పోలీస్ శాఖతో బంతాట! | Sakshi
Sakshi News home page

పోలీస్ శాఖతో బంతాట!

Published Thu, Jun 30 2016 3:26 AM

tdp leaders playing with police department

సీఐల బదిలీల్లో ఆధిపత్యం చాటుతున్న టీడీపీ నేతలు
కరణం ఒత్తిడితో మళ్లీ ఆగిన అద్దంకి సీఐ బదిలీ
మిగిలిన బదిలీలకు అడ్డుకట్ట.. మరోసారి భంగపడ్డ గొట్టిపాటి

పోలీస్‌శాఖతో అధికార పార్టీ బంతాట ఆడుతోంది. బదిలీల్లో తలదూరుస్తూ పట్టు చూపుతోంది. ప్రతిభ, సమర్థతను పక్కకు నెట్టి ఆధిపత్యాన్ని నిరూపించుకుంటోంది. తాజాగా మంగళవారం జరిగిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల (సీఐ) బదిలీలకు చెక్ పెట్టింది. బదిలీలు జరిగిన ప్రతిసారీ అధికార పార్టీ ఇదే దందాను అవలంబిస్తూ పోలీస్‌శాఖ ప్రతిష్టను దిగజారుస్తోంది.

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు : టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి, కొత్తగా పార్టీలో చేరిన కొత్త నేత గొట్టిపాటి రవికుమార్‌ల అధిపత్యపోరులో కరణం మరోసారి పైచేయి సాధించారు. 15 రోజుల్లో అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను ఎమ్మెల్యే గొట్టిపాటి రెండోసారి బదిలీ చేయించగా రాత్రికి రాత్రే బదిలీలు నిలిపివేయించి కరణం తన సత్తా చాటారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు లోకేష్ ద్వారా జిల్లాలోని ఆరుగురు సీఐలను మంగళవారం బదిలీ చేయించుకోగా, పాత నేత కరణం ఏకంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలపైనే ఒత్తిడి తెచ్చి బుధవారం ఉదయానికి బదిలీలను నిలిపివేయించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న కరణం వ్యతిరేక వర్గీయులను కూడగట్టుకొని పోరాడినా గొట్టిపాటికి భంగపాటు తప్పలేదు. కొత్త ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, చినబాబు లోకేష్‌లు ప్రాధాన్యతనిస్తున్నారని జోరుగా ప్రచారం సాగినా కరణం విషయంలో అది వర్కవుట్ కాలేదు. కొత్త ఎమ్మెల్యేలు సీఐలను బదిలీ చేయించి పట్టుమని 12 గంటలు కూడా గడవకముందే బదిలీలు నిలిపివేయించి కరణం చక్రం తిప్పటం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరుగుతున్న పరిణామాలు చూసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు జుట్టు పీక్కుంటున్నారు.

 సీఎం చైనా పర్యటనలో ఉన్నా.. వదలక..
ఈ నెల 13వ తేదీన కరణం అనుకూలుడిగా ఉన్న అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్‌ను ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పట్టుపట్టి బదిలీ చేయించారు. ఆయన స్థానంలో గుంటూరు వీఆర్‌లో ఉన్న హైమారావును బదిలీ చేయించాడు. ఉత్తర్వులు వెలువడిన కొద్ది సేపటికే చక్రం తిప్పిన సీఐ ప్రసాద్ బదిలీని నిలిపివేయించారు. రవికుమార్ చినబాబు లోకేష్ వద్ద మొర పెట్టుకున్న ప్రయోజనం లేకపోయింది. మంగళవారం ఫిరాయింపు ఎమ్మెల్యేలు లోకేష్‌పై ఒత్తిడి తెచ్చి అటాచ్‌మెంట్ మాటున జిల్లాలోని ఆరుగురు సీఐలను బదిలీ చేయించుకున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రికి ఉత్తర్వులందాయి.

విషయం తెలుసుకున్న కరణం అంతే వేగంగా పావులు కదిపారు. ఏకంగా చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రితో పాటు డీజీపీపై ఒత్తిడి తెచ్చారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో సీఐని బదిలీ చేస్తారా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గుంటూరు రేంజ్ డీఐజీ ఇచ్చిన సీఐల అటాచ్‌మెంట్ బదిలీల ఉత్తర్వులను రాష్ట్ర డీజీపీ రద్దు చేసినట్లు సమాచారం. అనంతరం అటాచ్‌మెంట్ ఉత్తర్వులను రద్దు చేశామని, ఎక్కడి సీఐలను అక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ డీఐజీకి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు పంపినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అన్ని బదిలీలను నిలపడం సరికాదంటూ పాత ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, కదిరి బాబూరావు, ఆమంచి కృష్ణమోహన్‌లు లోకేష్‌కు విన్నవించినట్లు సమాచారం. స్పందించిన లోకేష్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిధిలోని అద్దంకి, గిద్దలూరు, కందుకూరు సీఐ బదిలీలను నిలిపి వేయాలని, మిగిలిన బదిలీలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం.

Advertisement
Advertisement