పెచ్చెర్వులో యూనిసెఫ్‌ ప్రతినిధులు | Sakshi
Sakshi News home page

పెచ్చెర్వులో యూనిసెఫ్‌ ప్రతినిధులు

Published Thu, Jun 29 2017 11:03 PM

పెచ్చెర్వులో యూనిసెఫ్‌ ప్రతినిధులు

ఆత్మకూరురూరల్ :  ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని పెచ్చెర్వు చెంచు గూడేన్ని గురువారం యూనిసెఫ్‌ బృందం సందర్శించింది. యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్‌నేషనల్‌ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీఫండ్‌ ఇండియా కో- ఆర్డినేటర్లు డాక్టర్‌ నమ్రతా కులకర్ణి, డాక్టర్‌ శివ ప్రసాద్‌తో కూడిన బృందం నల్లమల అడవుల్లోని పెచ్చెర్వు చెంచుగూడెం వెళ్లి అక్కడి చెంచులతో రోజంతా గడిపారు. వారి పిల్లల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న ఆటవిక పరిస్థితులపై అధ్యయనం జరిపారు. అక్కడి పిల్లలకు ప్రధాన సమస్యగా ఉన్న పౌష్టికాహార లోపానికి కారణాలను అన్వేషించారు. ప్రసవాలు ఆసునపత్రుల్లో కంటే వారి పూరి గుడిసెల్లోనే ఎక్కువగా జరుగుతుండడం, ఆసుపత్రికి వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యాలలేకపోవడం తదితర కారణాలను అందుకు గుర్తించారు. ఉపాధి పనులు జరుగుతున్న చోటుకు కూడా వెళ్లిన యూనిసెఫ్‌ బృందం గూడెం వాసుల స్థితిగతులపై సమగ్ర నివేదిక తయారు చేశారు. యూనిసెఫ్‌ కో- ఆర్డినేటర్‌ డాక్టర్‌ నమ్రతా కులకర్ణి మాట్లాడుతూ పౌష్టికాహార లోపం, రక్త హీనతలు చెంచులను çపట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలుగా గుర్తించినట్లు తెలిపారు. చెంచు పిల్లలు, తల్లుల ఆరోగ్యాభివృద్ధిపై యూనిసెఫ్‌ దృష్టి పెట్టగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యూనిసెఫ్‌ బృందం  చెంచు గూడేల సందర్శనలో హెల్త్‌ సూపర్‌ వైజర్‌ విజయకుమార్‌ వారికి సహాయ పడ్డారు.
 

Advertisement
Advertisement