రైతాంగానికి రాయితీల వర్షం | Sakshi
Sakshi News home page

రైతాంగానికి రాయితీల వర్షం

Published Mon, Aug 8 2016 11:25 PM

రైతాంగానికి రాయితీల వర్షం

  • సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లు
  • రైతులు సద్వినియోగం చేసుకోవాలి
  • వ్యవసాయ శాఖ
  • నేరడిగొండ : అన్నదాతను ఆదుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీల వర్షం కురిపిస్తోంది. దేశానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సంకల్పించుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఆధునిక పరికరాల ఉపయోగంతో అధిక దిగుబడి సాధించవచ్చని ప్రభుత్వ ఉద్ధేశ్యం. దీని కోసం చిన్న సన్నకారు రైతులకు పెద్ద మొత్తంలో సబ్సిడీ పైన యంత్రాలు, యంత్రసామగ్రిని అందజేస్తోంది. రైతులకు ప్రభుత్వం చేయూతనిస్తోంది.
     
    రాయితీపై ఇప్పటికే ఎరువులు, విత్తనాలు డ్రిప్, స్పింక్లర్లు, పురుగుల మందులు, రసాయన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు ఇలా ఎన్నో అందిస్తోంది. వర్షాలు మోస్తారుగా పడిన నేపథ్యంలో ఖరీఫ్‌ సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. పనులు మొదలు పెట్టి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రాయితీలతో యంత్ర పరికరాలు అందజేస్తోంది. ఈ వివరాలను వ్యవసాయధికారి సురేఖ రైతులకు వివరించారు. 
     
    రోటవేటర్‌
    దీనిని మెట్ట నేలల్లో దుక్కి దున్నడానికి, మాగాణిలో దమ్ముచేయడానికి ఉపయోగిస్తారు. ట్రాక్టరుకు అమర్చి రోజుకు ఆరు నుంచి ఏడు ఎకరాల్లో దుక్కి దమ్ము చేసుకోవచ్చు. పెసర, మినుము, మొక్కజొన్న పంట చేతికి వచ్చాక ఎండిపోయిన మొక్కలను రోటవేటరుతో దున్నడంతో అవి చిన్నచిన్న ముక్కలుగా మారి నేలలో కలిసి తిరిగి సారవంతమవుతాయి. దీన్ని 50 శాతం రాయితీపై వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తారు. విలువ సుమారు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది.
     
    మినీ ట్రాక్టర్‌..
    మినీ ట్రాక్టర్లు 15 హెచ్‌పీ వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రత్యేకంగా చిన్న, సన్నకారు రైతుల కోసం తయారు చేశారు. ఈ ట్రాక్టర్‌తో రోటోవేటర్, కేజీవీల్స్, కల్టివేటర్, నాగళ్లు అమర్చడానికి వీలుగా ఉంటుంది. ఎరువులు, పంట ఉత్పత్తులను రవాణా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని విలువ రూ.3 లక్షలు ఉండగా ప్రభుత్వం రూ.లక్ష రాయితీ కల్పిస్తోంది. 
     
    కలుపు తీసే యంత్రాలు
    పెట్రోల్, డీజీల్‌తో పనిచేసే కలుపుతీసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. 4హెచ్‌పీ నుంచి 6హెచ్‌పీ వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ యంత్ర సహాయంతో కూలీల ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా తగ్గుతుంది. పత్తి, మిరుప పంటలో కలుపు తీయడానికి దాన్ని బ్లేడ్లను సర్దుబాటు చేసి ఉపయోగించుకోవచ్చు. దీని విలువ రూ.70వేల నుంచి 80 వేల రూపాయలు ఉండగా ప్రభుత్వం దీనిని 50 శాతం రాయితీ పై అందజేస్తోంది.
     
