పీఈటీ, పండిట్‌ పోస్టులను అప్‌గ్రెడ్ చేయాలి | Sakshi
Sakshi News home page

పీఈటీ, పండిట్‌ పోస్టులను అప్‌గ్రెడ్ చేయాలి

Published Thu, Jul 28 2016 10:56 PM

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు - Sakshi

గన్‌ఫౌండ్రీ: రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న భాషా పండితులు గ్రేడ్‌–2 ఉపాధ్యాయులపై వేతనంలోను, హోదాలోను వివక్ష కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆరోపించింది. పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్‌ చేయాలని కోరుతూ గురువారం కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఉన్నత పాఠశాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌ పోస్టులే ఉండాలన్నారు.

చేసే పనిలో తేడా లేకుండా హోదా, వేతనాలలో ఈ ఉపాధ్యాయులపై వివక్ష కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పండిట్, పీఈటీ పోస్టులకు వారితో సమానంగా వేతనాలను అందజేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పీఈటీ, పండిట్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం జేసీ భారతీ హోలికేరికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో కొండల్‌రావు, రవీందర్, సంజీవ, మల్లయ్య,  దేవదాస్‌ పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement