పోలీసు ట్రీట్‌మెంట్‌ | Sakshi
Sakshi News home page

పోలీసు ట్రీట్‌మెంట్‌

Published Fri, May 5 2017 10:33 PM

పోలీసు ట్రీట్‌మెంట్‌ - Sakshi

– రోడ్డు భద్రత ప్రయోజనాలు వివరిస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం 
– జాతీయ రహదారులపై వేకువజామున డ్రైవర్లకు టీ పంపిణీ
 
కర్నూలు: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల క్రితం విజయవాడలో రోడ్డు భద్రతపై డీజీపీ సాంబ శివరావు రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఆయన ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా అంతటా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వేకువజామున 3 నుంచి 5 గంటల వరకు వాహన డ్రైవర్లకు టీ అందజేసే కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం చుట్టి ప్రారంభించారు. వెల్దుర్తి మండల పరిధిలోని జాతీయ రహదారి టోల్‌ ప్లాజా దగ్గరకు శుక్రవారం తెల్లవారుజామున చేరుకుని వాహన డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో  భాగంగా వాహనాలను ఆపి డ్రైవర్లకు పోలీసు శాఖ తరపున టీ అందించి నిదానంగా వెళ్లాలని సూచించారు. ప్రమాద నివారణలో డ్రైవర్‌ పాత్ర చాలా ముఖ్యం... అంటూ డ్రైవర్లకు సూచనలు ఇచ్చారు. జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. మద్యం తాగి నడుపుతున్న మూడు వాహనాలను ఈ సందర్భంగా సీజ్‌ చేసి వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో డోన్‌ డీఎస్పీ బాబా ఫకృద్దీన్, ట్రాఫిక్‌ డీఎస్పీ రామచంద్ర, సీఐలు శ్రీనివాసులు, రామకృష్ణ, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ట్రాఫిక్‌ పోలీసులు పాల్గొన్నారు. 
 
ప్రమాద బాధిత కుటుంబాల స్థితిగతులపై అధ్యయనం...
గత మూడేళ్ల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను ఎస్పీ ఆకె రవికృష్ణ అధ్యయనం చేశారు. 2013లో 1661, 2014లో 1786, 2015లో 1845, 2016లో 1301 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో వందల సంఖ్యలో మృత్యువాత పడగా, వేల సంఖ్యలో క్షత్రగాత్రులయ్యారు. ఆయా ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాల పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. ప్రమాద బాధితుల కుటుంబాలను స్వయంగా సందర్శించి వారి బాగోగులతో పాటు వారి పిల్లల చదువుల గురించి ఆరా తీసేందుకు క్షేత్రస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 
 
మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు: ఎస్పీ 
ఇటీవల జాతీయ రహదారులపై వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాలన్నీ మానవ తప్పిదాలే. మితిమీరిన వేగం, నిద్రలేమి వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల వెంట ఉన్న డాబాల్లో మద్యం సేవించేందుకు అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. వాటిపై నిరంతర దాడులు జరిపిస్తాం. మలుపుల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని, హైవే అథారిటీకి లేఖ ఇచ్చినా స్పందన లేదు. అలాంటి వారిపై బండోవర్‌ కేసులు నమోదుకు ఆదేశించాం. నిర్దేశించిన వేగంలోనే ప్రయాణించేలా చర్యలకు ఇంటర్‌సెప్టార్‌ వాహనం సేవలను వినియోగిస్తాం. దూర ప్రయాణం చేసే వారు రాత్రి సమయాల్లో విశ్రాంతి తీసుకోవడం మంచిది.  
 

Advertisement
Advertisement