తిరుమల భద్రతపై ఇంత నిర్లక్ష్యమా? | Sakshi
Sakshi News home page

తిరుమల భద్రతపై ఇంత నిర్లక్ష్యమా?

Published Mon, Jan 4 2016 2:45 AM

తిరుమల ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా (ఫైల్) - Sakshi

సాక్షి, తిరుమల: దేశంలో ఉగ్రవాద దుశ్చర్యలు నానాటికీ పెరిగిపోతున్నా, టార్గెట్ తిరుమల పేరుతో ముష్కరగణం ఇప్పటికే రెక్కీ నిర్వహించినా తిరుమల భద్రతపై టీటీడీ అధికారులు, ప్రభుత్వ పెద్దలకు చీమకుట్టినట్టు కూడా లేదు. రూ.62 కోట్లతో 2వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి రెండున్నరేళ్లయినా ఇంతవరకు ప్రాజె క్టు కార్యరూపం దాల్చకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శ్రీవారి దర్శనానికి దేశ, విదేశాల నుంచి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తులతోపాటు ఆలయ భద్రత కోసం టీటీడీ ఏటా సుమారు రూ.100 కోట్ల దాకా వెచ్చిస్తోంది.

‘తిరుమలలోనూ ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు భద్రతా చర్యలు వేగవంతం చేశాం’ అని 2008 లోనే అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం తిరుమల పర్యటనలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే ఆక్టోపస్ యూనిట్ తిరుమలలో నెలకొల్పారు. ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు (ఎస్‌పీఎఫ్) సంఖ్యను పెంచారు. శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు మాత్రమే పరిమితమైన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా(సీసీ కెమెరా) వ్యవస్థను పెంచాలని నిర్ణయించారు. ఈ సీసీ కెమెరా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, పూర్తి స్థాయిలో ఆధునీకరించాలని ఎల్‌కే అద్వానీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కూడా సిఫారసు చేసింది.

రెండున్నరేళ్లుగా నలుగుతున్న ప్రాజెక్టు..
కేంద్ర మంత్రుల హెచ్చరికలు, కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల సిఫారసులు, సూచనలతో తిరుమలతో పాటు తిరుపతిలోనూ 2వేల సీసీ కెమెరాలతో భద్రత పటిష్టం చేయాలని టీటీడీ నిర్ణయించింది. 2013 జూన్ 15న రూ.62 కోట్లతో 2వేల అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 26న అప్పటి టీటీడీ సీవీఎస్‌వో జీవీజీ అశోక్ కుమార్ న్యూఢిల్లీ వెళ్లి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఢిల్లీ కమిషనరేట్‌లోని సీసీ కెమెరా వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అదే సందర్భంలో రాష్ట్ర విభజన వేడి పెరిగింది. ఆ ఫైలు అక్కడికక్కడే ఆగిపోయింది. తర్వాత టీటీడీ అధికారులు, పాలకులు పట్టించుకోలేదు.
 
సీసీటీవీ ఫుటేజ్‌తో వెలుగుచూసిన ‘టార్గెట్ తిరుమల’ రెక్కీ
ఉగ్ర చర్యల్లో భాగంగా ‘టార్గెట్ తిరుమల’ పేరుతో తిరుమలలో రెక్కీ చేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సుభాష్ రామచంద్రన్(30) అంగీకరించారు. ఈ విషయాన్ని తిరుమలలోని సీసీ కెమెరా ఫుటేజీ ద్వారానే ధ్రువీకరించుకోవటం గమనార్హం. ఒకవేళ ఈ సీసీ కెమెరా వ్యవస్థ కూడా లేకపోతే ఉగ్ర రెక్కీ చర్యలు వెలుగుచూసేవి కావు. ఇంతటి ప్రాధాన్యత కలిగినప్రాజెక్టు అమలు గురించి టీటీడీ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement