Sakshi News home page

యువత పవన్‌ను ప్రశ్నించాలి

Published Fri, Jan 1 2016 3:24 AM

యువత పవన్‌ను ప్రశ్నించాలి - Sakshi

 బొబ్బిలి: గత ఎన్నికల్లో యువత తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాలని సినీ నటుడు పవన్ కల్యాణ్ గట్టిగా చెప్పారనీ, ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదనీ, దీనిపై పవన్‌ను రాష్ట్రంలోని ప్రతీ యువకుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఆర్.వి.సుజయ్‌కృష్ణ రంగారావు సూచించారు.
 
  జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌కోలో షిఫ్టు ఆపరేటర్ల పోస్టులు, అంగన్‌వాడీ పోస్టులను అమ్ముకోవడాన్ని నిరసిస్తూ, ఆయా పోస్టులను రోస్టర్ పద్ధతిలో, జీఓలను అనుసరించి భర్తీ చేసి అర్హులకు ఆయా పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుజయ్‌కృష్ణ మాట్లాడుతూ యువత టీడీపీకి ఓటు వేయడం వల్ల ఇంత నష్టం జరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించ కుండా షూటింగులు చేసుకుంటే కుదరదన్నారు. టీడీపీ నడుంవంచి యువతకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిభ ఉన్నా షిప్టు ఆపరేటర్లకు డబ్బే అర్హతగా ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు.
 
  రాష్ట్రంలో జూట్, ఫెర్రో వంటి ఫ్యాక్టరీలు మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నా కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. షిప్టు ఆపరేటర్లు, అంగన్వాడీ పోస్టుల అమ్మకాలపై ముఖ్యమంత్రి ఏసీబీ, విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించాలని, లేకపోతే చంద్రబాబే పెద్ద అవినీతి పరుడుగా భావించాల్సి వస్తుందనీ హెచ్చరించారు.  ఆయన అండతోనే ఎంఎల్‌ఏలు, మంత్రులు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ఆయా నాయకులు గ్రామాల్లోకి అడుగుపెట్టడానికి సిగ్గు పడేలా చేయాలన్నారు.
 
 సాలూరు ఎంఎల్‌ఏ పీడిక రాజన్నదొర మాట్లాడుతూ రాష్ట్రం లో జరుగుతున్న అవినీతి, ఆరోపణలపై ఎప్పటికప్పుడు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా ఈ ప్రభుత్వం స్పందించడం లేదని, పైగా అధికారులు, పార్టీ ప్రతినిధులు పరస్పరం సహకరించుకొని అవినీతికి పాల్పడుతున్నారనీ ధ్వజమెత్తారు. షిఫ్ట్ ఆపరేటర్ల నియామకంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నా భ యం లేకుండా వాటిని నింపుతున్నారన్నారు. సాలూరు ముని సిపాలిటీలొని ఎస్సీ వీధికి చెందిన ఓ నిరుద్యోగి కోర్టుకు వెళితే ఆయనదగ్గర 4 లక్షలు తీసుకున్నారన్నారు. గిరిజనులకు ఇంత అన్యా యం జరిగినా ఆ పార్టీలో ఉండే నాయకులు ఎం దుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వీరందరికీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.
 
 అంగన్‌వాడీ, హౌసింగు డిపార్టుమెంటు ల్లో పోస్టులను అమ్మకానికి పెట్టేశారని తెలిపారు. ఈ పోస్టులు అర్హులకు సంక్రాంతిలోగా ఇవ్వకపోతే ఎస్‌ఈ, సీఎండీ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రౌతు రామ్మూర్తినాయుడు, చింతాడ సర్పంచ్ చింతాడ జయప్రదీప్, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండల నాయకులు కర్రోతు తిరుపతిరావు, తెంటు చిరంజీవిరావు, తెంటుసత్యంనాయుడు, పట్ణణనా య కుడు బొబ్బాది తవిటినాయుడు ప్రసంగించారు. బొబ్బిలి, రామభద్రపురం జెడ్పీటీసీలు మామిడి గౌరమ్మ, బోయిన లూర్థనమ్మ, జిల్లా కార్యదర్శి మడక తిరుపతిరావు, గంగుల మదన్ మోహన్, మాజీ ఎంపీపీలు తమ్మిరెడ్డి దామోదరరావు, గర్బాపు పరశురాం, పెద్దింటి రామారావు, కాకల వెంకటరావు  పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో భారీ  ర్యాలీ నిర్వహించారు.
 

Advertisement

What’s your opinion

Advertisement