వసతిగృహాల మార్పునకు ప్రణాళిక | Sakshi
Sakshi News home page

వసతిగృహాల మార్పునకు ప్రణాళిక

Published Thu, Nov 3 2016 10:20 PM

వసతిగృహాల మార్పునకు ప్రణాళిక - Sakshi

ఏలూరు (మెట్రో) : జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలను రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు రూ.67 కోట్లతో ఒక ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించామని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ చెప్పారు. విద్యాశాఖ ప్రగతితీరుపై గురువారం సమీక్షించారు. జిల్లాలో రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇటువంటి స్థితిలో హాస్టల్స్‌ ఉంటూ బయట ప్రాంతాల్లో విద్య నేర్చుకునేందుకు విద్యార్థులు వెళుతూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 383 తరగతి గదులను నిర్మించి ప్రస్తుతం ఉన్న హాస్టల్స్‌ను రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా తీర్చిదిద్దేగలిగితే 12 వేల మంది విద్యార్థులకు అదనంగా సీట్లిచ్చే అవకాశాలు కలుగుతాయని కలెక్టర్‌ చెప్పారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే ఏజెన్సీలకు అక్టోబర్‌ వరకూ బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని, జూలై నుంచి పెంచిన ఛార్జీల బకాయిలను కూడా చెల్లించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో హైస్కూల్‌ విద్యలో ఇంగ్లిష్‌ మీడియం తరగతులను ప్రవేశపెట్టాలని, విద్యార్థుల ఇష్టప్రకారం తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో ప్రవేశం కల్పించాలని కలెక్టర్‌ చెప్పారు. సమావేశంలో డీఈవో మధుసూదనరావు, డెప్యూటీ డీఈవోలు డి.ఉదయ్, జి.విలియమ్స్, జె.సోమరాజు, తిరుమలదాస్, ఎం.రామారావు పాల్గొన్నారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement
Advertisement