రికార్డు సాధించారు.. | Sakshi
Sakshi News home page

రికార్డు సాధించారు..

Published Tue, Sep 12 2017 11:58 PM

రికార్డు సాధించారు.. - Sakshi

– రెండు గంటల పాటు సాగిన మహిళల ఏరోబిక్‌ ప్రదర్శన
= జీనియస్‌ రికార్డ్సులో ‘అనంత’వాసులు


అనంతపురం కల్చరల్‌: మరోసారి ‘అనంత’ వాసులు జీనియస్‌ రికార్డును బద్దలు కొట్టారు. తొలిసారి రెండు గంటల పాటు సాగిన  నిర్విరామ మహిళల ఏరోబిక్‌ ప్రదర్శనతో  సరి కొత్త రికార్డును నెలకొల్పారు. వివరాల్లోకి వెళితే అనంతపురానికి చెందిన లహరి డాన్స్‌ అండ్‌ ఏరోబిక్‌ అకాడమీ మాస్టర్‌ హరిప్రసాద్‌ నేతృత్వంలో జీనియస్‌ రికార్డు కోసం సరికొత్త ప్రయత్నం జరిగింది. మంగళవారం సాయంత్రం నగరంలోని కృష్ణకళామందిరంలో అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళలు ఏరోబిక్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఎక్కడా విరామం లేకుండా ఆద్యంతం  ఉత్సాహంగా..ఉల్లాసంగా పలు విన్యాసాలను ప్రదర్శించి మెప్పించారు. పలువురు మహిళా ప్రముఖులతో పాటు జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు   నిర్వాహకులు డాక్టర్‌ స్వర్ణశ్రీ, నరేంద్రగౌడ్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికను అందుకున్నారు.

రికార్డు విజేతలు వీరే
జీనియస్‌ రికార్డు కోసం మహాలక్ష్మీ, జ్యోతి, ప్రవీణ, విజయ, సంధ్య, రమాదేవి, లేఖ, సనాఖాన్, కృష్ణవేణి, సుధారాణి, గౌతమి తదితర 11 మంది మహిళలతో పాటు మాస్టర్‌ ట్రైనర్‌ హరిప్రసాద్‌... అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్నారు.

మహిళల ప్రయత్నం స్ఫూర్తిదాయకం
‘అనంత’ మహిళలు సాధించిన రికార్డు జిల్లాకే స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే సతీమణి విజయలక్ష్మి, మాజీ మేయర్‌ రాగేపరుశురామ్‌ సతీమణి మణి పరుశురామ్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ రషీద్‌ అహమ్మద్‌ సతీమణి ముషీరాబేగం అన్నారు. ప్రదర్శనలో పాల్గొన్న మహిళల్లో చాలామంది గృహిణులే ఉన్నా.. అకుంఠిత దీక్షతో వారు యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జీనియస్‌ రికార్డ్సు నిర్వాహకులు మాట్లాడుతూ గతంలో కేవలం గంట సేపు మాత్రమే మహిళల ఏరోబిక్‌ ప్రదర్శన రికార్డుగా ఉండేదని, అనంత మహిళలు ఆ రికార్డును బద్దలు కొట్టారని తెలిపారు. ఈ ప్రదర్శనను రికార్డ్సులోకి త్వరలో అధికారికంగా  నమోదు చేయనున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement