Sakshi News home page

ఇసుక మాఫియా ఇష్టారాజ్యం

Published Thu, Sep 22 2016 9:52 PM

ఇటీవల పోలీసులు సీజ్‌ చేసిన ఇసుక ట్రాక్టర్లు - Sakshi

  • జోరుగా అక్రమ రవాణా
  • పట్టుకుంది గోరంత.. వదిలేసింది కొండంత
  • తొమ్మిది నెలల్లో 20 కేసులు
  • మామూళ్ల మత్తులో అధికారులు
  • మెదక్‌ రూరల్‌: అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మామూళ్ల మత్తులో పడిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్షలు వెల్లువెత్తుతున్నాయి.

    మెదక్‌ మండల పరిధిలోని అవుసులపల్లి, మల్కాపూర్‌ తండా, బూర్గుపల్లి, రాజ్‌పేట్, గాజిరెడ్డిపల్లి, సర్దన, ముత్తాయిపల్లి, ర్యాలమడుగు, బొల్లారం, రాయిన్‌పల్లి, హవేలిఘనపూర్, కూచన్‌పల్లి తదితర గ్రామాల్లో రాత్రింబవళ్లు తేడాలేకుండా ఇసుక రవాణా జరుగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.

    రెవెన్యూ అధికారులకు స్థానికులు çసమాచారం ఇచ్చినా వారు మాత్రం తమ విధులు నిర్వహించకుండా మామూళ్లకు ఆశపడి పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను సైతం వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొమ్మిది నెలల్లో మండలంలోని ఆయా గ్రామాల్లో పోలీసుల దృష్టికి వచ్చిన కేసులు కేవలం 20 మాత్రమే. మంజీరా పరివాహక ప్రాంతం నుండి వందల సంఖ్యల్లో ఇసుక ట్రిప్పులు తరలిస్తున్నా అధికారులు  మాత్రం గోరంత పట్టుకుని..కొండంత వదిలేస్తున్నారు.

    అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వారికి వత్తాసు పలుకుతుండడంతో అధికారుల తీరుపై ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై కొరడా ఝుళిపించి వాల్టా చట్టాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement