ఎర్ర మామిడి! | Sakshi
Sakshi News home page

ఎర్ర మామిడి!

Published Wed, May 11 2016 2:09 AM

ఎర్ర మామిడి! - Sakshi

మెతుకుసీమ రైతు సృష్టి
* ఏడాదిన్నర కాలంలోనే దిగుబడినిచ్చే వంగడం
* చక్కెర వ్యాధిగ్రస్తులకు వరం
* వివరాలు వెల్లడించిన మెదక్ జిల్లా కలెక్టర్

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎర్ర మామిడి.. ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది కొత్త వంగడం.. చూస్తేనే తినాలనిపించే పండు.. మెతుకుసీమలో ఓ రైతు సృష్టి. ఏడాదిన్నర కాలంలోనే దిగుబడి వచ్చి ఎర్రగా యాపిల్ పండు వర్ణంలో ఉన్న ఈ మామిడి ఫలాలకు ఇంకా పేరు పెట్టలేదండోయ్.. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన ఎస్‌కే జలాలుద్దీన్ తన నర్సరీలో ఈ కొత్తరకం మామిడి వంగడాన్ని సృష్టించాడు.

మామిడి విత్తనాన్ని మొలకెత్తించి కొద్దిగా ఎదిగిన తరువాత అదే మొక్క కొమ్మలతో అంటు గట్టడంతో (ఫార్ములా చెప్పటానికి రైతు ఇష్టపడలేదు) ఈ తరహా మొక్క ఎదిగింది. దాదాపు నాలుగేళ్లపాటు పరిశీలన, పరిశోధన అనంతరం కాసిన తొలి ఫలాలను ఆయన మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌కు అందించారు. ఉద్యానశాఖ అధికారులు సహకారం అందిస్తే సబ్సిడీపై మామిడి మొక్కలు అందిస్తానని రైతు జలాలుద్దీన్ తెలిపారు. రైతు స్వీయ అనుభవంతో సృష్టించిన ఈ వంగడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా లాభనష్టాలు నిర్ధారణ చేయాల్సి ఉంది. కాగా, మంత్రి హరీశ్‌రావు, తనను ప్రోత్సహించిన కలెక్టర్ రోనాల్డ్ రాస్ పేర్లు వచ్చే విధంగా మామిడికి పేరు పెట్టాలన్న ఆలోచనతో ఉన్నట్లు రైతు ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు.నర్సరీలో మామిడి కాయలతో రైతు జలాలుద్దీన్

ప్రత్యేకతలు...
* ఏడాదిన్నర కాలం నుంచే మొక్క దిగుబ డిని ఇస్తుంది. మొదటి కాతలోనే 15 నుంచి 20 కాయలు చేతికి అందుతాయి.
* పూర్తిగా ఎరుపు వర్ణంలో ఉండి సుమారు 300 నుంచి 400 గ్రాముల పరిమాణంతో వినియోగదారులను అమితంగా ఆకర్శిచడం, కోసిన కాయలు 20 రోజుల వరకు తాజాగా ఉండటం దీని ప్రత్యేకత.
* టేబుల్ రకానికి చెందిన ఈ ఫలాన్ని కోసి తినవచ్చు. పచ్చి కాయలు అమితతీపితోను, పండ్లు సాధారణ తీపిగా ఉంటా యి. కాబట్టి చక్కెర వ్యాధి గ్రస్తులకు ఈ పండు ఓ వరం.
* తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎర్రగరప నేలలు, చౌడు భూముల్లో పెరుగుతుంది. ఏడాదికి మీటరు ఎత్తు చొప్పున ఎదిగి దాదాపు 7 నుంచి 9 కొమ్మలు వేస్తుంది. నాలుగేళ్ల వయసుకు 12 అడుగుల ఎత్తు వరకు పెరిగి దాదాపు 400 నుంచి 500 కాయలను ఇస్తుంది.
* చెట్టుకు రోగ నిరోధకత ఎక్కువ. ఫలదీకరణం అనంతరం ఏర్పడిన పిందెలు 70 శాతం వరకు రాలిపోకుండా నిలబడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న మామిడి రకాల్లో పిందెలు 10 శాతానికి మించి నిలబడలేదు.
* ఎకరానికి 420 మొక్కలు నాటుకోవచ్చు. చెట్టు జీవిత కాలం 25 నుంచి 30 ఏళ్లు ఉంటుంది.

Advertisement
Advertisement