టమాటా @100 | Sakshi
Sakshi News home page

టమాటా @100

Published Mon, Jun 13 2016 12:17 AM

టమాటా @100

మళ్లీ పెరిగిన ధరలు
రైతుబజార్లలో రూ.52 ఠ అవీ నాసిరకమే
బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు

 

 

విజయవాడ : టమాటా ధర ఠారెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ప్రైవేటు మార్కెట్‌లో కేజీ రూ.100కు చేరాయి. రైతుబజార్లలో కేజీ రూ.52 పలుకుతున్నా టమాటాలు వినియోగదారులకు సరిపడా దొరకటం లేదు. ఉన్నవీ నాణ్యత లేకపోవడం గమనార్హం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టమాటా తోటలు పంట అయి పోవటంతో ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోనూ భారీ వర్షాలకు టమాటా దిగుబడి తగ్గిందని చెపుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి విజయవాడ మార్కెట్‌కు రోజుకు 10 లారీల టమాటాలు వచ్చేవి. విజయవాడతో పాటు, జిల్లాలోని 17 రైతుబజార్లలో 10 వేల టన్నుల విక్రయాలు సాగించేవారు. నాలుగు రోజుల నుంచి కేవలం రెండు లారీలు అంటే రెండు వేల కిలోల టమోటాలు మాత్రమే దిగుమతి అవుతున్నాయి. దీంతో జిల్లాలోని 17 రైతుబజార్లకు టమాటా సరఫరా కావటం లేదు. రైతు బజార్లలో కేజీ రూ.52గా మార్కెటింగ్ అధికారులు నిర్ణయించారు. దీంతో వ్యాపారులు రైతుబజార్లకు టమాటా సరఫరా చేయకుండా ప్రైవేటు మార్కెట్‌లకు తరలించేస్తున్నారు.  

 
రైతుబజార్లలో అరకొరగా కూరగాయలు

రైతుబజార్లకు కూరగాయలు అరకొరగానే వస్తున్నాయి. తోటల్లో పంట ఉత్పత్తులు గణనీయంగా తగ్గటంతో కూరగాయలు అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. గోరుచిక్కుడు, బెండ, దొండ, దోస, పచ్చిమిర్చి, వంగ, ఆకు కూరలు కూడా సరిగా రావటం లేదు. వచ్చిన సరకూ నాసిరకంగా ఉంటోంది. వర్షాలు కురిసి కూరల తోటలు పెరిగే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెటింగ్ అధికారులు చెపుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement