బురిడీ బాబాల ఆటకట్టు | Sakshi
Sakshi News home page

బురిడీ బాబాల ఆటకట్టు

Published Fri, Jul 8 2016 3:54 AM

బురిడీ బాబాల ఆటకట్టు - Sakshi

అరెస్ట్ చేసిన పోలీసులు
252 గ్రాముల బంగారు స్వాధీనం

 రాజంపేట రూరల్ : జ్యోతిష్యాలయం ఏర్పాటు చేసి... సమస్యల నుంచి తప్పిస్తామని ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న ఇద్దరు బురిడీ బాబాలను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల ఎదుట.. పస్తం కృష్ణ అలియాస్ కృష్ణంరాజు, పస్తం హుస్సేన్‌ను వారు హాజరు పరిచారు.

 ఈ సందర్భంగా డీఎస్పీ రాజేంద్ర మాట్లాడుతూ పట్టణంలోని ఆర్‌ఎస్ రోడ్డు ఆర్‌ఓబీ సమీపంలో పస్తం కృష్ణ జ్యోతిష్యాలయాన్ని ఐదు నెలల క్రితం స్థాపించారన్నారు. ఆయన వద్దకు వచ్చే అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేయడం అలవాటు చేసుకున్నారని పేర్కొన్నారు. మేలో పట్టణానికి చెందిన ఓ యువతి తన సమస్యల పరిష్కారం కోసం జ్యోతిష్యాలయానికి వెళ్లిందని చెప్పారు. ఆమె చెప్పినది మొత్తం విన్న కృష్ట.. ‘మీ ఇంట్లో ఉన్న బంగారంలో దుష్టశక్తులు ఉన్నాయని ఆ మహిళను నమ్మించారు’ అని పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న పూర్తి స్థాయి బంగారాన్ని తీసుకొస్తే దుష్టశక్తులను తొలగించి మేలు చేస్తానని నమ్మబలికాడని తెలిపారు. ఆమె ఇంట్లో ఉన్న బంగారాన్నంతా తీసుకెళ్లి.. మే 26న అందించిందన్నారు.

కొడుకునే గురువుగా పరిచయం చేసిన వైనం
తన శక్తులు పని చేయలేదని, తన గురువు పూర్తి స్థాయిలో మంత్రించి దుష్టశక్తులను తొలగిస్తారని, తన కొడుకు పస్తం హుస్సేన్‌ను ఫోన్‌లో గురువుగా పరిచయం చేశాడని చెప్పారు. వీరి మాటలకు మోసపోయిన మహిళ పూర్తి స్థాయి బంగారం ఇవ్వడంతోపాటు రూ.30 వేల నగదును కూడా అందజేసిందని తెలిపారు. వారు బంగారు ఇవ్వకపోవడంతో తనను మోసం చేశారని తెలుసుకుని జూన్ 3న పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. అందులో భాగంగా గురువారం తిరుపతిలో ఉన్న పస్తం కృష్ణ, హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి 252 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించారు. విలేకరుల సమావేశంలో సీఐ పల్లపు మోహన్‌కృష్ణ, పీఎస్‌ఐ వీ.మల్లికార్జునరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నరసింహులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement