ముగిసిన వార్డెన్ల కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

ముగిసిన వార్డెన్ల కౌన్సెలింగ్‌

Published Sat, Nov 5 2016 11:48 PM

ముగిసిన వార్డెన్ల కౌన్సెలింగ్‌ - Sakshi

– 19 మందికి పోస్టింగ్‌లు
 
కర్నూలు(అర్బన్‌): సాంఘిక సంక్షేమశాఖలో నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న 19 మంది వసతి గృహ సంక్షేమాధికారులకు ఎట్టకేలకు పోస్టింగ్‌లు ఇచ్చారు. శనివారం ఉదయం సంక్షేమభవన్‌లోని డీడీ చాంబర్‌లో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు. ప్రసాదరావు, బీసీ సంక్షేమాధికారి డి. హుసేన్‌సాహెబ్‌ ఆధ్వర్యంలో వసతి గృహ సంక్షేమాధికారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అంతుకు ముందు జరిగిన సమావేశంలో డీడీ  మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఆదేశాల మేరకు తమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రీ మెట్రిక్, కళాశాల వసతి గృహాలతో పాటు, బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న వసతి గృహాలకు పోస్టింగ్‌లు ఇస్తున్నామన్నారు. ఖాళీలన్నింటిని ముందుగానే తెలియజేశామని, సంబంధిత వార్డెన్లు తమకు ఇష్టమున్న హాస్టళ్లను ఎంపిక చేసుకొని ఇచ్చిన ప్రొఫార్మలో ఆప్షన్లు ఇవ్వాలన్నారు. ఇచ్చిన ఆప్షన్ల మేరకు ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా హాస్టళ్లను కేటాయిస్తామన్నారు. కౌన్సెలింగ్‌ నిర్వహించిన జాబితాను జిల్లా కలెక్టర్‌కు ఆమోదం కోసం పంపుతామన్నారు. తుది నిర్ణయం కలెక్టర్‌ తీసుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డబ్ల్యూఓ ప్రకాష్‌రాజు, ఎస్‌సీ హెచ్‌డబ్ల్యూఓస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామచంద్రుడు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జెడ్‌ దొరస్వామి, కే బాబు, కోశాధికారి రాముడు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement