వరిగేదేమిటి? | Sakshi
Sakshi News home page

వరిగేదేమిటి?

Published Wed, Nov 2 2016 1:09 AM

వరిగేదేమిటి? - Sakshi

 షాబాద్: వ్యవసాయం రోజురోజుకూ భారమవుతున్నా... ఇవ్వాళ కాకపోతే రేపైనా తమకు మంచి రోజులు రాకపోతాయా అనే ఆశతో రైతులు ముందుకు ‘సాగు’తున్నారు. ఈసారైనా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు పెంచకపోతుందా...అన్న ఆశతో ఎదురుచూస్తున్న వారికి చేదు అనుభవమే ఎదురైంది. మళ్లీ అదే పరిస్థితి ఉత్పన్నం కావడంతో తమకు దిక్కెవరంటూ అన్నదాతలు వాపోతున్నారు. వరితో సహా ఇతర ప్రధాన పంటలకు మద్దతు ధర లేక... అల్లాడుతున్నారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఏటా ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవేళ అన్నీ అనుకూలించి... పంటలు పండినా దళారులు, వ్యాపారుల దగాతో మద్దతు ధర పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు చూసి అవాక్కవుతున్నారు.
 
 పేరుకే సిఫారసులు
 ధాన్యానికి కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్రానికి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పంట ఉత్పత్తి వ్యయాన్ని అంచనా వేసి.. కనీస మద్దతు ధరను నిర్ణయించి... కేంద్రానికి సిఫారసు చేస్తుంది. ఈ సిఫారసులు యధావిధిగా ఆమోదిస్తే కొంతవరకు మేలు కలుగుతుంది. కానీ ఇవి అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా అన్నదాతకు కష్టం తప్పడం లేదు.
 
 కంటితుడుపుగా ధరలు...
 జిల్లాలోని 26 మండలాల్లో లక్ష హెక్టార్లకు పైగా వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలు సాగు చేస్తారు. ఈసారి వాతావరణం అనుకూలించకపోవడంతో గత ఎడాది కంటే సాగు వీస్తీర్ణం కొంత తగ్గిందనే చెప్పాలి. దాదాపుగా 25వేల హెక్టార్లలో పత్తి, 30 వేల హెక్టార్లలో కంది, 25 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 15 వేల హెక్టార్లలో వరి సాగు చేస్తారు. తాజాగా ఏ గ్రేడ్ ధాన్యం ధర రూ.1450 నుంచి రూ.1510కి పెరిగింది. సాధారణ రకం రూ.1410 నుంచి రూ.1470కి పెరిగింది. పత్తి రూ.4100 నుంచి రూ.4160కి... మొక్క జొన్న రూ.1375 నుంచి రూ.1410కి పెరిగింది. నామ మాత్రపు పెరుగుదల వల్ల తమకు ఒరిగేది ఏమీ ఉండదని రైతులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు వ్యాపారులు, దళారులు సిండికేటుగా మారి రైతులను దోచుకుంటున్నారు. ఈ దోపిడీని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.
 

Advertisement
Advertisement