ఆత్మీయ నేస్తం | Sakshi
Sakshi News home page

ఆత్మీయ నేస్తం

Published Sat, Jan 7 2017 10:03 PM

ఆత్మీయ నేస్తం - Sakshi

జనసంద్రంగా రైతు భరోసా యాత్ర
- చాకలి వెంకటేశ్వర్లు
   కుటుంబానికి ఓదార్పు
- కదిలివచ్చిన రైతులు,
   వ్యవసాయ కూలీలు
- గిట్టుబాటు ధర లేదని ఆవేదన
- మనవడికి
  ఆప్యాయత పంచిన వృద్ధులు
- అడుగడుగునా అక్కాచెల్లెళ్ల
   ఆనందోత్సాహం
- స్వాగతం పలికిన ఊరూవాడా
 
అదిగో రాజన్న బిడ్డ.. పొలాల్లోంచి పరుగు పరుగున వచ్చిన కూలీలు. మనవడి రాక.. నడవలేకపోయినా అతికష్టం మీద రోడ్డు మీదకొచ్చిన వృద్ధులు. రైతు నేస్తం.. కష్టాలు తెలిసిన నేతతో గోడు చెప్పుకున్న రైతన్నలు. జగనన్న.. అక్కా చెల్లి.. అన్నా తమ్ముడు పంచిన ఆత్మీయతతో ఊరూవాడా మురిసింది. కన్నీళ్లు తుడుస్తూ.. జీవితాలకు భరోసానిస్తూ సాగిన యాత్ర ఆద్యంతం జగమంత కుటుంబాన్ని తలపించింది.
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రైతుల కష్టాలు తెలిసిన నేతగా ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాలకు భరోసానిచ్చేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడవ రోజు శనివారం వెలుగోడు మండలంలో సాగింది. వేల్పనూరు నుంచి ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా గ్రామంలోని పురాతన ఆలయమైన ఆంకాళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. బుడ్డా వెంగళరెడ్డి కుటుంబంపై తనకు నమ్మకం ఉందని.. కుటుంబంలో ఒక్కరు తప్పు చేసినా క్షమించే గుణం మనకు ఉందని గుర్తు చేశారు. అయితే రైతులు, మహిళలు, యువతతో పాటు బుడ్డా కుటుంబాన్నీ చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అక్కడి నుంచి బయలుదేరిన వైఎస్‌ జగన్‌ అబ్దుల్లాపురం మీదుగా వెలుగోడుకు చేరుకున్నారు. అబ్దుల్లాపురంలో మినుము పంటను పరిశీలించారు. తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదని.. రుణమాఫీ కాకపోవడంతో తాకట్టు పెట్టిన గొలుసు బ్యాంకులోనే ఉండిపోయిందని రైతు వెంకటాచారి ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో కొత్త నోట్లు రావడం లేదని.. సద్ది కట్టుకునిపోయి లైన్లో ఉంటున్నామని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తమకు రోజువారీ కూలి రూ.110 నుంచి రూ.130 వరకు వస్తోందని.. నోట్ల రద్దు తర్వాత రైతులు కూలి డబ్బు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కూలీలు వాపోయారు. వచ్చేసారి కచ్చితంగా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలు వైఎస్‌ జగన్‌కు హామీ ఇచ్చారు. అనంతరం వెలుగోడుకు చేరుకున్న ఆయన వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు.
 
పింఛన్లు ఇవ్వడం లేదు..!
వెలుగోడులో నిర్వహించిన రోడ్డు షోలో అడుగడుగునా ప్రజలు తమ బాధలు జననేతకు చెప్పుకునేందుకు ముందుకొచ్చారు. తమకు పింఛన్లు ఇవ్వడం లేదని, వేలిముద్రలు పడటం లేదని చెప్పి ఉన్న పింఛన్లను కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు వృద్ధులు వాపోయారు. అదేవిధంగా భర్తలను కోల్పోయిన వితంతువులు కూడా తమకు కొత్తగా పింఛన్లను ఇవ్వడం లేదని.. నెలల తరబడి ఎదురు చూస్తున్నామని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇక రైస్‌ మిల్లు కార్మికులు కూడా తమకు వేతనాలు తక్కువగా ఇస్తున్నారని.. రైస్‌ మిల్లులు కూడా సరిగ్గా నడవని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. వారి బాధలు వింటూ త్వరలోనే మంచిరోజులు వస్తాయని భరోసా ఇస్తూ జగన్‌ ముందుకు కదిలారు. అక్కడి నుంచి బోయరేవులలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు చాకలి వెంకటేశ్వర్లు కుటుంబానికి భరసానిచ్చారు. కుటుంబం వెంట తాము ఉంటామని ధైర్యం చెప్పారు.
 
గిట్టుబాటు ధర కరువు
బోయరేవుల నుంచి మోత్కురుకు చేరుకుని అక్కడ వడ్ల కళ్లంలో రైతులతో వైఎస్‌ జగన్‌ ముచ్చటించారు. తమకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మినుము, మిరప, ధాన్యాలు, కంది.. ఇలా ఏ పంటకూ చంద్రబాబు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యిందని జగన్‌ ధ్వజమెత్తారు. వరుస కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతాంగం.. పండిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించి ఆదుకునేందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. అక్కడి నుంచి తిమ్మనపల్లికి చేరుకుని మూడో రోజు రైతు భరోసా యాత్రను ముగించారు. మూడవ రోజు రైతు భరోసాలో సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి భరోసా కల్పించారు. ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభమైన యాత్ర రాత్రి 7 గంటల వరకూ సాగింది. 
 
కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఐజయ్య, పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, రైతు సంఘం నేతలు నాగిరెడ్డి, వంగాల భరత్‌కుమార్‌ రెడ్డి, శివకుమార్‌ రెడ్డి, పోచా శీలారెడ్డి, కర్రా హర్షవర్దన్‌ రెడ్డి, పోచా జగదీశ్వర్‌ రెడ్డి, యుగంధర్‌ రెడ్డి, రాజా విష్ణువర్దన్‌ రెడ్డి, తరిగోపుల భాస్కర్‌ రెడ్డి, పర్ల శ్రీధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement