Sakshi News home page

కోనేటి రాయుడి సన్నిధిలో నీటి కొరత

Published Tue, Sep 1 2015 8:42 PM

కోనేటి రాయుడి సన్నిధిలో నీటి కొరత - Sakshi

సాక్షి, తిరుమల: కోనేటి రాయుడి సన్నిధిలో నీటి కొరత ఏర్పడింది. తిరుమలలో శ్రీవారి భక్తులకు తాగునీటి కష్టాలు పెరిగాయి. తాగునీటి కోసం భక్తులు నీటి బాటిళ్లపై ఆధార పడాల్సి వస్తోంది. కొండపై ప్రస్తుతం రోజుకు 32 లక్షల గ్యాలన్ల నీరు వినియోగిస్తున్నారు. ఈ సీజన్‌లో అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో ఇక్కడి గోగర్భం, ఆకాశగంగ, కుమారధార-పసుపుధార జలాశయాలు చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. పాపవినాశనంలో మాత్రమే (500 లక్షల గ్యాలన్లు) నిల్వ ఉంది. ఇది 15 రోజులకు సరిపోతుంది.

తిరుపతి నుంచి తె లుగుగంగ నీటిని కేవలం 5 ఎంఎల్‌డీ మాత్రమే తీసుకొస్తున్నారు. తిరుపతిలోని కల్యాణి డ్యాములో వేసిన బోర్ల ద్వారా మరికొంత నీటిని సేకరిస్తున్నారు. ఒకవైపు తెలుగుగంగ, మరోవైపు కల్యాణీ బోర్ల నీటిని తిరుమలకు తరలించి ఆలయం, నిత్యాన్నప్రసాదంతో పాటు భక్తుల అవసరాలు తీరుస్తున్నారు.


పొదుపు చర్య..నీటి కష్టాలు
తాగునీటి సమస్య టీటీడీకి పెద్ద సవాలుగా మారింది. ప్రధాన జలాశయాలు ఎండిపోవడంతో ఉన్న నీటిని పొదుపుగా వాడుతున్నారు. కాటేజీలకు తాగునీటి సరఫరాలో భారీగా కోత విధించారు. ఈ ప్రభావంతో భక్తులు తాగునీటి కోసం బాటిళ్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఈనెల 16 నుంచి 24వ వరకు వార్షిక, అక్టోబరు 14 నుంచి 22వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నీటి కష్టాలు రెట్టింపయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగు గంగ కోటాను పెంచుకునేందుకు టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో గంగ కోటాను మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

Advertisement

What’s your opinion

Advertisement