చంద్రబాబు కళ్లు తెరవకపోవడం వల్లే.. | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కళ్లు తెరవకపోవడం వల్లే..

Published Tue, Jan 3 2017 4:46 PM

ys jaganmohan reddy lashes out at chandra babu



నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్లక్ష్యం, తప్పిదం వల్లే నెల్లూరులో బాణసంచా పేలుడు ప్రమాద ఘటన జరిగిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. గతేడాది తూర్పుగోదావరిలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, చంద్రబాబు కళ్లు తెరవకపోవడం వల్ల నెల్లూరులో మరో దుర్ఘటన జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదాలు జరగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.  బాణసంచా పేలుడు ఘటన మృతుల కుటుంబాలను వైఎస్‌ జగన్‌ మంగళవారం పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.


అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారు 80 శాతం గాయాలతో  చావుబతుకుల మధ్య పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు బతకడం కష్టమని వైద్యులు చెప్పారని, ఇక్కడికి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈ కుటుంబాలను పరామర్శించి భరోసా ఇవ్వాలని ఆలోచన లేదని విమర్శించారు. ప్రభుత్వం ఐటీడీఏ నిధులు ఇవ్వడం లేదని, ఎస్టీలకు ఉపాధి చూపడం లేదని అన్నారు. బాణసంచా పేలుడు ఘటనలో మరణించిన వారందరూ ఎస్టీలని, పనులు దొరక్కపోవడం వల్లే పేదవాళ్లు 200 రూపాయల కూలి కోసం ప్రాణాలకు తెగించి ఈ పనులు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని అన్నారు. బాధిత కుటుంబాలకు కాస్తో కూస్తో డబ్బులు ఇస్తే మాట్లాడరని ప్రభుత్వం భావిస్తోందని, అందువల్లే ప్రతి ఏటా ప్రమాదాలు జరుగుతున్నా కళ్లు మూసుకుని ఉంటోందని విమర్శించారు. బాధితులకు సర్కార్‌ అండగా నిలవకపోవడం దారుణమన్నారు. బాణసంచా యూనిట్‌లో భద్రత ప్రమాణాలు పాటించరని తెలిసీ, ప్రమాదకరమని తెలిసి కూడా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.

Advertisement
Advertisement