అదిగదిగో.. జిల్లాకేంద్రం! | Sakshi
Sakshi News home page

అదిగదిగో.. జిల్లాకేంద్రం!

Published Sat, Sep 24 2016 5:33 PM

అదిగదిగో.. జిల్లాకేంద్రం! - Sakshi

ఈసాకుతో భూములు, ప్లాట్ల ధరలకు రెక్కలు
ఇష్టారాజ్యంగా పెంచుతున్న దళారులు
శంషాబాద్‌లో అడ్డగోలు దందా
వినియోగదారులూ.. పారాహుషార్‌

శంషాబాద్‌: శంషాబాద్‌లో దళారుల దందా మూడు ప్లాట్లు.. ఆరు బిట్లు.. అనే విధంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం ప్రకటనతో రెక్కలు విప్పుకున్న రియల్‌ ఎస్టేట్‌ దళారులు ఖాళీగా ఉన్న భూములపై వాలిపోతున్నారు. అడ్డగోలుగా ధరలు పెంచేస్తూ నిజమైన కొనుగోలుదారులను అవస్థల పాలుచేస్తున్నారు. శంషాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించిన నాటి నుంచి రియల్‌ వ్యాపారం మరోసారి జోరందుకుంది. దీనిని అదనుగా చేసుకున్న మధ్యవర్తుల దందా కూడా పెరిగిపోయింది. శంషాబాద్‌లోనే శాశ్వత జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వకముందే అదిగో జిల్లా కేంద్రం.. ఇదిగో జిల్లా కేంద్రం.. అంటూ భూముల ధరలను అడ్డగోలుగా పెంచేస్తున్నారు. శంషాబాద్‌ పంచాయతీ పరిధిలోని హుడా కాలనీలో సర్వే నంబరు 726 నుంచి 730 వరకు ఉన్న హెచ్‌ఎండీఏ స్థలాల్లో  ప్రభుత్వం శాశ్వత జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ స్థానికంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

        ఔటర్‌ రింగురోడ్డు, నలభైనాలుగో నంబరు జాతీయ రహదారికి ఇది అత్యంత చేరువులో ఉండడంతో ఇక్కడే జిల్లా కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పట్టణవాసులు కోరుతున్నారు. అయితే సర్కారు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఈ భూములపై పరిశీలన కూడా చేపట్టలేదు. ప్రజా సంఘాలు, పార్టీల నుంచి  జిల్లా కేంద్రానికి డిమాండ్‌గా ఉన్న ఈ భూములకు సమీపంలోనే ఉన్న హుడా కాలనీ, ఎయిర్‌పోర్టు కాలనీలో పదిహేనురోజుల కిందట ఉన్న ధరలను మధ్యవర్తులు అడ్డగోలుగా పెంచేశారు. నెలరోజుల కిందట రూ. 2-3 వేలకు గజం ఉన్న ధరలు ఇప్పుడు ఏకంగా రూ. 6-8 వేల వరకు చేరాయి. నిన్నమొన్నటి వరకు ఏమాత్రం డిమాండ్‌ లేని ఈ భూముల్లో మధ్యవర్తులు పెద్దఎత్తున తచ్చాడుతున్నారు. వీరు కృత్రిమంగా పెంచుతున్న ధరలతో సొంతిల్లు కోసం స్థలం కొనుగోలు చేయాలనుకునేవారికి మాత్రం ఇక్కట్లు తప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అప్రమత్తతే శ్రీరామరక్ష..
దళారులు అడ్డగోలుగా విక్రయిస్తున్నా.. భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే వినిచయోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. పట్టణంలోని హుడా కాలనీ సమీపంలో ఉన్న కొన్ని భూముల్లో ఓవ్యక్తి పెద్దఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈవిషయమై ఇప్పటికే దళారుల మధ్య తీవ్రంగా చర్చజరుగుతోంది. ఇవే కాకుండా  ఔటర్‌ రింగురోడ్డు సమీపంలో ఓ బడావ్యాపారి స్థానిక రియల్ వ్యాపారులకు ఒప్పదం చేసిన వెంచర్‌లో కూడా కొన్ని ప్లాట్లను ఇద్దరు, ముగ్గురికి విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒప్పందం చేసుకున్న వారితో పాత యజమానికి కూడా తిరిగి ప్లాట్లు విక్రయిస్తుండడడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ప్లాట్లు కొనుగోలు చేసే వారు ముందస్తుగా పూర్తి సమాచారంతో అప్రమత్తం కాకపోతే దళారుల చేతిలో భారీగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని సంబంధిత రియల్‌ఎస్టేట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం శాశ్వత జిల్లా కేంద్రం ఏర్పాటు స్థలంపై ఏమాత్రం స్పష్టత నివ్వకముందు దళారులు చేస్తున్న ప్రచారాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Advertisement
Advertisement