ఇది న్యాయమేనా?! | Sakshi
Sakshi News home page

ఇది న్యాయమేనా?!

Published Tue, May 2 2017 12:37 AM

ఇది న్యాయమేనా?! - Sakshi

పుట్టి మూడేళ్లయినా కాకుండానే భూసేకరణ చట్టం సమస్యలను ఎదుర్కొం టున్నది. దాన్ని మారిస్తే తప్ప పరిశ్రమలూ, ప్రాజెక్టులూ వచ్చే అవకాశం లేదని వాపోయే పాలకుల స్వరం అంతకంతకూ హెచ్చుతోంది. పర్యవసానంగానే ఆ చట్టంలోని అంశాలకు తూట్లు పొడిచేలా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో భూసేకరణ చట్టాలు తయారవుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఆదివారం ఉభయ సభల ప్రత్యేక సమావేశం పెట్టి ఏ చర్చా లేకుండా ఆమోదించిన భూసేకరణ సవరణ బిల్లు కూడా ఆ కోవలోనిదే. తీవ్ర గందరగోళం మధ్య అసెంబ్లీలో పది నిమిషాల లోపు... మండలిలో అయిదే నిమిషాల్లో ఆ బిల్లు సునాయాసంగా గట్టెక్కింది. లక్షలాది బక్క రైతుల, బడుగుల తలరాతలను నిర్ణయించే కీలకమైన బిల్లుకు ఈ గతి పట్టడం విచారం కలిగిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టానికి కేంద్రం సూచించిన విధంగా మార్పులు చేసి తాజా సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.

రాష్ట్రాల్లో పుట్టుకొస్తున్న భూసేకరణ చట్టాలకున్న నేపథ్యాన్ని ఒకసారి గమనించాలి. భూసేకరణ చట్టం–2013 దేశమంతా 2014 జనవరి 1 నుంచి అమల్లోకొచ్చింది. ఆ పన్నెండు నెలల్లో అది పెద్దగా అమలైన వైనమూ లేదు. సమస్యలొచ్చిన దాఖలా అంతకన్నా లేదు. కానీ ఆ ఏడాది చివరికొచ్చేసరికల్లా  ఆచరణలో సమస్యలు తలెత్తుతున్నాయంటూ కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆ తర్వాత దాని స్థానంలో లోక్‌సభలో బిల్లు ప్రవేశ పెట్టారు. అది ఆమోదం పొందింది. రాజ్యసభలో సాధ్యపడక మూడుసార్లు ఆ ఆర్డినెన్స్‌నే మళ్లీ మళ్లీ జారీచేశారు. చివరకు బిహార్‌ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన తరుణంలో ఇక భూసేకరణ చట్టం జోలికి వెళ్లదల్చుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ ద్వారా ప్రకటించారు. అంతటితో అది ఆగి ఉంటే వేరుగా ఉండేది. కానీ రాష్ట్రాలు వాటి ‘అవసరాలరీత్యా’ మార్పులు చేసుకోవచ్చునని కేంద్రం ప్రకటించింది.

పర్యవసానంగా ఇప్పటికే గుజరాత్‌ అసెంబ్లీ కొత్త చట్టాన్ని తెచ్చుకుంది. మధ్యప్రదేశ్, ఒడిశాలు ఆ పనే చేయబోతున్నాయి. యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లో ఏర్పడ్డ బీజేపీ సర్కారు కూడా భూసేకరణకు చట్టం తీసుకొస్తామని చెప్పింది. యూపీ విజయం తర్వాత...రాజ్యసభలో మున్ముందు తమ బలం పెరిగే అవకాశం ఉండటం వల్లా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మరో ప్రయత్నం చేయదల్చుకున్నట్టు కనబడుతోంది. భూసేకరణ చట్టం సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)పని దాదాపు స్తంభించినా దాన్ని పొడిగించాలని ఈ మధ్య నిర్ణయించడంలోని ఆంతర్యం ఇదే కావొచ్చు.


సొంతంగా భూసేకరణ చట్టాలు తీసుకురావడానికి ప్రభుత్వాలు చెబుతున్న కారణం ఒక్కటే– 2013 చట్టం ప్రకారం భూమిని సేకరించడం కష్టంగా మారిందన్నదే. కానీ అందులోని నిజానిజాలేమిటో ఎవరికీ తెలియదు. పాత చట్టం రావడానికి ముందు దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాల్లో ఉద్యమాలు తలెత్తాయి. ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పలుచోట్ల పోలీసు కాల్పుల్లో పదులకొద్దీ మంది ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి సింగూరు, పోస్కో, వేదాంత వగైరా ప్రాజెక్టుల్లో భూమి కోల్పోయిన రైతులు ఉద్యమించిన తీరు చూశాకే 120 ఏళ్ల చట్టానికి ఎప్పుడు ముగింపు పలుకుతారని ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది.

కొత్త చట్టం తీసుకొస్తామని ఆ ప్రభుత్వం ప్రకటించక తప్పలేదు. అలా చెప్పాక కూడా మరో అయిదారేళ్లకుగానీ భూసేకరణ చట్టం సాధ్యం కాలేదు. ఆ చట్టం విషయంలోనే ఉద్యమ సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ‘ప్రజోపయోగం’ అన్న పదానికి చట్టంలో విస్పష్టమైన నిర్వచనం లేదని, మార్కెట్‌ విలువకు పట్టణాల్లో అయితే రెండు రెట్లు, పల్లెల్లో అయితే నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలన్న నియమం ఉన్నా మార్కెట్‌ విలువను ఏ ప్రాతిపదికన లెక్కేస్తారో అందులో చెప్పలేదని వారు విమర్శించారు.


ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు ప్రాజెక్టులు, ఇతర ప్రజోపయోగమైన అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో సామాజిక ప్రభావ అంచనా(ఎస్‌ఐఏ) అవసరం లేదంటున్నది. కాలయాపనను ఇందుకు సాకుగా చెబుతోంది. నిజానికి 2013 చట్టం మూడు నెలల వ్యవధిలో ఎస్‌ఐఏ పూర్తికావాలని నిర్దేశిస్తోంది. లక్షలాదిమంది కుటుంబాల జీవికతో ముడిపడి ఉండే ఒక సమస్యపై మూడు నెలలపాటు అధ్యయనం చేయడం కూడా ప్రభుత్వానికి కాలయాపనలా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వెనకటి తేదీల నుంచి అమల్లోకొచ్చేలా బిల్లు రూపొందిన నేపథ్యంలో ఎస్‌ఐఏ అవసరమే లేకుండా చేశారన్న అభిప్రాయం కలుగుతోంది.

మెరుగైన పరిహారం, పునరావాసం ఇవ్వదల్చుకున్న రాష్ట్రాలు చట్టానికి సవరణలు తీసుకురావచ్చునన్న కేంద్ర చట్టంలోని 107వ నిబంధనను అడ్డం పెట్టుకుని తాజా సవరణ బిల్లు తీసుకొచ్చారు. కేంద్ర చట్టం ద్వారా వచ్చే పరిహారానికి మించి కొత్త చట్టం ద్వారా లభించేలా చేస్తామన్న హామీ నిలిచేది కాదు. ఆ చట్టమే మార్కెట్‌ రేటు ఎలా నిర్ణయిస్తారన్న అంశంలో మౌనంగా ఉన్న ప్పుడు...రైతుకు కొత్త చట్టం ద్వారా అంతకంటే ఎక్కువొస్తుందని ఎలా అను కోవాలి? కలెక్టర్లు పరిహారం, పునరావాసం నిర్ణయించే సందర్భాల్లో రైతులు అభ్యంతరాలు దాఖలు చేసుకోవడానికి కేంద్ర చట్టం అవకాశం కల్పిస్తోంది.

వాటిని పరిశీలించాకే భూసేకరణపై తుది నిర్ణయం తీసుకోమని నిర్దేశిస్తోంది. కొత్త బిల్లు ఆ వెసులుబాటును తొలగిస్తోంది. ‘అత్యవసర సేకరణ’ అవసరమైనప్పుడు పార్ల మెంటు ఆమోదం అవసరమని కేంద్ర చట్టం చెబితే... అందుకు బదులు ఒక పాలనా ఉత్తర్వు సరిపోతుందని తెలంగాణ బిల్లు అంటున్నది. చిత్రమేమంటే ఇంచుమించు ఈ అంశాలన్నీ కేంద్రం గతంలో తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌లో ఉన్నాయి. కోట్లాదిమందిని కూడగట్టి తెలంగాణను సాధించిన ఉద్యమ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం ఇలాంటి సవరణలకు పూనుకోవడం, వాటిపై కనీసం చర్చకు కూడా చోటీయకపోవడం ఆశ్చర్యకరం... దురదృష్టకరం.

Advertisement
Advertisement