ఎందుకొచ్చారు? | Sakshi
Sakshi News home page

ఎందుకొచ్చారు?

Published Thu, Jun 29 2017 1:20 AM

ఎందుకొచ్చారు?

ఎవరు రమ్మన్నారు..! ఎవరికోసం వచ్చారు..!! ఎందుకొచ్చారు..! మాకోసం వచ్చారా..! ఉంటే ఉండండి.. లేకుంటే పొండి..! ఇది పింఛన్‌దారులు, ఉపాధి కూలీల పట్ల బ్యాంకు అధికారుల తీరు..! ప్రభుత్వం అందజేస్తున్న ‘ఆసరా’పింఛన్‌ కోసం వస్తే చీదరించుకుంటున్నారు.. నెలంతా కష్టపడి పని చేసి ‘ఉపాధి’డబ్బుల కోసం వస్తే కసరించుకుంటున్నారు..
పింఛన్‌ అడిగితే చీదరింపు..!
కూలి అడిగితే కసరింపు!!
ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు

అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండల పరిధిలోని వినాయకపురం ఏపీజీవీబీ ఖాతాదారులయిన ఉపాధి కూలీలు, పింఛన్‌ దారులు బుధవారం అశ్వారావుపేట బ్రాంచికి వచ్చి భంగపాటుకు గురయ్యామని వాపోతున్నారు. పింఛన్‌ కోసం వచ్చామంటే ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని..? పోండి.. మా దగ్గర డబ్బుల్లేవంటున్నారని.. ఉపాధి కూలీ డబ్బులడిగితే.. మీరీ బ్యాంకుకు ఎందుకొచ్చారని కసరుకుంటున్నారని అమాయక గిరిజనులు వాపోతున్నారు.

వినాయకపురం బ్రాంచిలో ఒక బ్యాంకుమిత్రపై పింఛన్లు కాజేసిన ఆరోపణపై పోలీసు కేసు నడుస్తోంది. మరో ఇద్దరిపైనా ఆరోపణలున్నాయి. పలు కారణాలతో పింఛన్లు, కూలీ డబ్బుల పంపిణీ ఆలస్యం అవుతోంది. దీంతో వినాయకపురం బ్యాంకుకు వెళ్లిన వారికి అక్కడ సిబ్బంది డబ్బుల్లేవని.. అశ్వారావుపేట బ్యాంకుకు వెళ్లాలని సూచిస్తున్నారు. బ్యాంకు మిత్రల వద్ద డబ్బుల్లేక, వినాయకపురం బ్యాంకులో డబ్బులు లేకపోవడంతో పింఛన్‌ దారులు, ఉపాధి హామీ కూలీలు అశ్వారావుపేట బ్యాంకుకు వచ్చారు.ఇదీ కాక అశ్వారావుపేట బ్రాంచి పరిధిలోని బ్యాంకు మిత్రలకు కూడా సరిపడా డబ్బులివ్వక పోవడంతో బ్యాంకు మిత్రలకు బదులుగా ఖాతాదారులు బ్యాంకునే ఆశ్రయించి నగదు పొందుతున్నారు.

ఈ క్రమంలో బుధవారం మండల పరిధిలోని మారుమూల గ్రామాలయిన మొద్దులమడ, కుడుములపాడు, కావడిగుండ్ల, గాండ్లగూడెం తండాతోపాటు పలు గ్రామాల నుంచి గిరిజనులు వచ్చారు. కూలి, పింఛన్‌ డబ్బులు తీసుకుని బుధవారం సంత చేసుకుని ఇంటికి వెళదామని ఆశతో వచ్చిన గిరిజనులకు నిరాశ, ఛీదరింపులే దక్కాయని వాపోతున్నారు. గిరిజన నియోజకవర్గంలో గిరిజనులకు కనీసం కూలి డబ్బులు, పింఛన్‌ డబ్బులు కూడా ఇవ్వకుండా గంటల తరబడి నిలబెట్టారని వాపోతున్నారు. కాగా మొక్కుబడిగా కొందిరికిచ్చి కొందరికి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి పింఛన్, కూలి డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

వచ్చే వాడినే కాదు..
పింఛన్‌ డబ్బుల కోసం బ్యాంకు మిత్ర వద్దకు వెళితే డబ్బులు లేవన్నాడు. అశ్వారావుపేట బ్యాంకు దగ్గరకు వస్తే డబ్బులిప్పిస్తానన్నాడు. తీరా ఇక్కడకు వచ్చాక నిన్నవ్వరు రమ్మన్నారు..?
– విప్పచెట్టు కేతిరెడ్డి, గాండ్లగూడెం తండా

అన్ని ఊర్లూ ఇక్కడే..
వినాయకపురం బ్యాంకుకు వెళ్లిన వారిని అశ్వారావుపేట బ్యాంకు వద్దకు వారు పంపుతున్నారు. మండలంలోని అన్ని ఊర్ల నుంచి పింఛన్‌దారులు, ఉపా«ధి కూలీలం వచ్చాం. కానీ ఇక్కడ ఎవరు రమ్మన్నారని ప్రశ్నిస్తున్నారు.
– తుర్సం రాజు, మొద్దులమడ

రావొద్దంటే రాముగా..
కరువు పనికి రాకపోతే మీకు అవి ఆపేస్తాం, ఇవి ఆపేస్తామంటూ ఎంపీడీఓ ఆఫీసోల్లు బెదిరిస్తారు. తీరా పనిచేశాక బ్యాంకుకొచ్చి డబ్బులడిగితే ఎందుకొచ్చారు.. ఎవరు రమ్మంటే వచ్చారంటూ ఛీత్కరించుకుంటున్నారు.
– మడకం కుమారి, ఊట్లపల్లి

బ్రాంచి మేనేజర్‌ వివరణ
ఈ విషయాలను బ్రాంచి మేనేజర్‌ సుజిత దృష్టికి తీసుకెళ్లగా అశ్వారావుపేట బ్రాంచి ఖాతాదారులకు చెల్లింపులు చేయడానికే మాదగ్గర సరిగా డబ్బులుండడంలేదు. వినాయకపురం బ్రాంచి ఖాతాదారులను మా దగ్గరకు ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు. వీలయితే సాధ్యమైనంత వరకు వారికి డబ్బులిచ్చేందుకు ప్రయత్నిస్తాం. మా బ్రాంచి ఖాతాదారులకు డబ్బులివ్వకుంటే చెప్పమనండి అని అన్నారు.

Advertisement
Advertisement