చివరంటా కుల వివక్ష వెన్నాడింది... | Sakshi
Sakshi News home page

చివరంటా కుల వివక్ష వెన్నాడింది...

Published Fri, Jan 29 2016 1:30 AM

చివరంటా కుల వివక్ష వెన్నాడింది... - Sakshi

మన విద్యా వ్యవస్థ దుస్థితికి అద్దంపట్టే రెండు ఉదంతాలు గణతంత్ర దినోత్స వానికి  పదిరోజుల ముందు  చోటుచేసుకున్నాయి. ఇందులో ఒకటి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లో యువ దళిత మేధావి రోహిత్ బలవ న్మరణమైతే...రెండో ఉదంతం తమిళనాడులోని విల్లుపురం జిల్లా కల్లెకురిచిలో ప్రకృతి వైద్యంలో డిగ్రీ చేస్తున్న ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్యలకు సంబంధిం చింది.

రోహిత్‌ను చివరంటా కుల వివక్ష వెన్నాడింది.  ఆయన మరణం వృథా కాలేదు. సమాజంలో అన్ని వర్గాలనూ అది కదిలించింది. ఇప్పటికీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విద్యార్థులకు అన్నివైపులనుంచీ నైతిక మద్దతు లభించింది. రాజకీయ పార్టీల నేతలు, పౌర సమాజ కార్యకర్తలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు...అందరూ గళం విప్పారు. దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం స్పందించింది. ఉన్నతశ్రేణి విద్యా సంస్థల్లో వేళ్లూనుకున్న కుల వివక్షపై విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది.

రోహిత్ మరణంపై ఉద్యమం సాగుతుండగానే నాలుగురోజులక్రితం తమిళ నాట ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్య మరో కోవకు చెందినది.  పేద, మధ్యతరగతి కుటుంబాలను పీల్చిపిప్పి చేస్తున్న విద్యా వ్యాపారంవల్ల తలెత్తిన సమస్య అది. ప్రాథమిక విద్యారంగంలో ఏదో చేస్తున్నట్టు కనిపిస్తూ, విద్యా హక్కు చట్టంలాంటివి అమల్లోకి తెచ్చిన పాలకులు ఉన్నత విద్యను మాత్రం పూర్తిగా వ్యాపారులకు వదిలిపెట్టేశారు. 14 ఏళ్ల వయసొచ్చే వరకూ నిర్బంధ, ఉచిత విద్యను అందిస్తామంటున్నవారు ఆ తర్వాత ‘మీ చావు మీరు చావాలంటున్నారు. ఆనాటికానాటికి ఆ వ్యాపారం విశ్వరూపం దాలుస్తున్నది. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కలలు కనే యువత ఆకాంక్షలను అడ్డంపెట్టుకుని లక్షలాది రూపాయలను ఫీజుల రూపేణా వసూలు చేస్తూ కోట్లు గడిస్తున్న విద్యా వ్యాపారులను ప్రభుత్వాలు చూసీచూడనట్టు వదిలేస్తున్నాయి. అధికారంలో ఉన్నవారికి కోట్ల రూపాయల్ని విరాళాల రూపేణా, ముడుపుల రూపేణా అందించడం అలవాటైన విద్యా వ్యాపారులు ఈ మధ్య కాలంలో పార్టీల నేతలుగా అవతారమెత్తుతున్నారు. చట్టసభల్లో ప్రవేశిస్తున్నారు. మంత్రులుగా అధికారం చలాయిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉన్నత విద్యా రంగం ఎంతగా భ్రష్టుపట్టిపోతున్నదో...నిరుపేద, మధ్య తరగతి యువత ఏ స్థాయిలో నష్టపోతున్నదో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

తమిళనాడులో జరిగిన ఉదంతం ఉన్నత విద్యారంగం వ్యాపారమయంగా మారిన తీరును కళ్లకు కడుతుంది. కనీస సదుపాయాలైనా లేని యోగా, నాచురోపతి మెడికల్ కళాశాల డిగ్రీ కోర్సుకు ఒక్కో విద్యార్థినుంచి రూ. 6 లక్షల మొత్తాన్ని ఫీజుగా వసూలు చేస్తోంది. సరిగా టీచర్లు లేకపోయినా, సక్రమంగా తరగతులు నడవకపోయినా...కనీస సదుపాయాలే కరువైనా అక్కడి ప్రభుత్వ యంత్రాంగానికి పట్టలేదు. ఈ కళాశాలను పర్యవేక్షించాల్సిన డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ అధికారులు తనిఖీలు జరిపినట్టు, అంతా సక్రమంగా ఉన్నట్టు రికార్డుల్లో రాసుకుపోతుంటే రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కళ్లు మూసుకుంది. దేశీయ వైద్య రంగంలోని కళాశాలల నియంత్రణ కోసం కేంద్రం ఏర్పాటుచేసిన భారతీయ వైద్య మండలి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది.

ఏడాది పాటు చదివాక తాము నేర్చుకున్నదేమీ లేదని, ఈ జ్ఞానంతో తమకు ఉద్యోగా వకాశాలు కూడా రావని దిగులుతో ఉన్న విద్యార్థినులకు  కళాశాల యాజమాన్యం వేధింపులు అదనం. ఈ కళాశాల తీరుతెన్నులపై అనేకసార్లు జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా, ఆరోగ్యమంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేసినా...చివరకు నిరుడు సెప్టెంబర్‌లో కలెక్టరేట్ ఎదుట విషం మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినా ఫలితం శూన్యం. వీటన్నిటితో విసుగెత్తిన ముగ్గురు ఆడపిల్లలు శరణ్య, ప్రియాంక, మోనిషాలు నాలుగు రోజులనాడు వ్యవసాయ బావిలో దూకి చనిపోయారు. ఆత్మహత్య చేసుకునే ముందు కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్ తదితరులు తమను డబ్బుల కోసం ఎలా హింసించారో, రశీదు కూడా ఇవ్వకుండా లక్షల రూపాయలు ఎలా వసూలు చేశారో చెప్పుకున్నారు. ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయాక నిందితుల్ని అరెస్టు చేశారు.

ఈ దుస్థితి తమిళనాడుకు మాత్రమే పరిమితమై లేదు. కాస్త హెచ్చుతగ్గులతో దేశమంతా ఉన్నత విద్యారంగం ఇలాగే అఘోరిస్తోంది. ఉన్నత చదువులు చదివి తేగానీ తమ పిల్లలు సామాజికంగా, ఆర్ధికంగా ఎదగడం అసాధ్యమని తెలుసు కుంటున్న పేద వర్గాలకు ప్రభుత్వ రంగం మొండిచేయి చూపిస్తోంది. డిమాం డుకు అనుగుణంగా కళాశాలల సంఖ్యను పెంచాల్సి ఉన్న ప్రభుత్వాలు తమ బాధ్యతను గాలికొదిలి ప్రైవేటు కళాశాలలకు ఎడాపెడా అనుమతులిస్తున్నాయి. ఈ క్రమంలో వాటి ప్రమాణాలేమిటో, అక్కడున్న సౌకర్యాలేమిటో పట్టించుకున్న పాపాన పోవ డంలేదు. పరిమితంగా సీట్లుండే ప్రభుత్వ రంగ కళాశాలలకు పోటీ ఎక్కువగా ఉండటం, అందులో తమ పిల్లలు విజయం సాధించలేకపోవడం చూస్తున్న తల్లిదండ్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు రంగ కళాశాల వైపు చూడక తప్పడం లేదు. ఆ ఫీజులు తమ కుటుంబాల వార్షిక వ్యయానికి ఎన్నో రెట్లు అధికంగా ఉన్నా అప్పులు చేయడానికి వెనకాడటం లేదు. సర్కారీ గుర్తింపు ఉన్న సంస్థ కదానన్న ధీమాతో పిల్లల్ని చేర్పిస్తున్నారు. ఏటా కోట్లు గడిస్తున్న విద్యా వ్యాపారులు రాజకీయంగా ఎదిగి అందరినీ తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటున్నారు. పర్యవసానంగానే ఎన్నాళ్లుగానో విద్యార్థులు సాగిస్తున్న ఆందోళనలు అరణ్యరోదనలయ్యాయి.

మన దేశంలో ప్రజారోగ్య రంగం రోగగ్రస్తమై ఉంది. వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో లేక పల్లెసీమలు అల్లాడుతున్నాయి. తగినన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి ఈ స్థితిని మార్చడానికి బదులు పాలకులు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే ప్రైవేటు వైద్య కళాశాలలు ఏటా రూ. 1,000 కోట్లు ఆర్జిస్తున్నాయని అంచనా. ఈ నిలువుదోపిడీని నిలదీయలేని, నియంత్రించలేని సమాజం వైఖరిని శపిస్తూ ఆ ముగ్గురు పిల్లలూ ప్రాణాలు తీసుకున్నారు. ఈ బలిదానాలైనా విద్యా వ్యాపారంపై అందరి దృష్టీ పడేలా చేస్తే సమాజానికి మేలు కలుగుతుంది.

Advertisement
Advertisement