తవ్వుకో.. సొమ్ము చేసుకో! | Sakshi
Sakshi News home page

తవ్వుకో.. సొమ్ము చేసుకో!

Published Sun, Oct 16 2016 6:36 PM

తవ్వుకో.. సొమ్ము చేసుకో!

– యథేచ్ఛగా కొండల తవ్వకాలు 
– ఏజెన్సీలో కాంట్రాక్టర్ల అక్రమాలు
– తవ్విన రాళ్లను రోడ్ల నిర్మాణానికి వాడుకుంటున్న వైనం
– ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత
– అన్నీ తెలిసినా పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు 
బుట్టాయగూడెం : పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి దట్టమైన అడవి, పొడవైన చెట్లు, ఎతైన కొండలు. ఇవి ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆనందింప చేస్తాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ ఆనందం దూరమౌతున్నట్టు కనిపిస్తోంది. కొందరు కొండల మీద చెట్లను నరికి వేస్తుంటే కాంట్రాక్టర్లు కొండలను తొలి చేస్తూ కాసులను పోగేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. రోడ్ల కాంట్రాక్టు పేరుతో ఎతైన కొండలు కళ్లెదుటే కరిగిపోతున్నాయి. సహజ సంపదను అక్రమంగా తవ్వేస్తున్నా అటు అటవీశాఖ అధికారులు కానీ ఇటు రెవెన్యూ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై గిరిజన సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన కొండలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లోని చెట్లను అక్రమార్కులు నరికేస్తున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ చర్యలతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ఎన్నో అనర్థాలు జరిగే అవకాశాలున్నాయని గిరిజనులు వాపోతున్నారు. 
రోడ్ల నిర్మాణం పేరుతో..
పోలవరం నియోజకవర్గంలోని పలు గిరిజన గ్రామాల్లో ఇటీవల రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. బుట్టాయగూడెం మండలం దొరమామిడి, దుళ్లపూడి, కుమ్మరకుంట, ముందులూరు, రేగులగూడెం తదితర గ్రామాల్లోని కొండలను తవ్వేసి ఆ రాళ్లతోనే కాంట్రాక్టర్లు రహదారులు నిర్మిస్తున్నారు. వాస్తవానికి కొండలను తవ్వకుండా గ్రావెల్, రాళ్లు సొంత ఖర్చుతో తెచ్చి రోడ్లను నిర్మించాల్సి ఉంది. కానీ అధికార పార్టీ నేతల దన్నుతో సమీపంలోని కొండలను తవ్వేసి ఆ రాళ్లతో రహదారులను నిర్మిస్తున్నారు. ఏజెన్సీలోని పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా కొండలను తవ్వేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. కొన్ని కొండలు గ్రావెల్‌ కోసం, మరికొన్ని కొండలు కట్టుబడి రాయికోసం తొలిచేస్తున్నారు. ఈ అక్రమాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. 
 
తవ్వేస్తున్నా పట్టించుకోవడం లేదు
ఏజెన్సీ ప్రాంతంలో ఎతై ్తన కొండలు పచ్చదనంతో కనువిందు చేస్తుంటాయి. అటువంటి కొండలను కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణాల కోసం కరగతీసి అక్రమంగా తవ్వుకెళ్తుంటే అధికారులు చూస్తూ ఊరుకోవడం దారుణం. వారి స్వప్రయోజనాల కోసం పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– ముచ్చిక రంజిత్‌ కుమార్‌ దొర, ఆప్తమిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌
 

Advertisement
Advertisement