ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి కావాలి | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి కావాలి

Published Thu, Jul 28 2016 10:39 PM

ఇరిగేషన్‌పై సమీక్ష చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ - Sakshi

  •   సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • ఖమ్మం అర్బన్‌:  భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం  ముందుకు పోతున్నందున... నిర్దేశించిన సమయంలో అన్ని పనులు పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం టీటీడీసీలో జిల్లాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారని,  పనులు వేగవంతం చేయాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు ,శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల భూసేకరణ పూర్తయిందన్నారు. శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు  ప్రధాన బ్రాంచి కాల్వలను ఎప్పటి వరకు పూర్తి చేస్తారో, వారం వారం ప్రగతికి సంబంధించిన ప్రణాళిక అందజేయాలన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయని  మంత్రి అసంతప్తి వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి పనులు చేస్తున్న కాంట్రాక్టరుతో పనులు వేగవంతం చేయించాలని , పనులు చేయకుంటే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఎస్‌ఈని ఆదేశించారు. గత మూడు సమావేశాలకు ఎస్‌ఈ, సీఈలను పిలిస్తే వేరే జిల్లాల్లో పనుల్లో ఉన్నారని చెబుతున్నారంటూ  ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కాల్వ రోడ్డు కట్‌ చేసి పూర్తి చేయలేదని,  కొన్ని చోట్ల కంకర, ఇసుక  వేశారని,  రోడ్డు తవ్వి నిర్మాణ పనులు ఎందుకు చేయలేదన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తయినా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ప్రయోజనం ఉండదన్నారు. ఈ సమీక్షలో కలెక్టర్‌ లోకేష్‌కుమార్, జేసీ దివ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, ఆర్డీఓ వినయ్‌క్రిష్ణారెడ్డి,  ఎస్‌ఈ జయపాల్‌ తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement