బాంబు పేలుడు కేసులో కొత్త మలుపు | Sakshi
Sakshi News home page

బాంబు పేలుడు కేసులో కొత్త మలుపు

Published Thu, Jun 16 2016 8:01 AM

The new twist in the bomb blast case

ఇదే తరహాలో కేరళలోని కొల్లంలో పేలుడు కేరళ వైపు
చిత్తూరు పోలీసుల చూపు

చిత్తూరు: ఏప్రిల్.. 7. చిత్తూరులోని న్యాయస్థానాల సముదాయంలో పట్టపగలు న్యాయమూర్తులు ఉపయోగించే ప్రొటోకాల్ వాహనం కింద బాంబు పేలింది. దీంతో ఓ న్యాయవాది వద్ద పనిచేసే గుమస్తా కాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

 సీన్ కట్ చేస్తే...
బుధవారం.. కేరళ రాష్ట్రం కొల్లామ్‌లోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో ఓ జీపు కింద మందు పాతర పేలింది. ఇందులో కూడా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరులో జరిగిన ఘటన, కొల్లామ్ ఘటన రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న చిత్తూరు పోలీసులు కేరళ ఘటనపై దృష్టి సారించారు. చిత్తూరు నగరంలో బాంబు పేలుడు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఏ ఒక్క చిన్న క్లూ కూడా దొరక్కుండా నిందితులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కేరళలోని కొల్లాం న్యాయస్థానాల సముదాయంలో బుధవారం బాంబు పేలుడు జరిగింది. చిత్తూరులో పార్కింగ్‌లో ఉన్న కారు కింద బాంబుపెట్టి పేలుడు సృష్టించారో ఇదీ అలాగే జరిగింది.

కొల్లామ్‌లో న్యాయస్థానాల సముదాయం, కలెక్టరేట్ రెండూ ఒకే చోట ఉన్నాయి. చిత్తూరులో ఉపయోగించినట్లే పేలుడులో గన్‌పౌడర్‌ను తక్కువ మొత్తం ఉంచారు. అంటే ఎవర్నీ టార్గెట్ చేయడానికి కాదు.. భయపెట్టడానికన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ రెండు ఘటనలకు ఏవైనా సంబంధాలున్నాయా..? అనే దిశగా చిత్తూరు పోలీసులు సమాలోచన చేస్తున్నారు. చిత్తూరు నుంచి ఓ బృందాన్ని కొల్లామ్‌కు పంపి, అక్కడి పరిస్థితిపై ఆరా తీయడానికి చిత్తూరు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement