పాపం.. పెద్దోళ్లు..! | Sakshi
Sakshi News home page

పాపం.. పెద్దోళ్లు..!

Published Wed, Apr 5 2017 9:40 AM

పాపం.. పెద్దోళ్లు..! - Sakshi

► పార్టీలు మారినా ఫలితం లేదాయే : జ్యోతుల
► సిద్ధాంతకర్తనైనా గుర్తింపు రాకపోయే : గోరంట్ల
► ఇద్దరు సీనియర్‌ నేతల అంతర్మథనం
► జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు
► రాజీలు కుదిర్చినా ససేమిరా...


ఒకరు పలు పార్టీలకు వ్యూహకర్త ... ఇంకొకరు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనే పురుడు పోసిన సిద్ధాంత కర్త. ఇందులో ఒకరు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ...ఇంకొకరు రాజమహేంద్రవరం శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏ పార్టీలోనూ జ్యోతులకు స్థిరత్వం లేక చంచల స్వభావంతో ఎటు గాలివీస్తే అటు అడుగులు వేయడంతో ఆ అడుగులు ఎక్కడా బలంగా నిలదొక్కుకోలేని దుస్థితి. ‘ఉన్నది వదిలేవు ...లేనిది కోరేవు ... ఒక పొరపాటుకి యుగములు వగచేవు’ అంటూ ఓ సినీ రచయిత గీతా విలాపంలా తయారయింది  నెహ్రూ పరిస్థితి. ఇక గోరంట్ల వ్యథ మరో విధంగా ఉంది. టీడీపీ సిద్ధాంత కర్తల్లో ఒకరినైన నన్నా విస్మరించేదంటూ చిందులు తొక్కుతున్నారు. పార్టీ అధినేత ఎన్టీ రామారావునే అత్యంత క్రూరంగా బయటకు పంపించేసి ... ఆయన మరణానికి  కారణమైన ‘బాబు’ దగ్గరా ఆ సుద్దులంటూ ఆయన అనుచరులే గుసగుసలాడుకుంటున్నారు. వీరి ఎదుగుదలను వెనుకనుంచి అడ్డుకున్నది యనమలేనని అనుచర వర్గం ఆగ్రహంతో ఉంది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ :
కొన్ని సందర్భాల్లో తీసుకునే నిర్ణయాలు కొందరు నేతలను అత్యున్నత స్థాయికి తీసుకుపోతుంటాయి. మరికొందరినైతే రాజకీయంగా అధఃపాతాళానికి నెట్టేస్తాయి. ఇందులో రెండో రకం నాయకుడిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో మూడు దశాబ్దాల చరిత్ర కలిగి అపారమైన అనుభవం ఉన్న జ్యోతుల కూడా రాజకీయాల్లో ఒక దాని తరువాత మరొకటి తప్పటడుగులే వేశారు. టీడీపీ సైకిల్‌ చక్రాన్ని వదిలేసి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి అనంతరం మహానేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆశయాలతో ముందడుగు వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును జగ్గంపేటలోనే జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించి నెహ్రూకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. నమ్మి వచ్చిన నెహ్రూకు టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అంతటితోనే సరిపెట్టకుండా  శాసనసభా పక్ష ఉప నేతను చేసి నెహ్రూ గౌరవాన్ని ఇనుమడింప జేశారు. ఇంతా చేస్తే టీడీపీకి ఫిరాయించేశారు. అందుకు మంత్రి పదవా లేక, ఇంకేమైనా ప్రలోభాలు కారణమయ్యాయో తెలియదుగానీ నమ్మి ఒక మెట్టుపైకి తీసుకువెళ్లిన పార్టీని నడిసంద్రంలో ముంచేశారు.

