కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికుల ఇక్కట్లు | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికుల ఇక్కట్లు

Published Thu, May 26 2016 12:23 AM

కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికుల ఇక్కట్లు

పిట్టలవానిపాలెం/బాపట్ల (గుంటూరు): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 54 మంది యాత్రికులు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మోసగించడమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితుల్లో ఒకరైన గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం జెడ్పీటీసీ సభ్యుడు చిరసాని నారపరెడ్డి ఫోన్‌లో తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా నుంచి 20 మంది, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ నుంచి 34 మంది హైదరాబాద్ ఆర్‌కే ట్రావెల్స్ నుంచి బద్రినాథ్ యాత్రకు వెళ్లేందుకు ఈ నెల 16న టికెట్లు బుక్ చేసుకున్నారు.

ఇందులో భాగంగా 54 మంది యాత్రికులను కేదార్‌నాథ్‌లోని రుద్రప్రయాగ జిల్లా వరకు తీసుకెళ్లారు. ఒప్పం దం ప్రకారం అక్కడి నుంచి బద్రినాథ్‌కు హెలికాఫ్టర్‌లో ట్రావెల్స్‌వారే తీసుకెళ్లాల్సి ఉంది. అక్కడ దించేసిన తర్వాత వారి గురించి పట్టించుకున్ననాథుడే లేకుండా పోయారు. ట్రావెల్స్ వారికి ఫోన్ చేస్తే సరైన సమాధానం చెప్పకపోవడంతో న్యాయం చేయాలంటూ యాత్రికులు రుద్రప్రయాగ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈలోగా కొంతమంది యాత్రికులు దారి తెలియక తలో దిక్కు అయ్యారు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి యాత్రికులందరినీ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని కోరామని ఆయన చెప్పారు.

 బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చేయూత
 గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లి దిక్కుతోచని స్థితిలో ఉన్న పలువురు యాత్రికులను బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆదుకున్నారు. ట్రావెల్స్ సిబ్బంది చేతులెత్తేయడంతో మరి కొందరు కనిపించకుండా పోవడాన్ని నారపరెడ్డి.. ఎమ్మెల్యే కోనరఘుపతి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఢిల్లీలోని ఏపీ భవన్ ఇన్‌చార్జి శ్రీకాంత్‌తోపాటు రుద్రప్రయాగలోని ఎస్పీ ప్రహ్లాద్ మీనన్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. యాత్రికులందరిని గుప్తకాశీ ప్రాంతంలో సురక్షితంగా ఉంచడంతోపాటు గురువారం కొన్ని ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement