర్వర్తించడం కత్తి మీద సాముగా మారింది. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలతో ఇక్కడ పని చేయాలంటేనే అధికారులు జంకుతున్నారు. ఏసీబీకి పట్టిస్తామని, తమ బిల్లులు చేయకపోతే దాడులకు దిగుతామని భయపెట్టిన దాఖలాలూ ఉన్నాయి. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి తొమ్మిది మంది కమిషనర్లు ఒత్తిళ్లు తట్టుకోలేక వెళ్లిపోయారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

వారు చెప్పినట్టే చేయాలి..!
నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని అధికారులపై పాలకులు   తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. డిపార్ట్‌మెంట్, సీసీ బిల్లులు, చేయని పనులకు బిల్లులు చేయాలంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. 2014 జులై 3న మేయర్‌గా స్వరూప ఎన్నికయ్యారు. అప్పట్లో మేయర్‌ స్వరూప, ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి మధ్య తీవ్ర స్థాయిలో ఆధిపత్య పోరు సాగింది. ఇరు వర్గాల కార్పొరేటర్ల దెబ్బకు కమిషనర్‌ చంద్రమౌళేశ్వర్‌ రెడ్డి ఇక్కడికి వెళ్లిపోయారు. ఆయన 2014 అక్టోబర్‌ 11 నుంచి డిసెంబర్‌ 14 వరకు మాత్రమే పని చేశారు. అదే ఏడాది డిసెంబర్‌ 15న కమిషనర్‌గా పి.నాగవేణి బాధ్యతలు తీసుకున్నారు.

మేయర్, ఎమ్మెల్యే గ్రూపు తగాదాలతో ఆమె పట్టుమని నెల రోజులు కూడా పని చేయకుండానే సెలవుపై వెళ్లిపోయారు. సెలవు ముగించుకుని వచ్చిన తర్వాత ఆమె 2015 జనవరి 23న తిరిగి బాధ్యతలు తీసుకుని ఎనిమిది నెలలు మాత్రమే పని చేశారు. ఓ విషయంలో కంటతడి పెట్టుకుని సెప్టెంబర్‌ 30న నగరపాలక సంస్థ నుంచి వెళ్లిపోయారు. అదే ఏడాది అక్టోబర్‌ 1న కమిషనర్‌(ఎఫ్‌ఏసీ)గా ఉమామహేశ్వర రావును నియమించారు. రాంనగర్‌లో పూడికతీత బిల్లులు రూ.5 లక్షలు చేయాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన నిరాకరించడంతో దాడికి యత్నించారు. తర్వాత చల్లా ఓబులేసు 2015 నవంబర్‌ 3న కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన్ను అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్‌ నానా దుర్భాషలాడారు.  బిల్లులు చేయలేదంటూ ‘చంద్రదండు’ నేతలు సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దీనికితోడు ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్‌ కుమ్మక్కై కులం పిచ్చితో కార్పొరేషన్‌ను నాశనం చేస్తున్నారంటూ  ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చల్లా ఓబులేసు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయినప్పటి నుంచి ఇక్కడ బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ప్రస్తుత ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా ఉన్న ఆర్‌.సోమనారాయణ సైతం ఎక్కువ రోజులు పనిచేసే పరిస్థితిలేదని  కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నగరానికి వచ్చిన మంత్రి నారాయణ మరో పది రోజుల్లో  అనంత నగరపాలక సంస్థకు కొత్త కమిషనర్‌ను నియమిస్తామని చెప్పారు.అయితే.. ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే నగరపాలక సంస్థ అధ్వానంగా తయారైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement