టీడీపీ ఓటర్లా.. ఐతే ఓకే | Sakshi
Sakshi News home page

టీడీపీ ఓటర్లా.. ఐతే ఓకే

Published Fri, Nov 4 2016 1:16 AM

టీడీపీ ఓటర్లా.. ఐతే ఓకే - Sakshi

ఓటర్ల నమోదులో ‘అధికార’ పెత్తనం
దొడ్డిదారిన అధికారులకు ఆదేశం
టీడీపీ సానుభూతిపరులకు ప్రాధాన్యం
నమోదులో వెనుకబడిన జిల్లా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధికారం ప్రయోగిస్తూ అక్రమాలకు తెరలేపుతోంది.  ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో తమ పార్టీ సానుభూతి పరులనే ఓటర్లుగా నమోదు చే సుకోవాలని అధికారులకు అనధికార ఆదేశాలచ్చినట్లు తెలుస్తోంది. ఈ తీరుపై వామపక్ష ఎమ్మెల్సీ అభ్యర్థులు నిరసన కూడా వ్యక్తం చేశారు. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ స్థానానికి వామపక్షాల తరఫున ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రమణ్యం, పట్టభద్రుల ఎమ్మెల్సీగా యండవల్లి శ్రీనివాసులరెడ్డి అభ్యర్థులుగా మరోసారి ఎన్నికల బరిలో దిగే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు.

చిత్తూరు/చిత్తూరు (గిరింపేట): ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడంలో టీడీపీ మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత పనిచేస్తుందనే భావనతో పోటీకి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారని తెలిసింది. టీచర్ల యూనియన్లలో గెలుపు గుర్రాలపై సర్వే చేయించుకొని వారిని పార్టీలోకి రావాలని..ఒక వేళ రాలేకపోతే సంఘాల్లోనే ఉంటూ పార్టీ అభ్యర్థులకు సహకరించాలని టీడీపీ అధిష్ఠానం కోరుతోందని తెలిసింది. కొన్ని రోజుల క్రితం జిల్లాలోని ఎస్టీయూ సంఘ నేతకు టీడీపీ జిల్లా నాయకులు ఫోన్ చేసి తమ మద్దతుదారుడిగా పోటీ చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. దీనికి సమ్మతిస్తే విజయవాడ, హైదరాబాద్‌కు వచ్చి  ముఖ్యనేతను కలవొచ్చని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఓటర్ల నమోదులో ఏకపక్షం..
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లను నమోదు చేసుకోవడంలో అధికారులు.. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఓటు నమోదుకు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే పట్టభద్రులు, ఉద్యోగులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నమోదులో లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు నమోదుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నమోదు విషయంలో మిగిలిన రెండు జిల్లాల కంటే చిత్తూరు వెనబడింది.  యూనివర్సిటీ, ప్రైవేటు విద్యా సంస్థల్లో  అధికార టీడీపీ ఓటర్ల నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకే చోట ఎక్కువ మందిని ఓటర్లను నమోదుచేసుకోకూడదనే నిబంధన ఉన్నా అధికార పార్టీ నేతలు ఖాతరు చేయడం లేదు. తెలిసినా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అధికార పార్టీలో ఓటమి గుబులు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని అంతర్గత సర్వేల్లో తేలడంతో అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటు వేసేలా దొడ్డిదారులో ్లప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించకుండా ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. టీడీపీ నాయకులకున్న విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులందరి ఓట్లనూ కొల్లగొట్టేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు సమాచారం.

గెలుపుగుర్రాలెవరు...
మూడు జిల్లాలో గెలుపు గుర్రాలు ఎవరు అని టీడీపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండేవారికి టిక్కెట్లు ఇచ్చే విషయంలో కొందరిపేర్లు తెరపైకి తీసుకొస్తోంది. ఇప్పటికే చదలవాడ సుచరిత, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, దేశాయి శెట్టి హనుమంత రావు, వాసుదేవనాయుడు పేర్లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీదారులుగా తెరపైకి తెస్తోంది. వీరిలో ఒకరికి టీడీపీ బీఫాం ఇస్తుందని సమాచారం.

ప్రత్యేక రాయలసీమ వాదుల పోటీ..?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతున్న నాయకులు కూడా పోటీచేస్తారనే ఉహాగానాలు ఊపందుకున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకొని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కొన్నాళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో దిగి రాయలసీమ రాష్ట్రం కోసం రాజకీయంగా పోరాడాలని నాయకులు భావిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా భూమన సుబ్రమణ్యం రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాచిరెడ్డి పురుషోత్తం రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement