Sakshi News home page

చేతలు అలా... మాటలు ఇలా..

Published Thu, Jan 11 2018 8:35 AM

people serious on cm chandrababu in janmabhoomi program - Sakshi

జిల్లాలో బుధవారం జరిగిన పలు జన్మభూమి సభల్లో నిరసన గళాలు వినిపించాయి. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం క్రిష్ణవరం గ్రామంలో అధికార పక్షానికి చెందిన సర్పంచి, ఎంపీటీసీ వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని దాడి చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లిలో కొత్తపల్లి, కుతుకుడుపల్లి గ్రామాలకు సంబంధించిన గ్రామసభలో అధికారులను నిలదీశారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో నివేశన స్థలాలు, సమస్యలు పరిష్కరించడం లేదని సీపీఐ (లిబరేషన్‌) పార్టీ నాయకులు అధికారులను నిలదీశారు.
 

ఒకే రోజు... ఒకే సమయం... విభిన్న అభిప్రాయాలు ... జన్మభూమి సభల్లో నిలదీతలు ... కాపులకు ఐదు శాతం రిజర్వేషన్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆందోళనలు...  సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు బుధవారం వచ్చిన సందర్భంగా జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలివీ. ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గున్నేపల్లిలో జరిగిన ‘జన్మభూమి–మా వూరు’ కార్యక్రమంలో పాల్గొనడానికి  సీఎం రాకను జిల్లా బీసీ సంఘాల నేతలు ‘బ్లాక్‌ డే’గా ప్రకటించాయి. 

సభా ప్రాంగణంలో నిరసనలు తెలపాలని భావించాయి. ముందస్తు హౌస్‌ అరెస్టులతో పోలీసులు భయోత్పాతం సృష్టించడంతో ఆయా సంఘాలు ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన జన్మభూమి సభల్లో జనం కన్నెర్ర చేసి నిలదీతల పరంపర కొనసాగించారు. సీఎం వచ్చి, వెళ్లేంత వరకూ ఇదే వేడి  కొనసాగింది. కాపులను బీసీల్లో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి ‘జన్మభూమి–మా ఊరు’ సభకు బుధవారం వచ్చిన సీఎం చంద్రబాబు సభలో నిరసన తెలియజేయాలన్న బీసీల వ్యూహాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేశారు. బీసీ నేతలను గృహ నిర్బంధాలు,... ముందుస్తు అరెస్టులతో ఇళ్లకే పరిమితం చేశారు. 

సాక్షి, రాజమహేంద్రవరం/ముమ్మిడివరం: కాపు కార్పొరేషన్‌ ద్వారా 2016 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 286 మందికి రుణాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లిలో జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో సూర్యనారాయణ అనే వ్యక్తితో అసత్యాలు చెప్పించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం చంద్రబాబు సభకు చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు బీసీ, కాపు కార్పొరేషన్‌ లబ్ధిదారులతో సభలో మాట్లాడించారు. ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్‌ నుంచి రెండు లక్షల రుణం తీసుకున్నానని, తనకు రుణం ఎలా వచ్చిందన్న విషయం సూర్యనారాయణ అనే వ్యక్తి వివరించారు. సీఎం చంద్రబాబు కాపు కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలో 34 వేల మంది కాపులకు రుణాలు ఇప్పించారని పేర్కొన్నారు. అంతకు కొద్ది నిమిషాల ముందు సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో 40 ఏళ్లుగా తాను నీతి, నిజాయతీలతో ఉన్నానని చెప్పిన తర్వాతే ప్రభుత్వం సూర్యనారాయణతో కాపు కార్పొరేషన్‌ ద్వారా 34 వేల మందికి రుణాలు ఇచ్చినట్లు చెప్పించడంతో సభకు వచ్చిన అధికారులు అవాక్కయ్యారు. 

ముమ్మిడివరంపై వరాల జల్లు
ముమ్మిడివరం నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న ఆరు ఆర్‌డబ్ల్యూఎస్‌ మంచినీటి పథకాల మరమ్మతుకు రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఐ.పోలవరం మండలం జి.ములపొలం–గొల్లగరువులో నిలిచిపోయిన వంతెన పనులకు సంబంధించి రూ. 60 కోట్లతో తిరిగి అంచనాలు రూపొందించి టెండర్లు పిలుస్తామన్నారు. గుజరాత్‌ పెట్రోలియం సంస్థ నుంచి మత్స్యకారులకు రావాల్సిన 12 నెలల నష్టపరిహరం ఇపించేందుకు చర్యలు తీసుకుంటామని çహామీ ఇచ్చారు. 

సభకు కాలేజీ బస్సులు.. విద్యార్థులకు అవస్థలు...
జన్మభూమి–మా ఊరు సభకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో కోనసీమలోని వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలలు, ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సులను నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు పంపించారు. ఆయా బస్సులలో డ్వాక్రా మహిళలు, రైతులు, పింఛన్‌ లబ్ధిదారులు వచ్చేలా డీఆర్‌డీఏ, వ్యవసాయ, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. 
ఆయా అధికారులు వారిని తీసుకురావడానికి, సీఎం ప్రసంగం పూర్తయ్యేవరకు ఉంచటానికి పడరాని పాట్లు పడ్డారు. సీఎం మాట్లాడుతుండగానే సభ నుంచి మహిళలు వెళ్లిపోవడంతో సభ పేలవంగా మారింది. డ్వాక్రా మహిళలు వెళ్లిపోతుండగా డీఆర్‌డీఏ అధికారులు బలవంతంగా వారిని సభలో కూర్చోబెట్టారు. 

పలు పనులకు శంకుస్థాపనలు... 
ముందుగా సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డీఆర్‌డీఏ స్టాల్స్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం రూ.35 కోట్లతో నిర్మించే ఐ.పోలవరం మండలం సలాది వారిపాలెం–పశువుల్లంక గోదావరిపాయపై వంతెన నిర్మాణ పనులకు, ముమ్మిడివరంలో  రూ.45 కోట్లతో నిర్మించే 133 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్, రూ. 25 కోట్లతో నిర్మించే మహిపాల చెరువు–పల్లంకర్రు ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విద్యుత్‌శాఖ మం త్రి కిమిడి కళా వెంకటరావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్, పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement