Sakshi News home page

సంగమేశ్వరం..భక్తిపారవశ్యం

Published Wed, Aug 24 2016 12:06 AM

సంగమేశ్వరం..భక్తిపారవశ్యం

  •  కనుల పండువగా పుష్కర హారతి 
  •  క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
  •  12 రోజుల్లో 3లక్షమంది పుణ్యస్నానాలు
  • ఆత్మకూరు: కృష్ణానది చెంత సప్తనదుల సంగమేశ్వర క్షేత్రంలో 12 రోజులుగా సాగిన పుష్కరాలు హారతులతో మంగళవారం ఘనంగా ముగిశాయి. వేకువజాము నుంచే క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానమనంతరం పితృదేవతలకు పిండప్రదానాలు చేసి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్షేత్రంలో 12 రోజులపాటు 3లక్షల మందికి పైగా భక్తులు పుష్కర స్నానమాచరించారు. తొలి రోజు స్వల్పంగా పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు మూడో రోజు నుంచి పోటెత్తారు. పదో రోజు 59,049 మంది, 11 వ రోజు కూడా 42,162 మంది భక్తులు పుష్కరస్నాన మాచరించారు. 
    భక్తుల సందడి
    చివరి రోజు సంగమేశ్వర క్షేత్రంలో భక్తుల సందడి జోరుగా కనిపించింది. ఉదయం నుంచి భక్తులు రాక ప్రారంభమై మధ్యాహ్నానికి కిక్కిరిసింది.  సాయంత్రం వరకు భక్తులు పుణ్య స్నానమాచరించారు. స్థానిక ప్రాంత వాసులే కాకుండా కడప, అనంతపురం జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో సంగమేశ్వరం క్షేత్రంలో పుష్కరస్నానమాచరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. చాలినన్ని వస్త్ర మార్పిడి గదుల్లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ సమస్య అధికారులకు కునుకు లేకుండా చేసింది. పారిశుద్ధ్య సిబ్బంది, వలంటీర్లు, పోలీస్‌ సేవలతో ఇబ్బందుల్లేకుండా భక్తులు పుష్కర స్నానమాచరించేందుకు వీలు కలిగింది. పుష్కరాలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
    బోటు షికారుతో ఆదాయం
    పుష్కరాల సందర్భంగా బ్యాక్‌ వాటర్‌లో బోటు షికారు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపారు. ఫలితంగా ఏపీ టూరిజం సంస్థకు రూ. 5 లక్షలు ఆదాయం చేకూరింది. ఈనెల 20న ఒక్కరోజే రూ.2లక్షలు ఆదాయం వచ్చింది. స్పీడు బోట్లు చాలకపోవడంతో శ్రీశైలం నుంచి పెద్ద పడవను రప్పించడంతో మరింత ఆదాయం సమకూరినటై ్లంది. తెలంగాణ భక్తులు ఇంజన్‌బోటుల ద్వారా సంగమేశ్వర క్షేత్రానికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులు స్వామి సన్నిధిలో పుష్కర స్నానమాచరించి పునీతులయ్యారు.
    మరో రెండు పుష్కరాలు..
    క్షేత్రంలో ఆది పుష్కరాలు మంగళవారంతో ముగియగా.. మరో ఆరు నెలలకు మధ్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఏడాది చివరిలో అంతిమ పుష్కరాలు కూడా జరుగనున్నాయి. సప్త నదులు కలిసే సంగమం కావడం వల్ల ఇక్కడ స్నాన మాచరిస్తే ఎంతో పుణ్య ఫలం దక్కుతుందనే నమ్మకంతో భక్తులు ఇక్కడికి వేలాదిగా తరలివచ్చారు. పుష్కరస్నానమాచరించి పునీతులయ్యారు.
     

Advertisement

What’s your opinion

Advertisement