    ఫోర్‌వీల్‌ డ్రై వ్‌ ట్రాక్టర్‌
    కేజీవీల్స్‌తో ట్రాక్టర్లు రోడ్డుపై వెళ్లడంతో రోడ్లు §ð బ్బతింటాయి. ఫోర్‌వీల్‌ డ్రై వ్, ట్రాక్టర్‌ చక్రాలకే కేజీవీల్స్‌ అమర్చి ఉంటాయి. దీంతో అవి రోడ్లపై వెళ్లినా కూడా రోడ్డుకు ఏమాత్రం నష్టం జరగదు. కేజీవీల్స్‌తో పొలాలు దమ్ము చేసినప్పుడు బ్లేడు కింద నుంచి పైకి రావడం వల్ల పంట దిగుబడి కూడా తగ్గుతుంది. కానీ, ఫోర్‌వీల్‌ డ్రై వ్‌ ట్రాక్టర్‌ వల్ల ఆ ఇబ్బంది ఉండదు. దీని విలువ రూ. 5 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఉంటుంది. ప్రభుత్వం రైతులకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు అందజేస్తోంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.
     
    మొక్కజొన్న నూర్పిడి యంత్రం
    ఎండిన మొక్కజొన్న కంకులపై పొట్టును తొలగించి యంత్రంలో వేస్తే గింజను మార్పింగ్‌ చేసి శుభ్రం చేస్తోంది. ట్రాక్టర్‌కు జత చేయడం వల్ల ఈ యంత్రం పని చేస్తుంది. ఈ యంత్రంపై ప్రభుత్వం 50 శాతం రాయితీ కల్పిస్తొంది. దీనివిలువ రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంటుంది.
     
    మొబైల్‌ వరి విత్తన ప్రాసెసింగ్‌ యూనిట్‌
    రైతులు విత్తనాలు పండించి తిరిగి రైతులకు విక్రయించడానికి ఉపయోగపడుతుంది. గ్రామ విత్తనోత్పత్తి పథకం ద్వారా అందించే విత్తనాలను రైతులు సాగు చేసి పండిన పంటను ఈ యంత్రం ద్వారా ప్రాసెసింగ్‌ చేయడం ద్వారా నాణ్యమైన విత్తనాలు లభిస్తాయి. ఈ యంత్రం 90 శాతం రాయితీపై లభిస్తోంది.
     
    పవర్‌ ట్రిల్లర్‌
    సన్న, చిన్నకారు రైతులు పొలాలు దమ్ము చేసుకోవడానికి, ఎరువులు, పంట ఉత్పత్తులు రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ యంత్రం సహాయంతో రోజుకు 4 నుంచి 5 ఎకరాల పొలాన్ని దమ్ము చేసుకొవచ్చు. ఈ యంత్రాన్ని ప్రభుత్వం 50 శాతం రాయితీపై అందిస్తోంది. దీని విలువ రూ.1.60 లక్షలు ఉండగా రూ.80 వేల రాయితీ అందిస్తోంది. 
     
    తైవాన్‌ స్ప్రేయర్‌
    పురుగులు, శిలీంధ్ర నాశక మందులను నివారించడానికి ఉపయోగపడుతుంది. పెట్రోలుతో పనిచేసే ఈ యంత్రం తక్కువ బరువుంటుంది. గంటలో 4 ఎకరాల్లో పురుగుమందును దీంతో పిచికారీ చేయవచ్చు. దీనివిలువ రూ.20 వేల వరకు ఉండగా ప్రభుత్వం 50 శాతం రాయితీతో అందిస్తోంది. ఇంకా ఎరువులు, విత్తనాలు వేసే పరికరాలు, తుంపర సేద్యం పరికరాలు, డ్రమ్‌సీడర్, విత్తనశుద్ధి పరికరాలు వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. 
     
    రైతులు సబ్సిడీని వినియోగించుకోవాలి
    ప్రభుత్వం అందజేస్తున్న యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధ్యమే.
    – ఈ.సురేఖ, ఏడీఏ, బోథ్‌ 
     

Advertisement
Advertisement