ఆ ప్రభ ఏదీ...?
ఆవిర్భావం నుంచి ఉన్న టీడీపీని వీడకుండానైనా ఉండాల్సింది. ఎంతకాలం తాను ఆ పార్టీలో ఉన్నా సొంత పార్టీలో ప్రత్యర్థి యనమల రామకృష్ణుడు ఉన్నంత కాలం ఇక మంత్రి పదవి అనేది అందని ద్రాక్ష అనే నిర్థారణకు వచ్చి టీడీపీని వీడి బయటకు వచ్చేశారు. ఆ పార్టీని వీడి బయటకు వస్తే వచ్చారు, ఆ తరువాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి మంచి నిర్ణయమే తీసుకున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. అటువంటి పార్టీని కాదనుకుని నెహ్రూ బయటకు వెళ్లి మరో తప్పటుడుగు వేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సారథిగా జిల్లాలో ఏమూలకు వెళ్లినా ప్రజలు, పార్టీ నేతలు వెన్నంటి నిలిచేవేవారు. అటు నియోజకవర్గంలో ఇటు జిల్లా అంతటా చక్రం తిప్పే పరిస్థితి. అటువంటిది తిరిగి టీడీపీకి వెళ్లాక నియోజకవర్గ నాయకుడిగానే మిగిలిపోయారు. మెట్ట ప్రాంతంలో ఏలేరు కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన నెహ్రూ అదే ఏలేరుకు నీరు సరఫరా చేసే పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు పిఠాపురంలో సీఎం శంకుస్థాపన కార్యక్రమంలో అందరిలో ఒకరిగా మిగిలిపోయారు. అందరికంటే చివర్లో మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడే నెహ్రూ స్థాయిని ఏ రకంగా తగ్గించేశారోనని ఆ రోజే మెట్ట నేతల మధ్య గుసగుసలు వినిపించాయి.

పాపం సిద్ధాంతకర్త...?
నెహ్రూ పరిస్థితి ఇలా ఉండగా మంత్రి పదవి రాలేదని పార్టీ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. గోరంట్లకు మద్ధతుగా నగరపాలక సంస్థ సమావేశాన్ని బహిష్కరించిన  టీడీపీ కార్పొరేటర్లు రెండు రోజుల్లో రాజీనామాలకు కూడా సిద్ధపడతామని ప్రకటించడం వెనుక ఆంతర్యమేమిటై ఉంటుందా అని పార్టీలో చర్చ నడుస్తోంది. మంత్రి పదవిపై ఆశలు పెంచుకుని నిరాశ చెందిన మరో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను విలేకర్లు కలిసిన సందర్భంలో ఆయన కాస్త వేదాంత «ధోరణిలో మాట్లాడినట్టుగా కనిపించింది. ‘మంత్రి పదవి ఆశిస్తాం, కానీ అధినేత పెట్టుకున్న ప్రమాణాలకు ఫిట్‌ అవ్వలేకపోయి ఉండవచ్చునని’ చెప్పుకు రావడం గమనార్హం. బాబు తీరుపై కొందరు బయటపడగా ... లోలోన అంతర్గతంగా గుర్రుగా ఉన్న మరికొందరు భవిష్యత్తులో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

నీడలా యనమల
టీడీపీలో మంత్రి కాకుండా అడ్డుపడ్డ నాయకుడే తాజా మంత్రివర్గ విస్తరణలో సైతం మోకాలడ్డటంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఎంత పనిచేశాయనే నిర్వేదం తప్ప నెహ్రూ చేయగలిగిందేముంటుందని అనుచరులే సముదాయించుకుంటున్నారు. పార్టీ మారిన దగ్గర నుంచి ఆయన నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమైపోయారు. జిల్లా స్థాయిలో టీడీపీ కార్యక్రమాలు జరిగినా నలుగురిలో ఒకరిగానే మిగిలే వారు. ఈ రకంగా ఒక దాని వెంట మరొకటి వేసిన తప్పటడుగులు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత ఉనికినే సవాల్‌ చేశాయి. నెహ్రూలో ఉన్న మునుపటి పోరాట పటిమ ఇప్పుడు కూడా ఉంటాదనుకుంటే పొరపాటే. వయస్సు కూడా ఇందుకు సహకరించాలి. తాజా విస్తరణలో ఛాన్స్‌ వస్తేగిస్తే పూర్వపు ప్రాభవాన్ని తిరిగి పొందవచ్చునన్న నెహ్రూ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లడంతో రాజకీయ భవిష్యత్తు అంధకారమై నిర్వేదంలో ఉన్నారంటున్నారు. నెహ్రూను బుజ్జగించేందుకు గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ లేదా రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆశ పెడుతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ పదవులేవీ తమ నాయకుడి ప్రతిష్టను పెంచలేవనే అభిప్రాయంతో జ్యోతుల అనుచరవర్గం అభిప్రాయపడుతోంది. పదవుల పందేరంపై భగ్గుమంటున్న రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా రాష్ట్రంలో పలువురు నేతల స్పందనలను గమనిస్తూ  కిం కర్తవ్యం ఏమిటా అని నెహ్రూ అనుచరవర్గం తర్జనభర్జనపడుతోంది.

Advertisement
Advertisement