Sakshi News home page

విభజన, విలీనంపై వినతుల వెల్లువ

Published Tue, Jun 28 2016 8:13 AM

విభజన, విలీనంపై వినతుల వెల్లువ

గ్రీవెన్స్‌లో మెజార్టీ అర్జీలు
వీటిపైనే వినతులు స్వీకరించిన
జేసీ, అదనపు జేసీ

 సంగారెడ్డి జోన్ : మండలాల విలీనం, విభజనలపైనే జిల్లా నలుమూలల నుంచి వినతులు వెల్లువెత్తాయి. గ్రీవెన్స్-డేను పురస్కరించుకుని ప్రజలు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ అభిప్రాయాలను వినతిపత్రాల రూపంలో అధికారులకు అందజేశారు. గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు జేసీ వి.వెంకటేశ్వర్లు, డీఆర్‌ఓ దయానంద్, ఇతర శాఖల అధికారులు స్వీకరించారు. నూతనంగా ప్రకటించనున్న మండల కేంద్రాలకు దగ్గరలోని రెవెన్యూ గ్రామాలను సమీపంలోని ప్రాతిపాదిత మండలాల్లో విలీనం చేయాలని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇతర సమస్యలపైనా వినతులు అందాయి.

రేగోడ్ మండలాన్ని పూర్తి స్థాయిలో సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

మెద క్ మండలం బూర్గుపల్లిని మండల కేంద్రం చేయడంతోపాటు కళాశాలను మంజూరు చేయాలని బూర్గుపల్లి, వాడి, రాజిపేట, కొత్తపల్లి  తండాల వాసులు జేసీకి వినతి పత్రం సమర్పించారు.

శివ్వంపేట మండలం నవాబుపేట గ్రామం గుమ్మడిదలకు కేవలం 6 కి.మీ. దూరంలోనే ఉందని, దీన్ని ప్రతిపాదిత గుమ్మడిదలలో విలీనం చేయాలని సర్పంచ్ భిక్షపతి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసిన కాపీని అధికారులకు అందజేశారు.

హత్నూర మండలం నాగారం పంచాయతీలో గల రొయ్యపల్లి, అవంచగూడ గ్రామాలను 3 కి.మీ. దూరంలో గల జిన్నారం మండలంలో విలీనం చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు.

మునిపల్లి మండలంలో కంకోల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రమేశ్ యాదవ్ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు.

అంగవైకల్యంతో బాధ పడుతున్న దళిత వర్గానికి చెందిన తనకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన డప్పు మల్లమ్మ కోరారు.

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట పరిధిలో నిర్మిస్తున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కన గల తమ పట్టా భూముల్లో అధికారిక సమాచారం ఇవ్వకుండా విద్యుత్ స్తంభాలు, రోడ్డు నిర్మించారని, లోతైన గుంతలతో సాగుకు పనికి రాకుండా చేశారని గ్రామస్తులు అంజిరెడ్డి, యాదమ్మ, మల్లారెడ్డి, కిష్టారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.

అమ్మానాన్నలు మృతి చెందడంతో అనాథలమయ్యాం. తన తమ్ముడు నవీన్‌కు జోగిపేట, సంగారెడ్డిలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రవేశం కల్పించాలని పుల్‌కల్ మండలం ముదిమాణిక్యంకు చెందిన శ్రావణ్ కోరారు.

సంగారెడ్డిలోని బొబ్బిలికుంట నుంచి కల్వకుంట పంట పొలాలకు వెళ్లే కాలువ విస్తీర్ణం 33 ఫీట్లు కాగా, ప్రస్తుతం శాంతినగర్, శ్రీ విద్యానికేతన్ పాఠశాల వద్ద పంట కాల్వలను ఆక్రమించుకుని ఇళ్లు, ప్రహరీలు నిర్మించుకున్నారని, వాటిని తొలగించాలని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.

20 గుంటల భూమిని పక్క పొలానికి చెందిన వారుఆక్రమించుకున్నారని, సాగులోకి వెళ్లనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని దౌల్తాబాద్ మండలం చిన్నమసాన్‌పల్లికి చెందిన నర్సారెడ్డి ఫిర్యాదు చేశారు.

బోరుబావి, పైప్‌లైన్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, నష్ట పరిహారం ఇప్పించాలని బాధితుడు దుబ్బాక మండలానికి చెందిన అనంపల్లి రాజు అధికారులను కోరారు.

ఎకరా 34 గుంటల భూమిని దాయాదులు కబ్జా చేయడమే కాకుండా రికార్డుల్లోనూ మార్పులు జరిగాయని, తనకు న్యాయం చేయాలని మెదక్ మండలం పాతూర్‌కు చెందిన దొరబోయిన సిద్దప్ప కోరారు.

Advertisement

What’s your opinion

Advertisement