హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలి | Sakshi
Sakshi News home page

హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలి

Published Sat, May 27 2017 5:29 PM

హెక్టారుకు రూ.50 వేలు చెల్లించాలి - Sakshi

► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి

రాజంపేట టౌన్‌: ఇటీవల వీచిన పెనుగాలులకు నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని మిట్టమీదపల్లె, మేకవారిపల్లె, కొల్లావారిపల్లె, లక్షుంపల్లె, చవనవారిపల్లె గ్రామాల్లో పెనుగాలుల బీభత్సానికి దెబ్బతిన్న అరటి, బొప్పాయి పంటలను గురువారం సాయంత్రం ఆకేపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయంలో గాలుల బీభత్సం వల్ల అరటి, బొప్పాయి పూర్తిగా దెబ్బతినడంతో రైతులకు లక్షలాది రూపాయిల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నామమాత్రపు పరిహారం చెల్లిస్తే ఊరుకోం
ప్రభుత్వం రైతులకు నామమాత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటే ఆందోళన చేసైనా న్యాయం జరిగేలా చేస్తామని స్పష్టం చేశారు. పంట నష్టం గురించి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో లేవనెత్తేందుకు కృషి చేస్తానన్నారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు ఉద్యాన పంటలకు నష్టం వాటిళ్లితే హెక్టారుకు రూ.25 వేల చొప్పున మంజూరు చేశారని ఆకేపాటి గుర్తు చేశారు. ఇప్పుడు పెరిగిన ఖర్చుల దృష్ట్యా ప్రభుత్వం హెక్టారుకు రూ.50 వేల పరిహారం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం కన్వీనర్‌ గోవిందు బాలకృష్ణ, నాయకులు శవన వెంకటేశ్వర్లునాయుడు, గిరిప్రసాద్, నల్లపనేని నరసింహులు, నల్లపు రాజయ్య, డీ భాస్కర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement