Sakshi News home page

నమ్మినందుకు ‘గొంతు’ కోశాడు

Published Wed, Jun 15 2016 8:06 PM

నమ్మినందుకు ‘గొంతు’ కోశాడు

  ఆడపిల్లలు పుట్టారని నిత్యం వేధింపులు
  పెద్దల సమక్షంలో కుదిరిన రాజీ
  బాగా చూసుకుంటానని హామీ
  నమ్మి వెంట వచ్చిన భార్య హత్య
  గొంతు కోసి చంపిన భర్త

 
 నవమాసాలు మోసి జన్మనిచ్చింది ఆడది. నాతిచరామి ప్రమాణాన్ని నమ్మి వెంటవచ్చిందీ ఆడదే. ఒకరు జన్మనిచ్చారు. మరొకరు ఆజన్మాంతం ఆనందాన్నిస్తారు. ఆ ప్రబద్ధుడు అదే విస్మరించాడు. ఆడపిల్లలు కన్నందుకు కట్టుకున్నదానిపై అక్షరాలా ‘కత్తి’గట్టాడు. అర్ధరాత్రి కాలయముడయ్యాడు. కిరాతకంగా మెడకోసి నరికేశాడు. విజయనగరానికి సమీపంలోని ప్రసాద్‌నగర్‌లో సోమవారం రాత్రి జరిగిందీ ఘోరం. పోలీసులు, గ్రామస్తులు అందించిన వివరాలివి.
 
 విజయనగరం క్రైం: వేపాడ మండలం చినగుడిపాల గ్రామానికి చెందిన గజ్జి కృష్ణకు లక్కవరపుకోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన లక్ష్మి (25)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. కృష్ణ పొక్లెయిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లపాటు బెంగళూర్‌లో పనిచేసేవాడు. పెళ్లైన మొదట్లో లక్ష్మిని కృష్ణ బాగానే  చూసుకునేవాడు. మొదటి కాన్పులో ఆడపిల్లల వెంకటలక్ష్మి (4), రెండో కాన్పులో యశస్వని (3) జన్మించారు.
 
  రెండో కుమార్తె పుట్టాక లక్ష్మికి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇంకెవరినైనా పెళ్లాడితే మగపిల్లలు పుట్టేవారని తరచూ గొడవ పడుతుండటంతో లక్ష్మి కన్నవారింటికి వచ్చేసింది. సుమారు ఏడాది తొమ్మిదినెలలపాటు దంపతులు దూరంగా ఉన్నారు. భర్త ఎప్పటికీరాకపోవడంతో లక్ష్మి రెండు నెలల క్రితం లక్కవరపు కోట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు  కుటుంబాల పెద్దలను పోలీసులు పిలిచారు. దీంతో భార్య లక్ష్మిని బాగానే చూసుకుంటానని పెద్దల సమక్షంలో కృష్ణ అంగీకరించడంతో రాజీ కుదిర్చారు.
 
 ముందుస్తు వ్యూహం ప్రకారమే..
 ఈ క్రమంలో ఈనెల 1న విజయనగరం పట్టణానికి ఆనుకున్న బియ్యాలపేట పంచాయతీ ప్రసాద్‌నగర్‌లో ఎలుబండి రాజబాబు ఇంట్లో అద్దెకు దిగారు. ఇక్కడినుంచి విధులకు విశాఖపట్నం వెళ్లి  వస్తుండేవాడు. సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చాక భార్యభర్తలు రాత్రి భోజనాలు చేశారు. తొమ్మిది గంటల వరకు ఇంటి బయట కూర్చొని పడుకోవడానికి లోపలికి వెళ్లారు.
 
 అర్థరాత్రి వేళ లక్ష్మి నడుంపై కూర్చొని తలను పెకైత్తి కత్తితో పీక కోసేశాడు. బాత్‌రూమ్‌లోకి వెళ్లి కత్తిను కడిగి ఇంటిముందు ఉన్న తుప్పల్లో పారేసి పరారయ్యాడు. కృష్ణ తమ్ముడు సన్నిబాబు సమీపంలోని పాలకేంద్రంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో లోపలినుంచి ఇద్దరు పిల్లలు రోడ్డుపైకి వచ్చారు. వారిని చూసిన పొరుగింట్లోని ఎలుబండి నాగమణి లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో లక్ష్మి మృతదేహం కనిపించింది.
 
  దీంతో పక్కనే నివాసం ఉంటున్న కృష్ణ తమ్ముడు సన్నిబాబుకు, తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. లక్ష్మి మృతదేహాన్ని విజయనగరం డీఎస్పీ ఎ.వి.రమణ, విజయనగరం రూరల్ సీఐ ఎ.రవికుమార్, రూరల్ ఎస్‌ఐ టి.శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎస్‌ఐ హెచ్.ఉపేంద్రరావు, గంట్యాడ ఎస్‌ఐ టీవీ తిరుపతిరావు పరిశీలించారు. ఏఎస్‌ఐ టి.విజయ ఆధ్వర్యంలో క్లూస్ టీం సంఘటన స్థలంలో నిందితుని వేలిముద్రలను సేకరించింది.
 
 ఇంతకుముందే హత్యాయత్నం
 కృష్ణ ముందస్తు వ్యూహంలో భాగంగానే ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. ఈనెల 1న ఇంట్లో అద్దెకు దిగినప్పటికీ ఎలాంటి సామగ్రి తీసుకురాని కృష్ణ అతి పదునైన కత్తిని తీసుకుని వచ్చాడంటే ముందస్తుగానే హత్య చేయడానికి పథకం రచించినట్టు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం కృష్ణ విశాఖపట్నం జిల్లా రైవాడ జలాశయంలో లక్ష్మిని తోసి చంపేందుకు ప్రయత్నించాడు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చిన లక్ష్మి బాగా చూసుకుంటానన్న భర్తను నమ్మి వెళ్లి అంతమైపోయింది. ఒక్కగానొక్క కుమార్తె గొంతు కోశాడని మృతురాలి తల్లి గొలగాన కృష్ణమ్మ, తండ్రి సన్యాసిరావు బోరున విలపిస్తున్నారు. తల్లి హత్యకు గురవడంతో పిల్లలు అనాథలయ్యారు. వారిని స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
 

Advertisement

What’s your opinion

Advertisement